మందు తాగితే గుండెకు మంచిదా!

మోతాదు మించకుండా మద్యం పుచ్చుకుంటే ఏం కాదు, పైగా ఆరోగ్యానికి మంచిది కూడా! ఇక రోజుకి ఒకటో రెండో పెగ్గులు తాగితే గుండె కూడా బలంగా ఉంటుంది.... లాంటి మాటలు మనం తరచూ వింటూనే ఉంటాం. ఈ మాటలు పట్టుకుని మందుబాబులు ఒకటి రెండు పెగ్గులతో మొదలుపెట్టి ఒకటి రెండు క్వార్టర్ల స్థాయికి చేరుకుంటూ ఉంటారు. ఇంతకీ మోతాదులో మద్యం మంచిదన్న మాట ఎక్కడిది. అది నిజంగా నిజమేనా!

 

మితంగా మద్యం తాగితే ఆరోగ్యపరమైన లాభాలు ఏమన్నా ఉన్నాయోమో పరిశీలించే ప్రయత్నం చేశారు కెనడాకి చెందిన పరిశోధకులు. దీనికోసం మద్యపానం గురించి ఇప్పటివరకూ జరిగిన ఓ 45 పరిశోధనల ఫలితాలను గమనించారు. మద్యంతాగనివారికంటే మోతాదులో మద్యం పుచ్చుకునేవారిలో గుండెజబ్బులు కాస్త తక్కువగానే ఉన్నట్లు వాటిలో చాలా పరిశోధనలు పేర్కొన్నాయి. కానీ ఈ పరిశోధనలని కాస్త జాగ్రత్తగా కనిపిస్తే ఒక విస్పష్టమైన లోపం కనిపించింది.

 

పరిశోధన సమయంలో ఒక వ్యక్తికి మద్యం అలవాటు ఉందా లేదా అని గమనిస్తున్నారు కానీ, అతనికి ఒకప్పుడు ఆ అలవాటు ఉందో లేదో ఎవరూ పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. గుండెజబ్బులు, కిడ్నీ సమస్యలు, కాలేయ వ్యాధులు లాంటి సమస్యలు వచ్చిన తర్వాత చాలామంది మద్యానికి దూరంగా ఉండే అవకాశం ఉంది. వారు సదరు అనారోగ్యంతో త్వరగా మరణించే ప్రమాదమూ ఉంది. దాంతో మందు తాగని వారు త్వరగా మరణిస్తున్నారని నిర్ధారించేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. పైగా జీవితంలో ఎప్పుడూ మందు ముట్టనంత మాత్రాన అతని లైఫ్‌స్టైల్‌ అద్భుతంగా ఉందనుకోవడానికి లేదు. వైద్య సదుపాయాలు సరిగా లేకపోవడం, ఆరోగ్యం పట్ల అవగాహన లేకపోవడం, పేదరికం.. లాంటి చాలా కారణాలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకి దారితీస్తుంటాయి.

 

పైన తేల్చిన విషయాన్నే మరోసారి నిర్ధరించేందుకు మరో సర్వే కూడా చేశారు. ఇందుకోసం 9,100 మందిని... వారి 23 ఏట నుంచి 55 ఏట వరకు గమనించారు. ఒకప్పుడు మద్యం అలవాటు ఉన్న చాలామంది 55 ఏడు వచ్చేసరికి వేర్వేరు కారణాలతో ఆ అలవాటు మానుకుంటున్నట్లు తేల్చారు.

 

ఏతావాతా పరిశోధకులు చెప్పేదేమిటంటే... తక్కువ మోతాదులో మద్యం పుచ్చుకోవడం వల్ల, ఆరోగ్యానికి పెద్దగా హాని కలగని మాట వాస్తవమే! అలాగని మందుతో ఏవో అద్భుతాలు జరుగుతాయన్న భ్రమలు మాత్రం కూడదంటున్నారు. ఈ భ్రమలో పడి లేని అలవాటుని బలవంతంగా చేసుకోవాల్సిన అగత్యం అసలే లేదంటున్నారు.

 

- నిర్జర.