దీపావళి చేసుకుందాం… కానీ!

 

 

దీపావళి దగ్గరకు వచ్చేసింది… ఏడాది మొత్తం ఎదురుచూసిన పండుగ తనే మన దగ్గరకు వచ్చేసింది. దీపావళి అంటేనే దీపాల వరుస కాబట్టి ఇది వెలుగుల పండుగ అన్న విషయాన్ని కాదనలేం. నరకాసురుడిని సత్యభామ చంపిందనో, రాముడు అయోధ్యకు తిరిగివచ్చాడనో, లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగుపెడుతుందనో… కారణం ఏదైనా ధూంధాంగా దీపావళిని మోతమోగించేస్తాం. కానీ దీపావళి రోజున విచక్షణారహితంగా మందుగుండును కాల్చడం వల్ల మన జీవితాల్లో ఎలాంటి విషాదం చోటుచేసుకుంటుందో ఒక్క నిమిషం ఆగి ఆలోచిస్తే ఈ పండుగను కాంతినే కాదు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.


చిచ్చుబుడ్డి అయినా కానీ:

దీపావళి టపాసుల నుంచి వచ్చే పొగ వల్ల వాతావరణంలో కాలుష్యం ఏర్పడుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇది కేవలం ఒక్క రోజుకి పరిమితమయ్యే కాలుష్యం కాదు. టపాసులు పేలడం వల్ల వచ్చిన ధూళి వాతావరణంలో కొద్ది రోజుల పాటు అలాగే ఉండిపోతుంది. ఈ తరహా కాలుష్యాన్ని RSPM (Respirable Suspended Particulate Material) అంటారు. అంటే ఇది మన ఊపిరితిత్తులలోకి ఎప్పుడెప్పుడు చేరదామా అని తిష్టవేసుకుని కూర్చుని ఉంటుందన్నమాట. పైగా మనం కేవలం చిచ్చుబుడ్లు, కాకరపువ్వొత్తులే కదా కాల్చేది అనుకోవడానికి కూడా లేదు. వీటి నుంచి విడుదల అయ్యే `సల్ఫర్‌ డయాక్సైడ్‌` మన ఊపిరితిత్తులకు  చాలా ప్రమాదకారి అని చెబుతున్నారు. ఇప్పటికే ఆస్తమా, బ్రాంకైటిస్‌ వంటి సమస్యలు ఉన్నవారు, ఆ రోజున పొగకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వెలుతురు కోసమూ, రంగురంగుల వెలుగుల కోసమూ దీపావళి సామాగ్రిలో కలిపే మెర్క్యురీ, మెగ్నీషియం, బేరియం… వంటి రసాయనాలన్నీ కూడా వాతావరణంలోని ఆక్సిజన్‌తో కలిసినప్పుడు పర్యావరణానికి హానికలిగించేవే!


చెవులు పేలిపోతాయి:

శబ్దాలను కొలిచే పరిమాణాన్ని డెసిబుల్స్‌ అంటారు. ఆకుల చప్పుడు నుంచి ఆటంబాంబు వరకూ ఏ శబ్దాన్నైనా డెసిబుల్స్‌లో కొలవవచ్చు. మనం కాస్త గట్టిగా మాట్లాడుకునే మాటలు 50 డెసిబుల్స్‌ మాత్రమే ఉంటాయి. అదే దీపావళి టపాసులు మాత్రం దాదాపు 150 డెసిబుల్స్ దగ్గర పేలతాయి. 100 డెసిబుల్స్‌ని దాటి వినే శబ్దం ఏదైనా కూడా మన చెవులకి చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. ఇక 140 డెసిబుల్స్‌ని దాటే శబ్దాల వల్ల మన కర్ణభేరి దెబ్బతినే అవకాశం ఉంటుంది. మనమంటే పండుగ హడావుడిలో ఉంటాం కాబట్టి ఇవేవీ పెద్దగా పట్టించుకోము. కానీ వీటికి సిద్ధంగా లేనివారు మాత్రం ఉలికిపడక తప్పదు. పసిపిల్లలు భయపడకా తప్పదు. ఇక దీపావళి రోజున మనమంతా మోత మోగించేస్తుంటే పిల్లులు, పిచ్చుకలు లాంటి మూగ జీవాలన్నీ హడలిపోతాయి.


