జీఎస్టీలో అవకతవకలు.. కేసీఆర్ పై ఈడీ కేసు
Published on: Fri Oct 11, 2024 2:46PM

గత ఏడాది డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం తరువాత ప్రజా జీవితంలో ఎక్కువగా కనిపించకుండా ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి ముఖం చాటేస్తున్నారు. ఎక్కడా బయట కనిపించకుండా పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. పార్టీ నేతలకు, క్యాడర్ కు కూడా అందుబాటులో ఉండటం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ పై బీఆర్ఎస్ ఆందోళనలు చేపట్టిన సమయంలో కూడా ఆయన బయటకు రాలేదు.
రైతు రుణమాఫీ విషయంలో రేవంత్ సర్కార్ పై బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావులు మాత్రమే గొంతెత్తి విమర్శించారు. కేసీఆర్ మాత్రం మౌనం వీడలేదు. అయితే ఆయనపై తాజాగా ఈడీ కేసు నమోదు అయ్యింది. ఇప్పుడైనా కేసీఆర్ మౌనం వీడి గొంతెత్తుతారా లేదా అని బీఆర్ఎస్ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నారు. ఇంతకీ ఈడీ కేసీఆర్ పై ఎందుకు కేసు నమోదు చేసిందంటూ.. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జీఎస్టీ చెల్లింపులలో 46 కోట్ల మేర అవకతవలు జరిగినట్లు గుర్తించిన ఈడీ కేసీఆర్ పై కేసు నమోదు చేసింది. ఇప్పటికే ఇదే విషయంపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి విదితమే. ఇందుకు సంబంధించి ఇప్పుడో ఇహనో ఈడీ కేసీఆర్ కు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని అంటున్నారు.


