లోన్ పేరుతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కుమారుడికి టోకరా

posted on: Mar 8, 2019 11:46AM

 

సైబర్ నేరగాళ్లు జనాలను బురిడీ కొట్టించి డబ్బులు ఎలా కొట్టేస్తున్నారో తరచూ వార్తల్లో చూస్తూనే ఉంటాం. బ్యాంకు నుండి కాల్ చేస్తున్నామని నమ్మించడం, లేదా మీకు లాటరీ తగిలింది మీరు ముందు కొంత డబ్బు చెల్లిస్తే ఆ లాటరీ డబ్బులు మీకొస్తాయని చెప్పడం.. ఇలా రకరకాల మాయమాటలు చెప్పి డబ్బు కాజేస్తూ ఉంటారు. వీరి మాటలు డబ్బు పోగొట్టుకున్న బాధితులు చాలా మంది ఉంటారు. తాజాగా ఆ బాధితుల లిస్ట్ లో ఓ ఎమ్మెల్యే కుమారుడు కూడా చేరిపోయాడు.

ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద రుణాలు ఇప్పిస్తామని చెప్పి.. టీఆర్ఎస్ నేత, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ కుమారుడు ముఠా జయసింహకు సైబర్ నేరగాళ్లు శఠగోపం పెట్టారు. ముఠా జయసింహకు ఇటీవల ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. తాను సెక్రటేరియట్ నుంచి మాట్లాడుతున్నానని.. తన పేరు మల్లారెడ్డి అని చెప్పాడు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద రుణాలు ఇప్పిస్తామని.. వారం రోజుల్లో రూ.25లక్షల లోన్ వస్తుందని నమ్మించాడు. కావాలంటే సెక్రటేరియట్‌కు వచ్చి తమను కలుసుకోవచ్చని చెప్పాడు. ఈ పథకం కింద తెలిసిన వారికి రుణాలు ఇప్పిస్తే.. ఎమ్మెల్యే ఇమేజ్ పెరుగుతుందని నమ్మబలికాడు. దీంతో తొలిదశలో ఇద్దరు యువకులకు రుణాలు ఇప్పించాలని కోరారు జయసింహ. అయితే, బ్యాంక్ ప్రాసెసింగ్ ఫీజు 5శాతం ఉంటుందని సైబర్ నేరస్తుడు వారికి సూచించాడు. వారిని రూ.2.5లక్షలు ఇవ్వాలని కోరాడు. ఆ మాటలు నమ్మిన ముఠా జయసింహ అనుచరులు ఆ వ్యక్తి చెప్పిన బ్యాంక్ అకౌంట్లో డబ్బు జమ చేశారు. డబ్బులు వేశామని అతనికి చెప్పడానికి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. ఎంతసేపటికీ ఫోన్ కలవకపోవడంతో వారు మోసపోయామని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...