డివైడ్ అండ్ రూల్ ఇష్టోరీ పార్ట్-1

 

బ్రిటిష్ వాళ్ళని దేశం నుండి తరిమి కొట్టిన కాంగ్రెస్ పార్టీ, వారి విభజించి పాలించు సిద్దాంతాన్ని మాత్రం పదిలంగా తన దగ్గిరే అట్టేబెట్టుకొని అవసరమయినప్పుడల్లా తీసి ఉపయోగించుకొంటోంది. రాష్ట్ర విభజనతో ముందు తెలుగు ప్రజలను విభజిస్తున్నకాంగ్రెస్ పార్టీ, తెరాసను దెబ్బ తీసేందుకు టీ-జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ను ఎగద్రోసి చూసింది.

 

జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీసేందుకు రాయలసీమను విభజించాలని కూడా ఆలోచన చేసింది గానీ అంత సాహసం చేయలేకపోయింది. అయితే రాష్ట్ర విభజనతో వైకాపాను తెలంగాణా నుండి విభజించి దెబ్బ తీయగలిగింది. తెదేపాలో కూడా విభజన చిచ్చుబాగానే పెట్టగలిగింది.

 

ఇక స్వయంగా తన స్వంత పార్టీ నేతలను కూడా ప్రాంతాల వారిగా విభజించి, పక్కా ప్రణాళికతో పావులు కదుపుతోంది. ఇరు ప్రాంతాల నేతల చేత సమర్ధంగా డ్రామా నడిపిస్తూ రెండు ప్రాంతాలలో కూడా పాగా వేయాలని ఎత్తులు వేస్తోంది. విభజన పుణ్యమాని తెదేపా, వైకాపాలు సీమాంధ్రపై ఆధిపత్యం కోసం కత్తులు దూసుకొని పోరాడుతుంటే, తన సీమాంధ్ర నేతలకి కిరణ్ కుమార్ రెడ్డిని నాయకుడిగా మలిచి ఆ రెండు పార్టీలను తుడిచిపెట్టే ప్రయత్నాలు మొదలుపెట్టింది. కాంగ్రెస్ పార్టీ సృష్టించిన ఈ సందిగ్ధంలో ప్రజలు ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితులు కల్పించి, ఇంతవరకు కాంగ్రెస్ పాలనలో నరకం చూసిన, చూస్తున్నప్రజల చేతనే కిరణ్ కుమార్ రెడ్డి అందరి కంటే యోగ్యుడని అనిపించగలిగింది.

 

ఇక నేడోరేపో ఆయన చేత సమైక్యాంధ్ర కోరుతూ పాదయాత్రలు కాకపోయినా ఏవో ఒక రకమయిన యాత్రలు చేయించే అవకాశం ఉంది. ఈ దెబ్బకి వైకాపా, తెదేపాలకి సమైక్య ఆయుధం చేజారిపోతుంది. సాక్షాత్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డే సమైక్యాంధ్ర ఉద్యమాలు చేస్తుంటే ఇక ప్రజలు షర్మిలను, చంద్రబాబును పట్టించుకొంటారో లేదో త్వరలోనే తేలిపోతుంది.

 

అయితే తరువాత ఇస్టోరీ ఏమిటాంటారా ? సస్పెన్స్? దీని క్రింద వచ్చేఇస్టోరీ చదివి అందులోంచి మీకు నచ్చిన ఆప్షన్ ఎంచుకొనే అవకాశం మీకే ఉంది.