Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కవిత లేఖపై కేటీఆర్ ఏమన్నారో తెలుసా?
posted on: May 24, 2025 3:23PM

బీఆర్ఎస్ పార్టీ పీకల్లోతు సంక్షోభంలో కూరుకు పోయింది. అసలు 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం పాలై.. అధికారం కోల్పోయిన తరువాత ఆ పార్టీ ఇప్పటి వరకూ కోలుకోలేదనే చెప్పాలి. ఏవో ఉద్యమాలు, ప్రభుత్వ విధానాలపై విమర్శలతో హడావుడి చేస్తున్నప్పటికీ.. పార్టీ మాత్రం అంతర్గత విభేదాలతో కూనారిల్లుతూనే ఉంది. పార్టీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకోవడం దగ్గర నుంచి ఆ పార్టీలో ఎక్కడా ఎన్నడూ ఐకమత్యం, ఏకాభిప్రాయం కనిపించిన దాఖలాలు లేవు. కేసీఆర్ రాజకీయంగా క్రియాశీలంగా లేకపోవడంతో ఆ పార్టీ అత్యంత తీవ్రమైన నాయకత్వ సమస్యను ఎదుర్కొంటున్నది.
కేసీఆర్ రాజకీయ వారసుడిగా కేటీఆర్ కు పార్టీలో సంపూర్ణ మద్దతు లేదన్న విషయం దాదాపు ఆయనకు పార్టీ బాధ్యతలు అప్పగించడానికి రంగం సిద్ధమైందన్న వార్తలు వచ్చిన ప్రతిసందర్భంలోనూ బహిర్గతమైంది. తాజాగా పార్టీ పాతికేళ్ల పండుగను వరంగల్ లో ఘనంగా నిర్వహించుకుంది. ఆ సందర్భంగా కేటీఆర్ కు పార్టీ పగ్గాల అప్పగింతకు కేసీఆర్ సర్వం సిద్ధం చేశారన్న వార్తలు వినిపించాయి. అందుకు అనుగుణంగా రజతోత్సవ సభా ప్రాంగణం, వేదిక అంతా కేటీఆర్ మయంగానే కనిపించింది. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఫొటోలు వినా మరెవరివీ కనిపించలేదు. ఇక పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన హరీష్ రావుకు అయితే రజతోత్సవ సభ సందర్భంగా కనీస ప్రాధాన్యత కూడా లభించలేదు. దీంతో హరీష్ రావు మనస్తాపానికి గురయ్యారనీ, పార్టీని వీడి సొంత కుంపటి పెట్టుకుంటారనీ వార్తలు జోరుగా వినిపించాయి. అయితే కేసీఆర్ రంగంలోకి దిగి, కేటీఆర్, కేసీఆర్ మధ్య సయోధ్య కుదిర్చారు. కేటీఆర్ స్వయంగా రెండు సార్లు హరీష్ రావు నివాసానికి వెళ్లి చర్చించారు. దీంతో పార్టీలో విభేదాలన్న ప్రచారం టీ కప్పులో తుపానేనని పార్టీ శ్రేణులు భావించాయి.
అయితే ఉరుములేని పిడుగులా ఆ రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగాన్నే తప్పుపడుతూ తెలంగాణ ఎమ్మెల్సీ, కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత సంధించిన లేఖాస్త్రం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనానికి కారణమైంది. రాజకీయవర్గాలలో దుమారం లేపింది. బీఆర్ఎస్ లో చీలిక తప్పదా అన్న సందేహాలను లేవనెత్తింది. ఈ లేఖపై పార్టీలో ఎవరికీ కూడా ఎలా స్పందించాలో కూడా అర్థం కాలేదు. దీంతో తన భావాలను తండ్రితో స్వేచ్ఛగా, నిర్భయంగా పంచుకోగలిగిన కవిత లేఖ ఎందుకు రాస్తారు అంటే ఆ లేఖ కల్వకుంట్ల కవిత రాయలేదనీ, ఎవరో సృష్టించారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే లేఖ వెలుగులోనికి వచ్చిన మరునాడే తన అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చిన కవిత ఆ ప్రచారాన్ని నిర్ద్వంద్వంగా ఖండించారు. ఆ లేఖ తానే రాశాననీ, కానీ పార్టీలోని కోవర్టుల కారణంగానే అది లీకైందనీ కుండబద్దలు కొట్టేశారు.
ఇప్పుడు తాజాగా కవిత లేఖపై పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. కవిత లేఖ రాయడంలో తప్పు లేదంటూనే.. అంతర్గత విషయాలను బహిరంగం చేయడం సరికాదు అంటూ వ్యాఖ్యానించి కవిత లేఖ తప్పా, రైటా అన్న విషయం తేల్చకుండా దాటేశారు. బీఆర్ఎస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఉందన్న కేటీఆర్ ఎవరైనా పార్టీ అధ్యక్షుడికి లేఖ రాయవచ్చునని చెబుతూనే.. పార్టీ అంతర్గత విషయాలపై అంతర్గతంగానే చర్చించడమే మేలని ముక్తాయించారు. అదే విధంగా కవిత చేసిన కోవర్టుల వ్యాఖ్యపై కూడా అంటీముట్టనట్టుగానే మాట్లాడారు. కోవర్టులు లేని పార్టీయేలేదని అంటూనే వారంతా సమయం వచ్చినప్పుడు బయటపడతారన్నారు. మొత్తంగా కవిత లేఖపై కేసీఆర్ స్పందన ఒక విధంగా కర్ర విరక్కుండా, పాము చావకుండా అన్న సమెతను గుర్తుకు తెచ్చిందని పరిశీలకులు అంటున్నారు.


.webp)
.webp)


