నాగార్జునసాగర్‌కి ముప్పు?
posted on Apr 8, 2015 3:39PM

నాగార్జున సాగర్‌కి ముప్పు పొంచి వుందా? అవుననే అంటున్నాయి పోలీసు వర్గాలు. నల్గొండ జిల్లాలో సిమి ఉగ్రవాదుల ఘాతుక చర్యలు, వరుసగా జరిగిన ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో ఉగ్రవాదులు ప్రతీకార చర్యలకు పాల్పడే ప్రమాదం వుందని భావిస్తున్నారు. ఐదు సంవత్సరాల క్రితం బెంగుళూరులో కొంతమంది ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నప్పుడు నాగార్జున సాగర్ డ్యామ్ పేల్చివేయాలన్న తీవ్రవాదుల కుట్ర వెలుగులోకి వచ్చింది. దీనికితోడు సిమి ఉగ్రవాద సంస్థలో కీలకంగా ఉండే ఒక తీవ్రవాది నాగార్జున సాగర్‌కి చెందినవాడు కావడంతో అప్పటి నుంచి ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి ఏ ఘటన జరిగినా నాగార్జున సాగర్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ఇప్పుడు మరోసారి ఉగ్రవాదుల ఘటనలు జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సిమి ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌కు ప్రతీకార చర్యలకు అవకాశం ఉందనే నిఘావర్గాల హెచ్చరించడంతో నాగార్జునసాగర్‌లో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ రెడ్ అలర్ట్ ప్రకటించింది. సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో తెలంగాణ, ఆంధ్ర, మధ్యప్రదేశ్, ఎన్‌ఐఏ బలగాలు మకాం వేసి ఉగ్రమూలాలను శోధిస్తున్నాయి. సాగర్ డ్యాం భద్రతపై నిఘా వర్గాలు మరోసారి దృష్టి సారించాయి.