ట్విట్టర్ లో పోస్టులు చేయాలంటే రెండేళ్లు జైల్లో ఉండాలా?

posted on: Jul 9, 2019 5:44PM

 

ఒకవైపు అక్రమ కట్టడాలపై చర్యలు అంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్ హడావుడి, మరోవైపు లోకేష్ ట్విట్టర్ లో తప్ప బయట మాట్లాడలేరంటూ వైసీపీ నేతల విమర్శలు.. ఒక్కమాటలో చెప్పాలంటే వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీని అన్నిరకాల టార్గెట్ చేస్తోంది. అయితే అసలు వైసీపీది సుపరిపాలనే కాదని అంటూ టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి సెటైర్స్ వేశారు.

వైఎస్ జగన్ ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రంలో టీడీపీపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని, ఇప్పటి వరకు ఆరుగురిని పొట్టన బెట్టుకున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఇంతలా దాడులు జరుగుతున్నా సీఎం జగన్ స్పందించకపోవడం దారుణమన్నారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం చక్కటి పరిపాలన అందిచాలని కానీ దాడులకు పురిగొల్పుతోందని విమర్శించారు. 

గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భవనాలను కూల్చివేయడం అభివృద్ధి కాదని ఎద్దేవా చేసారు. "కూల్చేవాడు నాయకుడు కాదు.. కట్టే వాడే నాయకుడు" అంటూ చెప్పుకొచ్చారు. ఏపీ లోటు బడ్జెట్ లో ఉన్నా ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టడంతోపాటు రాజధానిని నిర్మించిన ఘనత చంద్రబాబుదని కొనియాడారు. రాష్ట్రంలో టీడీపీ ఓడిపోవడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని అంతా ఆవేదనతో ఉన్నారని చెప్పుకొచ్చారు.

చంద్రబాబుకు దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ ఉందని, అంతటి ఫాలోయింగ్ ఎవరికైనా ఉందా అని ప్రశ్నించారు. దేశంలో ప్రధాని మోదీకి పోటీ వచ్చే నాయకుడు చంద్రబాబు అని చెప్పుకొచ్చారు. జ్ఞానంలో, రాజకీయ అనుభవంలో మోదీని మించిన వ్యక్తి చంద్రబాబు అని అందువల్లే అంతా కలిసి ఏపీలో టీడీపీని ఓడించారని ఆరోపించారు. 

నారా లోకేష్ ట్విట్టర్ లో స్పందించడంపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను ఆమె కొట్టిపారేశారు. "ట్విట్టర్ లో పోస్టులు చేయాలంటే రెండేళ్లు జైల్లో ఉండాలా" అంటూ నిలదీశారు. లోకేష్ ను ట్విట్టర్ పిట్ట అంటూ వైసీపీ చేస్తున్న విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట్లాడే వాడే నాయకుడు కాదని బుద్ధిబలం ఉన్నవాడే నాయకుడన్నారు. పరిపాలించడానికి కావాల్సింది బుద్ధిబలమేనన్నారు. ఆ బుద్ధిబలం నారా లోకేష్ దగ్గర చాలా ఉందన్నారు దివ్యవాణి.

google-ad-img
    Related Sigment News
    • Loading...