మరో ఆర్థిక మాంద్యం రానుందా!

 

ఆర్థిక మాంద్యం అంటే ఎప్పుడో 1929లో అమెరికాని కుదిపివేసిన సంఘటనే అనుకునేవారు ఒకప్పుడు. కానీ ప్రపంచీకరణ పుణ్యమాని 1999, 2009 ప్రాంతాల్లో వచ్చిన ఆర్థికమాంద్యం మన దేశానికి కూడా దివాళా పాఠాలను నేర్పింది. పరిస్థితులు చూస్తుంటే మరో ఆర్థికమాంద్యం నిదానంగా మన జీవితాలలోకి ప్రవేశించనున్నదన్న అనుమానాలు కలుగక మానవు. ఎందుకంటే...

 

చైనా మొరాయిస్తోంది! ఈ ఏడాది మొదలవుతూనే చైనా తన ఆర్థిక పురోగతి చాలా తక్కువగా ఉండబోతోందంటూ (7%) ప్రకటించింది. ఇప్పటి వరకూ వెలువడిన గణాంకాలన్నీ కూడా చైనా భయాలకు అనుగుణంగానే ఉన్నాయి. చైనాలో అభివృద్ధి పాతికేళ్ల కనిష్ట స్థాయికి చేరుకుందంటూ విశ్లేషకులు పేర్కొంటున్నారు. నానాటికీ పెరిగిపోతున్న కూలీ ఖర్చులు, రుణాలు, ప్రభుత్వ జోక్యం... చైనా పాలిట శాపంగా మారాయి. అక్కడ ఉన్న పరిమిత వనరులను ఎడాపెడా తవ్విపారేయడంతో, బొగ్గు, స్టీల్ వంటి ఉత్పత్తులు మునుపులా లాభాలను తెచ్చిపెట్టే స్థితిలో లేవు. అలా ఉత్పాదకతలో ప్రపంచంలోనే తొలి స్థానంలో ఉన్న చైనా వైఫల్యం చెందడంతో, ఆ ప్రభావం మొత్తం ప్రపంచం మీదే పడనుంది.

 

చమురు వదిలిపోతోంది! గత 13 ఏళ్లలో ఎప్పుడూ లేనంత కనిష్ట స్థాయికి చమురు ధర పడిపోయింది. చమురు కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న గిరాకీని మించి చమురుని ఉత్పత్తి కావడమే ఇందుకు కారణం. అయితే ఈ పరిస్థితికి సౌదీ అరేబియా దురుద్దేశాలే కారణం అంటున్నారు విశ్లేషకులు. ఒక పక్క గిరాకీ పడిపోతోందని తెలిసినా సౌదీ అరేబియా తన ఉత్పత్తిని తగ్గించలేదు సరికదా, మరింతగా పెంచిపారేసింది. దీని వల్ల చమురు మీద ఆధారపడిన ఇతర దేశాలు తీవ్రంగా నష్టపోతాయనీ, భవిష్యత్తులో తనదే ఏకఛత్రాధిపత్యం అవుతుందని సౌదీ వ్యూహం. సౌదీ ఆశించినట్లుగానే చమురు మీద ఆధారపడిన వెనిజులా లాంటి చిన్నాచితకా దేశాలు ఈ దెబ్బకి కుప్పకూలిపోయాయి. ఇక సంపన్న దేశాలైన ఇరాక్‌, రష్యా, ఇరాన్‌ల పరిస్థితి కూడా నానాటికీ దిగజారిపోతోంది.

 

ఇతరత్రా సమస్యలెన్నో! చైనా, సౌదీ అరేబియాల వల్ల కలుగుతున్న సమస్యలు కొన్నైతే... వివిధ దేశాలలో ఉన్న అనిశ్చితి మరో కారణం. ఇటు సిరియా, ఆఫ్గనిస్తాన్‌, టర్కీ దేశాలేమో ISIS వంటి ఉగ్రవాద సంస్థల పంజాలో విలవిల్లాడిపోతున్నాయి. అటు ఉక్రెయిన్, సొమాలియా వంటి దేశాలు అంతర్యుద్ధంలో మునిగిపోయాయి. ఒక దేశంలో కరువైతే, ఒక దేశంలో భూకంపాలు. ఒక దేశంలో పేదరికం తాండవిస్తుంటే, మరో దేశంలో రాజకీయ అనిశ్చితి సాగుతోంది. ఇలా ఒకో దేశానిదీ ఒకో కన్నీటి కష్టం!

