అవయవ దానం.. మానవత్వ పరిమళం

అవయవదానం చేసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు విజయవాడకు చెందిన మణికంఠ అనే యువకుడి కుటుంబసభ్యులు. వివరాల ప్రకారం ఈ నెల 3న మణికంఠ మోటారు సైకిల్ నడుపుతూ ప్రమాదానికి గురయ్యాడు. అతన్ని వెంటనే మెట్రో హాస్పిటల్ కు తరలించారు. అదే హాస్పిటల్ లో మణికంఠ అక్క జ్యోతి నర్సుగా పనిచేస్తుంది. ఈ ప్రమాదంలో మణికంఠ తలకు బలమైన గాయాలు తగలడంతో బ్రైన్ డెడ్ అయిందని వైద్యులు నిర్ధారించారు. డాక్టర్ శ్రీనివాస్ ద్వారా జ్యోతి హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ రవిరాజును సంప్రదించి, జీవన్ దాన్ పథకం ద్వారా తన తమ్ముడి అవయవాలు దానం చేయాడానికి ముందుకు వచ్చింది. మణికంఠ శరీరం నుండి గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు వేరు చేశారు. విమానంలో మణికంఠ గుండె, ఊపిరితిత్తులను చెన్నైలోని ఫోర్షియో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ రోగికి అమర్చేందుకు తరలించారు. ఒక కిడ్నీని ఎన్నారై ఆసుపత్రిలో ఓ రోగికి అమర్చారు. మరో కిడ్నీని గుంటూరు సిటీ ఆసుపత్రిలో మరో రోగికి దానం చేశారు. కాలేయాన్ని హైదరాబాద్ గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగికి విజయవంతంగా అమర్చారు. ఎన్నారై ఆసుపత్రి యాజమాన్యం జ్యోతి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించింది.