రిక్షా తోలేవాడు రాష్ట్రపతిని కలుసుకున్నాడు

 

ఒకప్పుడు అతను దిల్లీ వీధులలో రిక్షాను తోలుకునేవాడు. అలా రిక్షా నడిపే సమయంలో అతను రాష్ట్రపతి భవనం ముందర నుంచి కూడా వెళ్లి ఉంటాడు. కానీ అదే రాష్ట్రపతి భవనంలో ఒకరోజు తను కూడా అడుగుపెడతానని అనుకుని ఉండడు. ఇలాంటి ఘట్టాలు రజనీకాంత్‌ సినిమాలోనే కనిపిస్తాయనుకుంటే పొరపాటే! కష్టపడే తత్వం ఉండాలే కానీ, ఆలోచించే మనసు ఉండాలే కానీ.... ఇవి ఎప్పుడు ఏ ఉన్నత శిఖరానికి చేరుస్తాయో ఊహించను కూడా ఊహించలేం. అలాంటి ఓ ధరమ్‌వీర్‌ కథే ఇది!

 

 

ధరమ్‌వీర్, హర్యానాలోని యమునానగర్ అనే గ్రామానికి చెందినవాడు. చిన్నప్పటి నుంచీ ధరమ్‌వీర్‌కు ఔషధులంటే చాలా ఇష్టం. పొలం పనులంటే ప్రాణం. కానీ పేదరికాన్ని తట్టుకునేందుకు పొలం పనులను విడిచి పట్నం బాట పట్టాడు. దిల్లీలో రిక్షాను తొక్కుకుంటూ బతుకు వెళ్లదీసేవాడు. కాలం ఇలాగే సాగిపోతే ఏమయ్యేదో కానీ, 1987లో ఒక ప్రమాదానికి లోనవ్వడంతో తిరిగి తన గ్రామానికి చేరుకోక తప్పలేదు. ఒక పక్క పేదరికం, దాని నుంచి బయటపడే జీవనోపాధి కూడా లేదు. పిల్లల ఫీజులు కూడా కట్టలేని పరిస్థితి. అలాంటి స్థితిలో మళ్లీ పొలం మీదకు ధ్యాస మళ్లింది ధరమ్‌వీర్‌కి. కానీ అందరిలాగా కాకుండా ఏదన్నా భిన్నంగా చేయాలనుకున్నాడు. పొలం సాగు మరింత లాభసాటిగా ఉండటం ఎలాగా అని ఆలోచించాడు. చుట్టూ ఉన్న పరిశ్రమలను చూడటం, సేద్యం గురించి కొత్త కొత్త పద్ధతులను తెలుసుకోవడం మొదలుపెట్టాడు.

 

 

హైబ్రీడ్ టమాటా అన్న పేరే ఎవరూ వినని సమయంలో ధరమ్‌వీర్‌ తన పొలంలో వాటిని సాగుచేయడం మొదలుపెట్టాడు. అంతేనా! పొలంలో నాట్లని వేయడానికి, పురుగులని పట్టడానికీ, మందులు చల్లడానికీ రకరకాల యంత్రాలను కనిపెట్టడం మొదలుపెట్టాడు. ధరమ్‌వీర్‌ చేష్టలు చూసి ఊళ్లో జనం పిచ్చివాడనుకుంటూ నవ్వుకునేవారు. కానీ నెలలు గడిచేకొద్దీ ఏపుగా పండిన టమాటా పంటను చూసి జనానికి నోట మాట రాలేదు. ధరమ్‌వీర్‌ అక్కడితో ఆగిపోతే ఒక మంచి రైతుగానే మిగిలిపోయేవాడు. కానీ ధరమ్‌వీర్‌ ఆలోచనలు వేరేగా ఉన్నాయి. తాను దిల్లీలో ఉన్నప్పుడు టమాటా, గులాబీ వంటి ఉత్పత్తులను పండించే రైతులు అవి అదే రోజున అమ్ముడు పోకపోతే తీవ్రంగా నష్టపోవడాన్ని గమనించాడు. ఉత్పత్తులు వృధాగా పోకుండా వాటి సారాన్ని వాడుకునే అవకాశం ఏదన్నా ఉందేమో గమనించాడు.

 

 

ఆహార పదార్థాల నుంచి సారాన్ని తీసేందుకు చాలా యంత్రాలే అందుబాటులో ఉన్నాయి. కానీ వాటి ధరే రైతులకు అందుబాటులో ఉండదు. ఈ సమస్యకు తానే ఒక పరిష్కారం కనుక్కొంటే పోలా అనుకున్నాడు ధరమ్‌వీర్‌! చిన్నప్పటి నుంచీ యంత్రాలను తయారుచేయడం అంటే ధరమ్‌వీర్‌కు మహా ఇష్టమయ్యే! ఏడో తరగతి చదివే వయసులోనే వాటర్‌ హీటర్లను తయారు చేసి మిగతా పిల్లలకు అమ్మేవాడు. అలాంటి చురుకుదనానికి ఇప్పుడు మళ్లీ పడి పడింది. ఏళ్ల తరబడి రకరకాల ప్రయోగాలు చేసిన ధరమ్‌వీర్‌ చివరికి టమాటా, మామిడి, అలోవెరా, తులసి, గులాబీ... ఇలా ఎలాంటి ఉత్పత్తి నుంచైనా సారాన్ని తీసే యంత్రాన్ని కనిపెట్టాడు. ఈ యంత్రం ఇప్పుడు ఎంతగా ప్రచారం పొందిందంటే, దీనిని కెన్యాకు సైతం ఎగుమతి చేయడం మొదలుపెట్టాడు ధరమ్‌వీర్‌. ఒకప్పుడు పిల్లలకు ఫీజు కట్టేందుకు కూడా డబ్బులు లేనివాడు, ఇప్పుడు నెలనెలా లక్షల కొద్దీ టర్నోవరుతో వ్యాపారం చేస్తున్నాడు. ధరమ్‌వీర్‌ గురించి విన్న రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, 2014లో తనను కలుసుకునే అవకాశాన్ని కూడా కల్పించారు. ఇక కష్టపడితే వచ్చే ఫలితాల గురించి ధరమ్‌వీర్‌ తన నోటితో ప్రత్యేకించి చెప్పాలా!
 

- నిర్జర.