యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న 80 ఏళ్ల పెద్దాయన

 

అరవై ఏళ్లు వస్తే చాలు, ఇక జీవితపు చరమాంకానికి చేరుకున్నామనే అభిప్రాయం కలుగుతుంది. ఇప్పుడిక హాయిగా విశ్రాంతి తీసుకోమంటూ సమాజం ప్రోత్సహిస్తుంది. ఒంట్లో సత్తువ ఉన్నా, శరీరానికి పని చెప్పడానికి మనసొప్పదు. విశ్రాంతికీ, నిస్తేజానికీ మధ్య ఉన్న సన్నటి పొరని గ్రహించలేని జీవితాలు మనవి. అలాంటివారందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు ఒక 80 ఏళ్ల ముసలాయన.

 

 

క్యాట్‌ వాక్‌ చేసిన తాతయ్య

2015 మార్చి. చైనాలో ఫ్యాషన్‌ వీక్‌ జరుగుతోంది. అందులో అకస్మాత్తుగా ఒక 79 ఏళ్ల వృద్ధుడు ర్యాంప్ మీదకి నడుచుకుంటూ వచ్చాడు. అది కూడా దృఢంగా ఉన్న శరీరంతో! ఆ దెబ్బతో అతని పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఇంతకీ అతని పేరు డెషున్‌ వాంగ్. ఓ ముసలాయన ర్యాంప్‌ మీద నడవడం గొప్పేమీ కాకపోవచ్చు. 80 ఏళ్ల వయసులోనూ శరీరం దృఢంగా ఉండటమూ అసాధ్యం కాకపోవచ్చు. కానీ వీటి వెనుక ఉన్న అయన కథే అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది.

 

 

చిరుద్యోగం నుంచి

చైనాలోని షెన్‌యాంగ్‌ అనే చిన్న ఊరిలో 1936లో పుట్టారు డెషున్. తొమ్మిదిమంది భారీ సంతానం ఉన్న సాధారణ కుటుంబంలో తనూ ఒకడు. ఒక మిలటరీ కర్మాగారంలో చిన్న ఉద్యోగం చేసేవాడు. అయితే నాటకాల మీద ఆసక్తితో రేడియోలలోనూ, సినిమాలలోనూ పనిచేసేవాడు. 1980ల నాటికి డెషున్‌కి ఫ్యాషన్ రంగం మీదకి దృష్టి మళ్లింది. అందుకు కారణం లేకపోలేదు. చైనాలో ఆపాటికి ఫ్యాషన్ గురించి పెద్దగా అవగాహన లేదు. ఎలాపడితే అలా బట్టలు వేసుకుని తిరిగేవారు. ఇలాంటి పరిస్థితి చూసి ఫ్యాషన్‌కి మంచి భవిష్యత్తు ఉందని ఊహించారు డెషున్‌. ఫలితంగా 50 ఏళ్ల వయసులో ఫ్యాషన్‌లో కొత్త పాఠాలు నేర్చుకొంటూ, తను గ్రహించినదాన్ని పదిమందికీ నేర్పుతూ జీవనం మొదలుపెట్టాడు. నిదానంగా చిన్నా చితకా ఫ్యాషన్‌ షోలు కూడా నిర్వహించసాగాడు. దీనికి తోడుగా శరీరం మీద రంగులు పులుముకొని స్థిరంగా నిలబడే ‘'living sculpture’ అనే ప్రక్రియను కూడా సాగించాడు.

 

 

అదంతా ఓ ఎత్తు

ఫ్యాషన్‌ రంగంలో ఉన్నంత మాత్రాన దృఢంగా ఉండాలని లేదు. కానీ డెషున్‌ ఏ రోజునా తన ఆరోగ్యాన్ని ఆశ్రద్ధ చేయలేదు. ఇప్పటికీ ఆయన రోజుకి మూడుగంటల పాటు వ్యాయామం చేస్తాడు. ఈతకొడతాడు. మద్యం తీసుకోవడంలో మోతాదుని పాటిస్తాడు. అన్నింటికీ మించి తన దృక్పధమే తన దృఢత్వానికి కారణం అంటాడు. ‘వయసు అనేది ప్రకృతి నిర్ణయిస్తుందనీ, కానీ ఉత్సాహం అనేది మనసు నిర్ణయిస్తుందనీ’ అంటారు డెషున్‌. మానసికంగా దృఢంగా ఉంటే కనుక మన సత్తా ఏమిటన్నది మనకు తెలిసిపోతుందన్నది డెషున్‌ మాట.

 

నిత్య విద్యార్థి

డెషున్‌ కేవలం మాటలు చెప్పే మనిషి కాదు. ఆయన జీవితాన్ని గమనిస్తే వయసుకీ, మనసుకీ మధ్య ఏమాత్రం సంబంధం లేదన్న విషయం ఇట్టే అర్థమైపోతుంది. 44 ఏళ్ల వయసులో డెషున్‌ ఆంగ్లం నేర్చుకున్నాడు, 50 ఏళ్లప్పుడు ఫ్యాషన్‌ ప్రపంచంలోకి ప్రవేశించాడు, 65 ఏళ్ల వయసులో గుర్రపు స్వారీ నేర్చుకున్నాడు, 78 ఏళ్ల వయసులో మొదటిసారి మోటర్ సైకిల్ నడిపాడు. ఇక 79 ఏళ్ల వయసులో ర్యాంప్ మీద నడిచాడు. ఆయన తన జీవితంలో ఏ దశలోనూ వెనకబడలేదని చెప్పేందుకు ఇంతకంటే ఇంకేం లెక్కలు చెప్పగలం. ‘ఇప్పటికే ఆలస్యం అయిపోయింది అని మీకు మీరు చెప్పుకున్నారంటే... అది ఒక సాకు మాత్రమే. జీవితంలో ఎప్పటికీ ఏదీ ఆలస్యం కాదు. మనుషులు తమ జీవితాలను ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మార్చుకోవచ్చు,’ అన్న డెషున్‌ మాటలను వింటే చాలు... జీవితం మనకు సరికొత్తగా తోచడం ఖాయం1

 

- నిర్జర.