TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విశ్వసనీయతకు పరీక్ష పెట్టిన ఎన్నికలు

Published on: Wed May 7, 2014 10:06PM

 

ఈరోజు సీమాంద్రాలో జరిగిన ఎన్నికలు తెదేపా, వైకాపాల మధ్యనే ప్రధానంగా జరిగాయని చెప్పవచ్చును. ఆ రెండు పార్టీలకు ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్య వంటివి గనుక పోలింగు ముగిసే వరకు కూడా రెండు పార్టీలనేతలు, కార్యకర్తల మధ్య అనేక చోట్ల ఘర్షణలు జరిగి, ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కానీ ఈ పరిస్థితిని ముందే ఊహించిన ఎన్నికల కమీషన్ భారీ ఎత్తున పోలీసు బందోబస్తు చేయడంతో కొన్ని సంఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగానే ముగిసాయి. ఈసారి దాదాపు 80 శాతం వరకు పోలింగు జరిగి ఉండవచ్చని ఎన్నికల కమీషనర్ భంవార్ లాల్ ప్రకటించారు. ఈసారి వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా ఓటు విలువ గురించి, ఓటు వేయవలసిన ఆవశ్యకత గురించి తెలియజెపుతూ ఎన్నికల కమీషనర్ భన్వర్ లాల్ స్వయంగా యువతతో అనేక సదస్సులు నిర్వహించి బాగా ప్రచారం చేసినందున ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగింది.

 

ఇక ఓటింగు శాతం పెరగడానికి మరో కారణం, రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పాలనే ప్రజలలో పట్టుదల, ప్రధాన పోటీదారులుగా నిలిచిన తెదేపా, వైకాపాల పట్ల కూడా తమ అభిప్రాయం ఖచ్చితంగా తెలియజేయాలని ప్రజలు భావించడమే. అందువల్ల ఈ ఎన్నికలు ఆ రెండు పార్టీల విస్వసనీయతకు పరీక్ష వంటివని కూడా చెప్పవచ్చును.

 

తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు, వైకాప అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కూడా షరా మామూలుగానే తామే గెలుస్తామని ప్రకటించేశారు. ఈ ఎన్నికల ఫలితాలు పూర్తిగా ఏకపక్షంగా వైకాపాకు అనుకూలంగా రాబోతున్నాయని జగన్మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ తాము ఊహించిన విధంగానే ఈసారి పోలింగు శాతం గణనీయంగా పెరిగింది గనుక తప్పకుండా తమ పార్టీయే విజయం సాధిస్తుందని విస్వాసం వ్యక్తం చేసారు. ఆ రెండు పార్టీలలో ప్రజలు దేనిని విశ్వసిస్తున్నారో మరి కొద్ది రోజులలో అంటే మే-16న తేలిపోనుంది.