పాతికేళ్లలోపే డిప్రెషన్‌ వచ్చేస్తోంది!

ఇంటర్నెట్‌ గురించి అవగాహన ఉన్నవారు ‘PRACTO’ అన్నపేరు వినే ఉంటారు. మనకి దగ్గరలో ఉన్న వైద్యుల వివరాలను అందచేస్తూ, అవసరమైతే వారితో ఆన్‌లైన్‌ అపాయింట్‌మెంట్‌ లేదా చికిత్సను అందించే సంస్థే practo. వైద్యుల కోసం తమ సైట్‌ను సంప్రదించే వ్యక్తుల వయసు, అవసరాల ఆధారంగా ఈ సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికను చూడగానే ఇప్పటి యువత మానసిక సమస్యలతో సతమతం అయిపోతుదని తేలిపోతోంది. ఆ నివేదికలో ముఖ్య అంశాలు ఇవిగో…

 

- మానసిక సమస్యల కోసం వైద్యులను సంప్రదించేవారిలో 79 శాతం మంది 30 ఏళ్ల లోపువారే! - 25 నుంచి 34 వయసువారితో పోలిస్తే.... 24 ఏళ్లలోపువారే మానసిక వైద్యులని సంప్రదించడం ఆశ్చర్యం కలిగించే విషయం.

 

- గతంతో పోలిస్తే డిప్రెషన్, ఉద్వేగం వంటి సమస్యలతో మానసిక వైద్యులని సంప్రదించేవారి సంఖ్య ఏకంగా 62 శాతం పెరిగిందట.

 

- తమ మానసిక సమస్యలకు ఆన్‌లైన్ ద్వారా వైద్యుల పరిష్కారాన్ని కోరాలనుకునేవారి సంఖ్య దాదాపు నాలుగింతలు పెరిగిందట. మానసిక సమస్య అనగానే సమాజం చిన్నచూపు చూడటం వల్లే ఎక్కువమంది ఆన్‌లైన్లోనే వైద్యులను సంప్రదించే ప్రయత్నం చేస్తున్నారని భావిస్తున్నారు.

 

- ముంబై, దిల్లీ, బెంగళూరు నగరాల్లో మానసిక వైద్యులను సంప్రదించేవారి సంఖ్య ఎక్కువగా ఉంది. అలాగని మిగతా నగరాలు కూడా ఏమంత ప్రశాంతంగా ఉన్నాయని అనుకోవడానికి లేదు. గతంతో పోలిస్తే చెన్నై, కోల్‌కతా వంటి మహానగరాల్లో కూడా మానసిక వైద్యులని ఆశ్రయించేవారి సంఖ్య గణనీయంగానే పెరిగింది.

 

Practo అందిస్తున్న ఈ నివేదికని పూర్తిగా నమ్మడానికి లేదు. ఎందుకంటే యువత ఎక్కువగా ఆన్‌లైన్ మీద ఆధారపడుతుంది కాబట్టి... 30 ఏళ్లలోపు వారే ఈ సౌకర్యాన్ని ఎక్కువగా వినియోగించుకునే అవకాశం ఉంది. పైగా ఒకప్పుడు మానసిక సమస్య కోసం వైద్యుడి దగ్గరకి వెళ్లడం అంటే ‘నాకేమన్నా మెంటలా!’ అని నొచ్చుకునేవారు. కానీ ఇప్పటి యువత వైద్యుల కౌన్సిలింగ్ తీసుకోవడానికి  జంకడం లేదని తృప్తిపడాలేమో కూడా! కానీ ఇప్పుడిప్పుడే జీవితంలోకి అడుగుపెడుతున్న యువత మానసిక సమస్యలతో ఎందుకు సతమతం కావాల్సి వస్తోంది అన్నదే ఆలోచించాల్సిన విషయం. పిల్లలు ఎదుగుతున్న తీరులోనూ, ఎదిగాక వారు జీవించే విధానంలోనూ ఏదో లోటు ఉందేమో విశ్లేషించి తీరాల్సిందే!


- నిర్జర.