 

మన పరిస్థితో! మిగతా దేశాలతో పోలిస్తే మన దేశం పరిస్థితి కాస్త మెరుగేనని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి దేశంలో ద్రవ్యోల్బణం 5.53% వద్ద అదుపులోనే ఉంది. విదేశీ పెట్టుబడులు ఎన్నడూ లేనంత స్థాయికి చేరుకున్నాయి. ఆర్థిక పురోగతి కూడా 7.8 శాతానికి చేరుకోవచ్చునని భావిస్తున్నారు. అంతమాత్రాన పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవడానికి లేదు. దేశంలోని చాలా ప్రాంతాల్లో కరువు విలయతాండవం చేస్తోంది. వ్యవసాయ ఉత్పత్తి తీవ్రంగా పడిపోయింది. దేశంలోని కనీసం అయిదు రాష్ట్రాల్లో రాజకీయ అనిశ్చితి కనిపిస్తోంది. రానున్న రోజుల్లో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోనున్నాయంటూ నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఏడాది కనుక వర్షపాతం సరిగా లేకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడానికే భయం వేస్తోంది.

 

కిం కర్తవ్యం! ఆర్థికమాంద్యం చాలా చిత్రమైన పరిస్థితి. అది వస్తోందని గ్రహించే లోపులే ఒక్కసారిగా సమాజాన్ని చుట్టుముట్టేయగల సునామీ! ఫలానా కారణం అని చెప్పుకునే అవకాశం ఇవ్వకుండానే, మన జేబుల్ని గుల్ల చేసి పారేసే మాయావి. వీలైనంత జాగరూకతతో ఉండటమే దాన్ని ఎదుర్కొనేందుకు ఏకైక మార్గం. మునుపు ఆర్థిక మాంద్యం ఏర్పడినప్పుడు మన దేశానికి కలిగిన నష్టం చాలా తక్కువనే చెప్పుకోవచ్చు. మన మధ్యతరగతి జీవన విధానం, మన బ్యాంకుల పటిష్ట స్థితే ఇందుకు కారణం అని చెబుతారు. అందుకే విదేశాల మీద ఆధారపడిన కాల్‌సెంటర్‌ ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్‌ నిపుణులు మాత్రమే అప్పట్లో ఎక్కువగా నష్టపోయారు. కానీ ఈసారి పరిస్థితులు కాస్త భిన్నంగా కనిపిస్తున్నాయి. విలాసవంతమైన జీవనానికి అలవాటు పడే ఎగువ మధ్యతరగతి ప్రజల సంఖ్య పెరిగిపోయింది. బ్యాంకుల ప్రతిష్ఠ తీవ్రంగా మసకబారిపోయింది.

 

ప్రమాద ఘంటికలు మొదలయ్యాయా! ఇప్పటికే ఆర్థికమాంద్యాన్ని సూచించే పరిస్థితులు అక్కడక్కడా కనిపిస్తున్నాయి. యాపిల్‌ వంటి ప్రఖ్యాత కంపెనీలన్నీ ఎప్పుడూ లేనంత తక్కువ లాభాలను నమోదు చేస్తున్నాయి. మున్ముందు కూడా ఆర్థిక వాతావరణం ఏమంత అనుకూలంగా ఉండబోదని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ఈపాటికే తేల్చి చెప్పింది. బ్రెజిల్‌, అర్జంటినా, గ్రీస్ వంటి దేశాలు ఇప్పటికే ఆర్థికమాంద్యంలోకి జారుకుంటున్న వార్తలు వినిపిస్తున్నాయి. వెరసి రానున్న కాలం కాస్తా గడ్డుగానే ఉండబోతోందన్న భయం స్పష్టమవుతోంది. మరి ఈ విషయాన్ని మన ఘనత వహించిన ఆర్థికవేత్తలు గుర్తిచారా? గుర్తిస్తే ఎలాంటి ముందస్తు చర్యలను తీసుకోనున్నారు?... అన్నదే మనకి తెలియాల్సి ఉంది.