మన్మోహన్ వారి కొత్త సిద్ధాంతం

 

సోనియా, రాహుల్ భక్త జనుల రాహుల్ గాంధీ భజనతో తపోభంగమయిన మౌన మునీశ్వరులు మన్మోహనులవారు, వారి (అధిష్టానం) మనోభావాలను గౌరవించకపోతే ఏమవుతుందో గ్రహించినవారయి, నిన్న మీడియాను పిలిచి తాను మళ్ళీ మూడోసారి ప్రధాని పదవి చెప్పట్టలేనని ప్రకటించేశారు. అంటే దానర్ధం తనకు ఆసక్తి లేకనే చేప్పట్టడం లేదా లేక అమ్మగారి అనుమతి లేదు గనుక చెప్పట్టలేకపోతున్నారా? అనే సంగతిని జనాల విజ్ఞతకే వదిలిపెట్టేసారు. ఏమయినప్పటికీ మన్మోహనులవారు సగౌరవంగా తన కుర్చీలోంచి దిగిపోయి రాహుల్ గాంధీకి అప్పగించబోతున్నట్లు స్పష్టమయింది. ఈ సందర్భంగా ఆయన రాహుల్ గాంధీ గురించి నాలుగు మంచి ముక్కలు అనడం కూడా మెచ్చుకోవలసిందే. అయితే పోతూపోతూ నరేంద్ర మోడీ గురించి, తన పదేళ్ళ పరిపాలన గురించి చెప్పిన మాటలను మాత్రం అటు బీజేపీ, ఇటు ప్రజలు కూడా మెచ్చుకోలేకపోతున్నారు. కానీ చరిత్రలో శిలాక్షరాలతో లికించదగ్గ ఒక కొత్త సిద్ధాంతాన్నిఆయన ఈ సందర్భంగా ప్రకటించారు.

 

ప్రధాని రేసులోనుండి తాను తప్పుకొంటున్నాని ప్రకటించేందుకు తప్పనిసరయి మీడియా సమావేశానికి హాజరయిన మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రని కూడా చూడకుండా మీడియావాళ్ళు బొగ్గు కుంభకోణాలు, ఆయన ఎప్పుడో మరిచిపోయిన 2జీ స్పెక్ట్రం కుంభకోణాలు, అగస్టా హెలికాఫ్టర్ కుంభకోణాల గురించి ప్రశ్నలు అడుగుతూ కాకుల్లా పొడిచేస్తుంటే, పక్కనున్న ప్రసారశాఖా మంత్రి మనిష తివారీ కూడా నిస్సహాయంగా చూస్తూ కూర్చోకతప్పలేదు.

 

కానీ దాదాపు నలబై ఏళ్ళు కాంగ్రెస్ రాజాకీయాలలో తలపండిన మన్మోహన్ సింగ్ అంతూపొంతూ లేని ఆ ప్రశ్నలకు కొంచెం ఇబ్బందిపడినప్పటికీ, అప్పుడెప్పుడో మా యుపీఏ-1 హయాంలో జరిగిన 2జీ స్పెక్ట్రం కుంభకోణం గురించి ఇప్పుడు మీరు మాట్లాడటం భావ్యం కాదు. అయినా అంత పెద్ద కుంభకోణం గురించి ప్రజలే పట్టించుకోకుండా మళ్ళీ మా పార్టీకే అధికారం కట్టబెట్టారు కదా! అందువల్ల ఆ తప్పులనీ మాఫీ అయిపోయినట్లే! ఇప్పుడు యూపీయే-2లో కూడా మేము చాలా భాద్యతగా చేయవలసినంతా చేసాము. మా సమర్ధతను మోడీ గుర్తించక పోవచ్చును. మీడియా గమనించకపోవచ్చును. కానీ చరిత్ర మాత్రం నా పట్ల దయ చూపుతుందని నమ్ముతున్నాను” అని బదులిచ్చారు.

 

ఎన్నికలలో గెలిచినట్లయితే చేసిన తప్పులన్నీ మాఫీ అయిపోయినట్లే అని ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన ఈ కొత్త సిద్ధాంతం ప్రకారం చూసుకొంటే,” మా మోడీ కూడా వరుసగా మూడుసార్లు ఎన్నికలలో గెలిచారు గనుక ఆయన చేసిన తప్పులు కూడా ప్రజలు క్షమించేసినట్లే!” నని బీజేపీ ఆయన సిద్ధాంతానికి పూర్తి మద్దతు తెలిపింది. మొత్తం మీద మన్మోహన్ సింగ్ పోతూపోతూ తన ప్రత్యర్ధి కూడా మెచ్చుకొనే విధంగా ప్రతిపాదించిన ఈ చక్కటి సిద్దాంతం మాత్రం చరిత్రలో శిలాక్షరాలతో లికించబడుతుంది.

 

కానీ ఆయన “నరేంద్రమోడీ ప్రధాని అయితే దేశం సర్వ నాశనమయిపోతుందని” జోస్యం చెప్పడాన్ని మాత్రం బీజేపీ జీర్ణించుకోలేకపోయింది. గుజరాత్ అల్లర్లలో అనేక మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లే, ఆయన ప్రధాని అయితే దేశంమంతటా మత ఘర్షణలు చెలరేగి ప్రజలు ప్రాణాలు కోల్పోతారని మన్మోహన్ సింగ్ హెచ్చరించారు. అయితే అప్పుడు దేశంలో ప్రతిపక్షాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కోర్టులు, ప్రజలు చోద్యం చూస్తూ కూర్చోంటారా? అనే ధర్మసందేహం ఎవరయికయినా కలిగితే అందుకు ఆయనను తప్పు పట్టలేము. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ తనకు నేర్పిన చిలక పలుకులనే వల్లెవేసారు అంతే.

 

ఇది గ్రహించని బీజేపీ మాత్రం దేశంలో ఇంతవరకు మరే ప్రధాని అభ్యర్ధి ఎదుర్కోనన్ని న్యాయ విచారణలు, సీబీఐ దర్యాప్తులు మోడీ ఎదుర్కొని నిష్కళంకంగా బయట పడ్డారు. అటువంటప్పుడు ఆయన గురించి పెద్దాయన ఆవిధంగా మాట్లాడటం చాలా తప్పు అని తీర్మానించేసింది.