నకిలీ ఓటర్లతో ఎన్నికలు నిర్వహణ, ప్రజాస్వామ్యం అపహాస్యం

 

రాష్ట్ర ఎన్నికల కమీషన్ అధికారి బన్వర్ లాల్ కడప జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాజకీయ పార్టీ నేతలను, అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ కడప జిల్లా మొత్తం మీద దాదాపు లక్ష నకిలీ (డూప్లికేట్) ఓటర్లను తాము గుర్తించామని, అందులో దాదాపు సగం మంది కడప మునిసిపల్ కార్పోరేషన్ పరిధిలోనే ఉన్నారని ఆయన తెలిపారు. అటువంటి నకిలీ ఓటర్లను ఏరివేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు తమకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేసారు.

 

అధికారుల దృష్టికి వచ్చినవి లక్ష ఓట్లు అయితే, ఇంకా లెక్కకు రానివి ఎన్ని లక్షలు ఉన్నాయో ఎవరికీ తెలియదు. కడప జిల్లాలో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తున్న వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి గత ఉప ఎన్నికలలోజైలు నుండే పోటీ చేసినపుడు అత్యంత భారీ మెజార్టీతో విజయం సాధించారు. బన్వర్ లాల్ చెప్పిన దాని ప్రకారం చూస్తే, ఆయనకు పోలయిన ఓట్లలో ఇటువంటి నకిలీ ఓట్లు కూడా ఉన్నయనని అర్ధం అవుతోంది.

 

రాజకీయ పార్టీలే, తమ ప్రయోజనం కోసం ఈ నకిలీ ఓటర్లను సృష్టిస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ, ఎన్నికల కమీషన్ అటువంటి వారిని గుర్తించి ఏరిపారేయడంలో వైఫల్యం చెందుతోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో కూడా నకిలీలను, బోగస్ వోటర్లను ఏరిపారేయడం పెద్ద కష్టమేమి కాదు. అయినప్పటికీ, ఎన్నికల కమీషన్ ఆ పని ఎందుకు చేయలేకపోతోందో తెలియదు. ఈ నకిలీ ఓటర్ల సమస్య ఒక్క కడప జిల్లాకే కాక యావత్ దేశమంతా ఉంది. అంటే, దేశవ్యాప్తంగా కొన్ని లక్షల్లోనో, లేక కోట్లలోనో ఈ నకిలీ ఓటర్లు ఉండే అవకాశం ఉంది.

 

డిశంబరులో నాలుగు రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు, ఏప్రిల్లో దేశవ్యాప్తంగా సాధారణ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఇటువంటి నకిలీ ఓటర్లను ఏరిపారేయకపోతే, ప్రజాస్వామ్య వ్యవస్థ అపహాస్యం అవుతుంది.