ముందూ తరువాతా:

ఒకప్పడు నిజానికి దీపావళిని ఇలా జరుపుకొనేవారు కాదు. శ్రద్ధగా పూజలు చేసుకోవడం, సుష్టుగా పిండివంటలు లాగించడం, బుద్ధిగా దీపాలను వెలిగించుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యతని ఇచ్చేవారు. అందుబాటులో ఉండే రసాయనాలను తక్కువస్థాయిలో ఉపయోగించి టపాసులను చేసుకునేవారు. దీపావళినాటి చలినీ, అమావాస్యనాటి చీకటినీ, కీటకాలనూ తరిమికొట్టడానికి ఆ టపాసులు ఉపయోగపడేవి. కానీ ఇప్పుడు మాత్రం దీపావళి అంటే కేవలం టపాసులు పండుగగా మారిపోయింది. దీపావళి రోజున వీలైనన్ని టపాసులను కాల్చడం ఒక స్టేటస్‌ సింబల్‌గా మారిపోయింది. ఇష్టమున్నా లేకపోయినా, వేలకి వేలు పెట్టి దీపావళి సామాగ్రిని కొంటేనే కానీ తలెత్తుకు తిరగలేని పరిస్థితి వచ్చేసింది. ఇక వేలు పెట్టి కొన్న ఆ టపాసులు కాలిపోయాక కూడా మనకి తీరని హాని కలిగిస్తున్నాయి. భూమిలో కలిసినా, నీటిలో నానినా వాటికి అంటుకుని ఉన్న రసాయనాలు పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయి.

 

మరేం చేయడం:

* ఎవరు ఎంతగా వాదించినా, వారించినా దీపావళి మందుగుండు ఇప్పటి సంస్కృతిలో ఒక భాగం. పిల్లలకి అదో సంబరం, పెద్దలకు అదో సరదా! అందుకే చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే ఈ పండుగ పర్యావరణానికి కూడా వెలుగులనందిస్తుంది.


* ఖర్చు- కాస్త దూరమైనా కానీ అశ్రద్ధ చేయకుండా దీపావళి సరుకులను అమ్మే హోల్‌సేల్‌ షాపులో టపాసులను, అది కూడా ఓ రెండు రోజులు ముందుగానే తీసుకోవడం మంచిది. హడావుడిగా కొనుగోలు చేస్తే ఖచ్చితంగా లెక్కలు తప్పుతాయి. పనిచేసే సంస్థ తరపున టపాసులను తెప్పించుకునే అవకాశం ఉంటే తప్పకుండా వినియోగించుకోండి.


* శబ్దం- టపాసులను కొనేటప్పుడే తక్కువ శబ్దాన్ని కలిగించేవాటిని ఎంచుకోవాలి. ఇంట్లో ఎవరన్నా రోగులు కానీ పసిపిల్లలు కానీ ఉంటే కేవలం వెలుగుని మాత్రమే అందించే మందుగుండు తీసుకుంటే సంతోషం. ఇంట్లో ఏవన్నా పెంపుడు జంతువులు ఉంటే ఆ పూట వాటిని బయటకు వదలవద్దు. ఇక ఎంత పండుగ రోజైనా రాత్రి పది దాటిన తరువాత టపాసులను కాల్చడం ఇతరులకు ఇబ్బందికరమే!


* కాలుష్యం- ఊపిరితిత్తులకు సంబంధించి మీకు ఎలాంటి ఇబ్బందులన్నా ఉంటే, మందుగుండుకు దూరంగా ఉండటం మంచిది. అంతేకాదు! దీపావళి తరువాత మరి కొద్ది రోజుల పాటు కూడా, బయటకు వెళ్లేటప్పుడు ముక్కుకి ఏదన్నా గుడ్డ చుట్టుకుని వెళ్లడం మేలు. ఇంట్లో పసిపిల్లలు ఉంటే వాళ్లకి దగ్గరలో పొగ వచ్చే మందుగుండును కాల్చవద్దు. మందుగుండు కాల్చడం పూర్తయిన తరువాత చాలామంది చేతులను ఒక్కసారి కడుక్కుని వదిలేస్తారు. పైగా టపాసులు కాల్చిన తరువాత ఏదన్నా తీపి పదార్థాన్ని తినాలన్న ఆచారం ఒకటి ఉంది. దానివల్ల చేతులకు అంటుకుని ఉన్న రసాయనాలు నేరుగా కడుపులోకి వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి టపాసులు కాల్చిన తరువాత శుభ్రంగా తలస్నానం చేసి వేరే బట్టలు వేసుకోవడం మంచిది.


* అన్నింటికీ మించి దీపావళిని వీలైనంతవరకూ నిరాడంబరంగా జరుపుకొని ఆ ఖర్చుని ఇతరులకు సాయం చేసేందుకో, భవిష్యత్‌ అవసరాల కోసమో వెచ్చించడం మరీ మంచిది. అప్పడు దీపావళి పండుగ జీవితాంతమూ నిలిచిపోతుంది.

- నిర్జర