పగటి కలల్లో మునిగి తేలండోయ్

 

ఓ చిన్న కథ గుర్తుందా మీకు? ఒకడు బుట్టనిండా గాజు సామాను పెట్టుకుని అమ్మటానికి పట్టణానికి వెళుతూ, దారిలో చెట్టు నీడలో కాసేపు కూర్చుంటాడు. ఆ కాసేపటిలో తాను బుట్టలోని సామాను అంతా అమ్మేసినట్టు, దాని నుంచి వచ్చిన డబ్బుతో మళ్ళీ సామాను కొన్నట్టు, అలా అలా వ్యాపారం పెరిగి పెద్ద ఇల్లు, సేవకులు, మంది మార్బలం, పెళ్ళాంపిల్లలు... అలా ఊహించుకుంటూ, ఆ ఊహలో సేవకుడు ఏదో పని చెబితే చేయలేదని కాలితో ఓ తన్ను తంతాడు. ఊహల్లోని సేవకుడికి ఇతని కాలిదెబ్బ తగిలిందో లేదోగానీ, వాస్తవంలో కాలి దగ్గర వున్న గాజు సామాను కాస్తా నేలపాలై విరిగిపోతాయి. ఇలా గాల్లో మేడలు కడితే వచ్చేదేం లేదు కానీ, ఉన్నది కూడా పోతుందని పెద్దలు నీతి చెబుతారు. అయితే అదే పనిగా గాల్లో మేడలు కడుతూ, పగటి కలలు కంటూ వుంటే ఏమోగానీ, అప్పుడప్పుడు మాత్రం పగటి కలలు మంచివే అంటున్నారు ప్రముఖ మానసిక నిపుణురాలు డాక్టర్ బూత్రా.

 

సోమరితనం కాదు...

 

ఎవరైనా తమ స్థాయికి మించి ఏదో సాధిస్తామని చెప్పినప్పుడు పగటి కలలు కంటున్నావా? అంటూ వెక్కిరిస్తాం. ఆ తీరుని సోమరితనమని, కాలం వృధా చేయటమని అనుకుంటాం. కానీ, అవి మంచివే అంటున్నారు మానసిక వైద్య నిపుణులు. వ్యక్తులు తాము సాధించాలని అనుకుంటున్న కోరికలని, ఆశలని, తన ఆలోచనల్లో నింపుకున్నప్పుడు మనసంతా వాటితోనే నిండిపోయే పగటి కలలు కనడం ప్రారంభిస్తారు అంటున్నారు వీరు. మేలుకొని వుండగానే తమకిష్టమైన వాటిని అద్భుతంగా ఊహించుకోవడమే పగటికట అంటూ విశ్లేషిస్తున్నారు కూడా. సాధారణంగా అవి సంతోషకరమైన సందర్భాలు, ఆశలు, ఆశయాలే అయి వుంటాయి.

 

ఆరోగ్యకరం కూడా...

 

పగటి కలలు మంచివి మాత్రమే కావు.. ఒకోసారి అవి ఆరోగ్యకరమని కూడా చెబుతున్నారు క్లినికల్ సైకాలజిస్టులు. ముఖ్యంగా సంగీతం, నవలా రచన, దర్శకత్వం వంటి సృజనాత్మక వృత్తుల్లో రాణించడానికి ఈ పగటి కలలు ఎంతో ఉపయోగపడతాయని కూడా చెబుతున్నారు. సృజనాత్మకకి ఊహాశక్తి అవసరం కదా! ఆ ఊహల్లోంచి అద్భుత సృష్టి జరుగుతుంది. కాబట్టే చాలామంది గొప్పగొప్ప కవులు, రచయితలు వాస్తవ ప్రపంచంతో సంబంధం లేనట్టు ఎప్పుడూ ఊహాలోకాల్లో వుంటారంటూ చెబుతున్నారు వీరు. ఇంకా ఈ పగటి కలలు కనని వాళ్ళకి వాటిలో మునిగి తేలండంటూ సలహా కూడా ఇస్తున్నారు.

 

పగటి కలలకీ హద్దుంది...

 

నిరాశ ఆవరించినప్పుడు, ధైర్యం కోల్పోయినప్పుడు, కోపం అతలాకుతలం చేస్తున్నప్పుడు.... వెంటనే ఇష్టమైన విషయం కోసం లేదా రేపటి భవిష్యత్తు కోసం, ఉద్యోగం కోసం, పిల్లల కోసం... ఇలా ఎవరికి నచ్చిన ఊహల్లోకి వాళ్ళు వెళ్ళిపోవాలిట. కాసేపు... అంటే ఓ పది, పదిహేను నిమిషాలసేపు ఆ పగటి కలల్లో విహరిస్తే చాలు అప్పటి వరకు వున్న బాధ, నిరాశ పోయి వాటి స్థానంలో సంతోషం వచ్చి చేరుతుందిట. అదెలా సాధ్యం? అంటూ సందేహం వద్దు. ఎన్నో అధ్యయనాలు చేసి మరీ చెబుతున్నారు ఈ నిపుణులు. నమ్మకం కలగాలంటే మీరూ పగటి కలల్లోకి వెళ్ళి రావాల్సిందే. అయితే ఇక్కడ ఓ విషయం చెప్పాలి. పగటి కలలు అనేవి వాస్తవ పరిస్థితులకు పూర్తి భిన్నంగా వుండాలి. అంతేకానీ, ఆ కలల్లో కూడా కష్టాలు, కన్నీళ్ళు నింపితే ఆనందం బదులు కష్టం రెండింతలవుతుంది. అందులోనూ ఊహలకి హద్దేముంది? అలా హిమాలయాలదాకా వెళ్ళిరండి. లేదా రోడ్డుపై కారు నడపటానికి కూడా భయపడేవాళ్లు ఏకంగా విమానం నడిపేస్తున్నట్టు గాల్లో తేలిపోండి. సాధ్యాసాధ్యాల ప్రసక్తే లేదు. కానీ ఆ కలలకి కూడా హద్దు వుంది.

 

కమ్మటి కలల్లో విహరించండి...

 

పగటి కలల్ని పనులు మానుకుని మరీ కనాలనేం లేదుట. హాయిగా రాత్రి పడుకోబోయేముందు ఓ ఐదు నిమిషాలు అలా ఊహాలోకంలోకి వెళ్తే చాలుట. చక్కటి భావన కమ్మటి నిద్రని ఇస్తుందిట. అయితే నిపుణులు మరో విషయం కూడా చెబుతున్నారు. మంచివి అన్నాం కదా అని గంటలు గంటలు పగటి కలల్లోనే మునిగిపోతే మళ్ళీ అదో మానసిక సమస్యగా మారే ప్రమాదం వుందని అంటూ హెచ్చరిస్తున్నారు. నచ్చిన విషయాలని, కావాలనుకుంటున్న వాటిని కలలోనైనా దక్కించుకోవడం మంచిదే అంటున్నారు. మరింకేం... వీలు చిక్కితే కమ్మటి కలల్లో విహరించండి.

-రమ ఇరగవరపు