ఈ ఫొటోలో మీకు ఏ రంగులు కనిపిస్తున్నాయి?

 

ఇంగ్లండుకి చెందిన ‘రోమన్ ఒరిజినల్స్’ సంస్థ 2015లో ఒక ఫ్రాక్ను విడుదల చేసింది. ఎవరో ఆ ఫ్రాక్ను తొడుక్కొని సరదాగా ఫొటో దిగి ఫేస్బుక్లో పెట్టారు. అప్పటి నుంచీ మొదలైంది రచ్చ! ఆ ఫ్రాక్ బంగారం, తెలుపు చారల్లో ఉందని కొందరంటే... కాదు కాదు! అది నలుపు, నీలం రంగుల్లో ఉందని మరికొందరు వాదించారు. నిజానికి ఈ ఫ్రాక్ను నలుపు, నీలం రంగుల్లోనే తయారుచేశారని తర్వాత కాలంలో తేలింది.

 

The Dress పేరుతో సదరు ఫ్రాక్ సంచలనం సృష్టించింది. ఈ ప్రచారం పుణ్యమా అని ‘రోమన్ ఒరిజినల్స్’ ఈ తరహా దుస్తులను తెగ అమ్ముకొని విపరీతంగా లాభాలను సంపాదించింది. కానీ ఒకే తరహా డ్రస్ ఇద్దరు మనుషులకు రెండు రకాలుగా ఎందుకు కనిపిస్తుందన్న ప్రశ్న గత రెండేళ్లుగా శాస్త్రవేత్తలను కదిలించింది. దీని గురించి రకరకాల చర్చలు నడిచాయి. కానీ ఆ ప్రశ్నకి ఇప్పుడు జవాబు తెలిసిపోయిందంటున్నారు.

 

న్యూయార్కుకి చెందిన ‘వాలిస్’ అనే సైకాలజిస్టు The Dress వెనుక ఉన్న రహస్యాన్ని ఛేధించానని చెబుతున్నారు. మనం నిద్రపోయే తీరుకీ, the dressలో కనిపిస్తున్న రంగులకీ మధ్య పొంతన ఉందని వాలిస్ అంటున్నారు. మనలో కొందరు ఉదయాన్నే లేచి రాత్రిళ్లు త్వరగా పడుకుంటారు. మరికొందరేమో బారెడు పొద్దెక్కాక లేచి మళ్లీ తెల్లవారేదాకా మెలకువగా ఉంటారు. పగటి వేళలు చురుగ్గా ఉండేవారేమో సూర్యకాంతికి ఎక్కువగా అలవాటుపడుతుంటారు. రాత్రివేళ మెలకువగా ఉండేవారేమో కృత్రిమమైన కాంతికి అలవాటుపడతారు. పగటివేళ కాంతి బంగారు వర్ణంలో ఉంటుంది. రాత్రివేళ కృత్రిమమైన వెలుతురు ఎక్కువగా నీలం రంగుని వెదజల్లుతుంది.

 

The Dress నిజానికి నీలం, నలుపు రంగుల్లోనే కనిపిస్తుంది. కానీ పగటి కాంతికి అలవాటుపడినవారు... అది చీకట్లో తీసిన ఫొటోగా భావించి, దానికి పగటికాంతిని (బంగారు రంగుని) జోడిస్తారట. ఇదంతా మనకి తెలియకుండానే మన మెదడు చేసే సర్దుబాటు! దీనివల్ల The Dress బంగారు, తెలుపు వర్ణంలో కనిపించేస్తుంది. దాదాపు 13 వేలమందికి ఈ ఫొటోను చూపించి, నిద్రకు సంబంధించి వారి అలవాట్లను గమనించి తేల్చిన విషయమిది! అంటే మన కంటికి కనిపించేదంతా నిజమేనని ‘గుడ్డి’గా వాదించేయడానికి లేదన్నమాట!

- నిర్జర.