TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జేసీ సోదరుల నివాసాల్లో ఈడీ సోదాలు

Published on: Fri Jun 17, 2022 12:26PM

ఈడీ దాడులు ఎప్పుడు జరిగినా సంచలనమే. ఆ దాడులు రాజకీయ నాయకుల నివాసాలలో అయితే మరింత సంచలనం. అందులోనూ తాడిపత్రిలో జేసీ సోదరుల నివాసాలపై ఈడీ దాడులంటే రాష్ట్ర మంతటా ఆ దాడుల ప్రకంపనలు వినిపిస్తాయి. కనిపిస్తాయి. ఇప్పడు అదే జరుగుతోంది తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి తో పాటు ఆయన  ముఖ్య అనుచరుడు క్లాస్ వన్ కాంట్రాక్టర్ గోపాల్ రెడ్డి ఇళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  అధికారులు తనిఖీలు చేపట్టారు. జేసీ ప్రభాకర్ రెడ్డి సహా కుటుంబ సభ్యుల సెల్‌ఫోన్ల ను సైతం ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బయట వ్యక్తులు ఎవరూ ఇంట్లోకి రానీయడం లేదు.  గతంలో అశోక్ లేల్యాండ్ నుంచి కొనుగోలు చేసిన వాహనాల విషయంలో జరిగిన లావాదేవీలపై ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.

తనిఖీల సమయంలో జేసీ సోదరులు ఇళ్లలోనే ఉన్నారు.  ఈడీ దాడుల నేపథ్యంలో జేసీ ఇంటికి సమీపంలో పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులను కూడా  పెద్ద ఎత్తున మోహరించారు.  జేసీ ఇంటిపై ఈడీ రైడ్స్ నేపథ్యంలో తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది.  

అదే విధంగా హైదరాబాద్ లోని జేసీ బ్రదర్స్ కు చెందిన నివాసాలలోనూ ఈడీ సోదాలు జరుగుతున్నాయి. ఏక కాలంలో  తాడిపత్రిలోనూ, హైదరాబాద్ లోని జేసీ బ్రదర్స్ నివాసాలపై ఈడీ దాడులు జరగడం గమనార్హం.  

రాజకీయ వేధింపులలో భాగమే ఈ దాడులు అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈడీ అధికారులు మాత్రం యధా ప్రకారం బస్సుల అక్రమ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన ఆరోపణలపైనే ఈ దాడులు నిర్వహిస్తున్నామని చెబుతున్నారు.