మళ్ళీ మొదటికొచ్చిన రుణాల మాఫీ వ్యవహారం?

 

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు ముఖ్యమయిన సమస్యలతో సతమతమవుతోంది. 1.వ్యవసాయ రుణాల మాఫీ. 2. రాజధాని నిర్మాణం. రిజర్వు బ్యాంకు రుణాలను రీ-షెడ్యూల్ చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకరించడంతో ప్రభుత్వం రుణాల మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. కానీ మళ్ళీ ఇప్పుడు రిజర్వు బ్యాంకు మరో కొత్త మెలికపెట్టింది. రుణాలను రీ-షెడ్యూల్ చేసేందుకు పంట నష్టం గురించి మరిన్ని వివరాలు కోరుతూ ఇరు ప్రభుత్వాలకు లేఖలు వ్రాయడంతో ఈ వ్యవహారంలో రిజర్వు బ్యాంకు వైఖరి అంతుపట్టడం లేదు. అందువల్ల రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్యకు ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలు కనుగొనక తప్పనిపరిస్థితి ఏర్పడినట్లు కనిపిస్తోంది. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎర్రచందనం దుంగల అమ్మకం, ప్రభుత్వానికి చెందిన ఎర్రచందనం అడవులను, బెవేరేజ్ కార్పోరేషన్ ఆస్తులను తాకట్టు పెట్టడం వంటి కొన్ని ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఆలోచన చేస్తోంది. అయితే నేటికీ అటు రిజర్వు బ్యాంకు అధికారులతో, మరో వైపు కేంద్రంతో సహాయం కోసం సంప్రదింపులు చేస్తూనే ఉంది.

 

ఇటువంటి సమయంలో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు వ్యవసాయ రుణాలు, రాజధాని అంశాలపై కేంద్ర వైఖరిని స్పష్టం చేసారు. పంట రుణాల మాఫీపై దేశంలో మిగిలిన రాష్ట్రాలకు అవలంభిస్తున్న పద్ధతి విధివిధానాలనే ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాలకు కూడా వర్తింపజేస్తామని తెలియజేసారు. అంటే రుణాల మాఫీ వ్యవహారంలో ఇరు రాష్ట్రాలకు ఎటువంటి ప్రత్యేక కేటాయింపులు లేదా మినహాయింపులు ఉండబోవని స్పష్టం చేసినట్లే భావించవచ్చును. తెలంగాణా ప్రభుత్వం ఈ వ్యవహారంలో కేంద్రం నుండి ఎటువంటి సహాయము ఆశించకపోయినా, ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా, మిత్రపక్షంగా ఉన్న తెదేపా ప్రభుత్వం మాత్రం కేంద్రం ఏదో విధంగా తనకు సహాయపడుతుందని ఆశిస్తునందున, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ప్రకటన తీవ్ర నిరాశ కలిగించే విషయమే. ఒకవేళ రిజర్వు బ్యాంకు రుణాలు రీ-షెడ్యూల్ చేసేందుకు నిరాకరించినట్లయితే, ఇక రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా ప్రత్యామ్నాయ పరిష్కారమార్గాల ద్వారా ఈ సమస్యను వీలయినంత పరిష్కరించుకోవలసి ఉంటుంది.

 

ఇక రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయమని వెంకయ్యనాయుడు కూడా మరోమారు స్పష్టం చేసారు. విభజన బిల్లులో పేర్కొన్న విధంగా అన్ని హామీలను కేంద్రప్రభుత్వం నెరవేరుస్తుందని విస్పష్టంగా ప్రకటించారు. అంటే రాజధాని నిర్మాణం కోసం అవసరమయిన నిధుల విడుదలలో ఎటువంటి సమస్య లేదని స్పష్టమవుతోంది.