TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీ అసెంబ్లీలో డిజిటల్ అటెండెన్స్

Published on: Wed Feb 11, 2026 8:42AM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు  బుధవారం (ఫిబ్రవరి 11) ఉదయం ప్రారంభమయ్యాయి.  కాగా  ఈ తరుణంలో  అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై అసెంబ్లీలో ఎమ్మెల్యేల అటెండెన్స్‌కు సంబంధించి.. రిజిస్ట్రర్లు ఉండవనీ. వారి హాజరును డిజిటల్ విధానంలోనే తీసుకుంటామని తెలిపారు.

అంటే.. అసెంబ్లీలో ఇకపై ఎలక్ట్రానిక్ అటెండెన్స్ అమల్లోకి రానుంది. అలాగే అసెంబ్లీలో శాసనసభ్యుడు.. తనకు కేటాయించిన స్థానంలో కూర్చుంటేనే అటెండెన్స్ నమోదవుతుంది. ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా మాత్రమే హాజరు నమోదు కానుందని స్పీకర్ స్పష్టం చేశారు. సభలో సభ్యులు తమ సీటులో కూర్చున్న తరువాత వారి ఫేస్‌ను కెమెరాలు క్యాప్చర్ చేస్తాయన్నారు. ఈ తరహా అటెండెన్స్ కోసం అసెంబ్లీలో ప్రత్యేక కెమెరాలను ఏర్పాటు చేసినట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు వివరించారు.

ఎమ్మెల్యే కెమెరాకు ముఖం చూపించి వెళ్లినా.. హాజరు నమోదు కాదని అసెంబ్లీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. సభ్యుడు తప్పనిసరిగా తనకు కేటాయించిన సీటులో కూర్చుంటేనే అటెండెన్స్ నమోదయ్యేలా సాఫ్ట్‌వేర్ రూపొందించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.  మరోవైపు గతంలో మాదిరిగా అసెంబ్లీలో సభ్యులు అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకాలు చేసి వెళ్తే కుదరదని అసెంబ్లీ వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో వైసీపీ సభ్యులు రిజిస్టర్‌లో సంతకాలు చేసి అనర్హత వేటు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసిన సంగతి విదితమే. డిజిటల్ అటెండెన్స్ విధానం వల్ల ఇకపై ఆ పప్పులుడకవు.