కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తేబోతున్న డిగ్గీ రాజావారు

 

ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండే మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని బీజేపీ చేతికి అప్పగించేసిన ఘనుడు దిగ్విజయ్ సింగ్. స్వంత రాష్ట్రమయిన మధ్యప్రదేశ్ లో పార్టీకి మంగళం పాడేసిన తరువాత, ఆయనకు అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్-చార్జ్ గా బాధ్యతలు అప్పగించబడ్డాయి. కాంగ్రెస్ పార్టీ గత పదేళ్లుగా చేయలేని రాష్ట్ర విభజన పనిని ఆయన బాధ్యతలు చేప్పట్టిన మూడు నెలలలోనే చకచకా రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసేసారు. ఆ కారణంగా రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పూర్తిగా తుడిచిపెట్టుకు పోయింది. తెలుగుదేశం, తెరాస పార్టీలకు అధికారం బదలాయింపు కూడా చాలా సాఫీగా జరిగిపోయింది. ఆ విధంగా తనకు అప్పజెప్పిన పనిని చాలా దిగ్విజయంగా ముగించుకొని తన పేరును సార్ధకం చేసుకొన్నారు దిగ్విజయ్ సింగువారు.

 

ఆనాటి నుండి మళ్ళీ ఇంతవరకు రెండు రాష్ట్రాల గడపలు తొక్కని ఆయన, తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ కొన ఊపిరితో ఉండటం చూసి, దానికి పునర్వైభవం సాధించే పనిలో హైదరాబాద్ తరలి వచ్చారు. నిన్న శేరిగూడలో ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన తెలంగాణా కాంగ్రెస్ మేధోమధనం సదస్సులో పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ, రాష్ట్ర విభజన కారణంగానే పార్టీ రెండు చోట్ల ఘోరంగా దెబ్బతిందనే నిజాన్ని మరోమారు అందరికీ గుర్తుచేశారు.

 

రాష్ట్ర విభజనకు అంగీకరించిన రాష్ట్ర రాజకీయ పార్టీలు తమకు హ్యాండివ్వడం వలననే ఆంద్రాలో ఓడిపోయామని, కానీ ఎంతో సాహసించి తెలంగాణా ఇచ్చినప్పటికీ తెలంగాణా లో కూడా ఓడిపోయామని బాధపడ్డారు. ఇంత హడావుడిగా రాష్ట్రవిభజన చేయవద్దని, చేసినట్లయితే పార్టీ రెండు రాష్ట్రాలలో భూస్థాపితం అవుతుందని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చాలా సార్లు చాలా గట్టిగా చెప్పినపుడు దిగ్గీ రాజావారు బోసి నవ్వులు, ముసిముసి నవ్వులు నవ్వారు. కానీ ఇపుడు ఆయన చెప్పినట్లే అంతా జరిగిందని అంగీకరించక తప్పలేదు. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని కాపాడేందుకు కృషి చేస్తే, రాష్ట్రవిభజన చేసి కాంగ్రెస్ పార్టీని రెండు రాష్ట్రాలలో దుంప నాశనం చేసిన ఘనుడు దిగ్విజయ్ సింగ్.

 

జరిగిందేదో జరిగిపోయింది కనుక ఇక కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అందరూ కలిసి కట్టుగా పనిచేసి, పార్టీకి పునర్వైభవం సాధించేందుకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. కానీ ఆయన ప్రవచనాలు పూర్తికాక ముందే పార్టీ కార్యకర్తలు కొందరు సభలో నినాదాలు చేయడం విశేషం. వారినందరినీ తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించడం మరో గొప్ప విశేషం. మెదక్ ఉప ఎన్నికలో ఒంటరిగా పోటీ చేద్దామని, త్వరలో జరుగబోయే జీ.హెచ్.యం.సి. ఎన్నికలకు కూడా అందరూ సిద్దం కావాలని ఆయన కోరారు.

 

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడే దానిని మళ్ళీ గెలిపించలేకపోయిన ఆయన, ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ముందు గట్టిగా నిలబడలేకపోతున్న కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకొద్దామని చెప్పడం నవ్వు తెప్పిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం గురించి మాట్లాడే ముందు, పార్టీని, దాని పరిస్థితిని ఏ మాత్రం పట్టించుకోకుండా, పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను ఆ పదవి నుండి తప్పించి ఆ కుర్చీలో కూర్చొనేందుకు కుమ్ములాడుకొంటున్న టీ-కాంగ్రెస్ నేతలను దారిన పెట్టగలిగితే బాగుంటుందేమో?