డీఎల్ రవీంద్రారెడ్డి ఆపరేషన్ ఎలా ఉండబోతోంది?

Publish Date:Jun 1, 2013

 

వైద్య శాఖా మంత్రి డీ.యల్ బర్త్ రఫ్ తో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన స్వంత టీం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ముందుగా ఆ పదవిని తనకి అత్యంత సనిహితుడయిన కొండ్రు మురళికి అప్పజెప్పారు. గతంలో డీ.యల్. దగ్గర నుండి తప్పించిన వైద్య విద్య, ఆరోగ్యశ్రీ, వైద్య బీమా, 104, 108, వైద్య మౌలిక సదుపాయాలు తదితర శాఖలు చూస్తున్న కొండ్రు మురళికే ఈ కొత్త బాధ్యతలు కూడా అప్పగించారు. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న డీ.యల్. సోమవారం నాడు హైదరాబాద్ తిరిగి వస్తారు. అయితే, ఆయనకు మాట మాత్రంగా కూడా చెప్పకుండానే అయన గైర్హాజరీలో ముఖ్యమంత్రి ఆయనను బర్త్ రఫ్ చేయడం గమనిస్తే, ఆయన డీ.యల్.పై ఎంతగా రగిలిపోతున్నారో అర్ధం అవుతుంది.

 

ఈ పరిణామాలను డీ.యల్ ఊహించకనే ఇంత కాలం ముఖ్యమంత్రిపై విమర్శలు చేసారని భావించలేము. అయితే పార్టీ అధిష్టానం పట్ల తన విదేయత, సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్తో తనకున్న సత్సంబందాలు తనని కాపడుతాయనే ధీమా ఆయనలో ఉండేది. కానీ, ఇప్పుడు ముఖ్యమంత్రి అకస్మాత్తుగా తనని బర్తరఫ్ చేయడంతో, డీయల్ రేపటి నుండి తన ఆపరేషన్ మొదలుపెడతారు.

 

ఆయన పార్టీలో ఇతర అసమతి నేతలను కూడ గట్టుకొని కిరణ్ కుమార్ రెడ్డిపై తన దాడిని మరింత తీవ్రతరం చేయవచ్చును. అది మరింత తీవ్రతరమయితే, అది అంతిమంగా ఆయన పార్టీ నుండి కూడా బహిష్కరించబడే పరిస్థితులు కల్పించినా ఆశ్చర్యం లేదు. అప్పుడు ఆయన తన కడప జిల్లాలో బలంగా ఉన్న వైకాపా వైపు మళ్ళినామళ్ళవచ్చును. కానీ, ఆజిల్లాలో వైకాపా తరపున పోటీ చేసేందుకు చాలామందే అభ్యర్దులున్నారు గనుక డీ.యల్.కి ఆ పార్టీ టికెట్ ఆఫర్ చేయగలదా లేదా? అనే దానిని బట్టి, ఆయన కిరణ్ కుమార్ రెడ్డికి ఎటువంటి వైద్యం చేయాలో నిశ్చయించుకొనే అవకాశం ఉంది.

 

ఒకవేళ ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగవలసి వస్తే, ముఖ్యమంత్రి ఆయనకు టికెట్ రాకుండా అడ్డుపడే ప్రయత్నం చేయవచ్చును గనుక, ఆయనను వ్యతిరేఖించే పీసీసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో, రామచంద్రయ్య ద్వారా చిరంజీవితో జతకట్టి, ముఖ్యమంత్రికి పొగపెట్టడం ప్రారంబించవచ్చును. బొత్స సహాయంతోనే డీ.యల్. టికెట్ సంపాదించుకొని మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డికి సవాలు చేయవచ్చును.

 

ఒకవేళ వైకాపా నుండి తగిన విధంగా ఆహ్వానం అందితే, పార్టీ నుండి బహిస్కరించేబడేవరకు కూడా కిరణ్ కుమార్ రెడ్డిపై ఆయన నిప్పులు చెరగడం ఖాయం. సోమవారం ఆయన లండన్ నుండి తిరిగి రాగానే ముఖ్యమంత్రిపై ఘాటయిన విమర్శలతో మీడియా ముందుకు ఎలాగు వస్తారు గనుక, ఇక తినబోతూ గారెల రుచి అడగడం అనవసరం ఇప్పుడు.