వైన్ తాగితే మెదడుకి మంచిదా!

 

దాదాపు పదివేల సంవత్సరాల నుంచి మనిషి వైన్ పుచ్చుకుంటూనే ఉన్నాడు. హద్దులు దాటకుండా వైన్ తాగితే ఆరోగ్యానికి మంచిదన్న వాదనలూ ఉన్నాయి. గుండెజబ్బులు, డయాబెటిస్, పక్షవాతం, పేగు కేన్సర్- ఇలా చాలా సమస్యలు రాకుండా, వచ్చినా ప్రాణాంతకం కాకుండా వైన్ కాపాడుతుందట. ఇప్పుడు వైన్ తాగడం వల్ల ఏకంగా మెదడులోని న్యూరాన్లు ఆరోగ్యంగా ఉంటాయని చెబుతున్నారు పరిశోధకులు.

 

స్పెయిన్కు చెందిన Institute of Food Science Research పరిశోధకులు మెదడు మీద వైన్ ప్రభావాన్ని అంచనా వేసే ప్రయత్నం చేశారు. ప్రతి ఆహారమూ మన శరీరంలో కొన్ని ప్రత్యేక రసాయనాలను విడుదల చేస్తుంది. అలాగే వైన్ వల్ల కూడా కొన్ని రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. వీటిని wine-derived human gut metabolites అంటారు. వైన్ పుచ్చుకునేవారి జీర్ణాశయం నుంచి పరిశోధకులు ఈ metabolitesను సేకరించారు.

 

వైన్ తాగేవారి metabolites ప్రభావం న్యూరాన్ల మీద ఎలా పనిచేస్తుందో గమనించే ప్రయత్నం చేశారు. అనారోగ్యం, వృద్ధాప్యం, ఒత్తిడి వంటి పరిస్థితుల్లో ఈ న్యూరాన్లు సరిగా పనిచేయవు. న్యూరాన్ల పనితీరు సవ్యంగా లేకపోతే మెదడు పనితీరు కూడా మందగిస్తుంది. అది మతిమరపు, పార్కిన్సన్స్, అల్జీమర్స్ వంటి వ్యాధులకు దారితీస్తుంది.

 

వైన్ పుచ్చుకున్నవారిలోని metabolites, న్యూరాన్లని రక్షించే ప్రయత్నం చేయడం చూసి శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. వైన్ నుంచి వెలువడిన రసాయనాలు న్యూరాన్లు నిర్జీవం కాకుండా కాపాడుతున్నాయని గమనించారు. అయితే మోతాదు మించకుండా వైన్ పుచ్చుకుంటేనే ఈ ఉపయోగం ఉంటుందనీ.... హద్దు దాటితే అసలుకే మోసం వస్తుందనీ హెచ్చరిస్తున్నారు. ఒక అంచనా ప్రకారం ఆడవారైతే ఒక గ్లాసు, మగవారు రెండు గ్లాసులను మించకుండా తాగితే మోతాదులో తాగినట్లు లెక్క! మరి అ లెక్కకు మించకుండా చుక్క వేసుకుంటారా లేదా అన్నది అనుమానమే!

- నిర్జర.