Latest News
మహా కూటమిలో మరో సంక్షోభం.. శివసేనలో తిరుగు బావుటా!
posted on: Jun 21, 2022 1:20PM
మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. మూడు పార్టీల మహా వికాస్ అఘాడీ -ఎంవీఏ సర్కార్’కు సారధ్యం వహిస్తున్న శివసేనలో ముసలం పుట్టింది. ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న కేబినెట్ మంత్రి, శివసేన సీనియర్ నేత ఏక్నాథ్ షిందే మరో 11 మంది ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుబాటు బావుటా ఎగరేసారు.
తమ వర్గం ఎమ్మెల్యేలతో కలిసి గుజరాత్ కు వెళ్లిన షిండే బీజేపీతో చేతులు కలిపేందుకు సిద్ధమయినట్లు తెలుస్తోంది. అయితే, 12 మంది ఎమ్మెల్యేలు బయటకు పోయినంత మాత్రాన ఇప్పటికిప్పుడు ప్రభుత్వం కులిపోదు, కానీ, ముఖ్యమంత్రి పీఠానికి ఎసరొచ్చే ప్రమాదం ఉంటుందని, శివసేన వర్గాల నుంచే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, శివసేన పార్టీల మధ్య పెద్దగా సయోధ్యత లేదు. అలాగే, ఎన్సీపీ, శివసేనల మధ్య కూడా చెప్పుకోదగ్గ దోస్తానా లేదు. నిజానికి మూడు పార్టీలదీ తలోదారి, అయినా అవసరార్ధం కలిసి కాపురం చేస్తున్నాయి. మూడు పార్టీల మధ్య అధికార బంధం తప్ప మరో బంధం లేదు. నిజానికి షిండేతో పాటుగా చాలా మంది శివసేన ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారనే వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా,హనుమాన్ చాలీసా వివాదంతో శివసేన ఎమ్మెల్యేలలో ఆందోళన మొదలైందని, పార్టీ సీనియర్ నాయకుడు చెప్పారు. మరోవంక, ముఖ్యమంత్రికి పార్టీ మీద పట్టు తప్పిందని, శివసేన వ్యవస్థాపకుడు, బాల్ థాక్రేకు ఉన్న పట్టు ఉద్ధవ్ థాకరేకి లేవని పార్టీ నేతలు బహిరంగంగానే అంగీకరిస్తున్నారు. మరోవంక జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చెవిన వేసే ప్రయత్నం చేసినా ఆయన పట్టించుకోలేదని సీనియర్ నాయకులు అంటున్నారు. అందుకే పార్టీలో ముఖ్యంగా సైధాంతిక పునాదులు కదిలిపోతున్నాయని, గుర్తించిన ఎమ్మెల్యేలలో తమ రాజకీయ భవిష్యత్ విషయంలో భయం మొదలైందని, షిండేతో పాటుగా మరి కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళినా ఫలితం లేక పోవడంతో వారిలో సెకండ్ థాట్స్ మొదలయ్యాయని, ఆ విధంగా అంసతృప్తి పురుడు పురుడు పోసుకుందని పార్టీ ముఖ్య నేత ఒకరు పేర్కొన్నారు.
ఇప్పుడా అసంతృప్తి బయట పడింది. కొద్ది రోజుల క్రితం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లోనే అధికార కూటమిలో అసంతృప్తి వ్యక్తమైంది. అధికార కూటమి ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్’ కు పాల్పడ్డారు. ఫలితంగా బీజేపీ, ఒక స్థానం అదనంగా గెలుచుకుంది. ఇప్పుడు మళ్ళీ మండలి ఎన్నికల్లోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. అధికార కూటమికి మరో ఎదురు దెబ్బ తగిలింది, ఏకంగా 20 మంది కూటమి ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేయడంతో, బీజేపీ నలుగురి బలంతో ఐదుగురిని గెలిపించుకుంది. మొత్తం 10 స్థానాలకు ఎన్నికలు జరిగితే బీజేపీ 5 స్థానాలు గెలుచుకుంది.
అధికార మహా వికాస్ అఘాడీ భాగస్వామ్య పక్షాలైన శివసేన, ఎన్సీపీలు రెండేసి సీట్లలో, కాంగ్రెస్ ఒక స్థానంలో విజయం సాధించాయి. నిజానికి బీజేపీకి నలుగురు అభ్యర్థులను గెలుచుకోగల సంఖ్యా బలం(106) మాత్రమే ఉన్నప్పటికీ అయిదుగురిని బరిలోకి దించింది. పూర్తిస్థాయిలో విజయం సాధించింది. కూటమిలోని మూడు పక్షాలు కలిసి తలో రెండు వంతున ఆరు స్థానాల్లో పోటీ చేసినా అయిదుగురినే గెలిపించుకోగలిగాయి. కూటమి తరఫున కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన చంద్రకాంత్ హండోర్ ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో సొంత బలం 106 కాగా.. 133 ఓట్లు తమ అభ్యర్థులకు వచ్చాయని బీజేపీ తెలిపింది. బీజేపీకి అడనంగా పోలైన ఓట్లలో స్వతంత్ర అభ్యర్థులతో పాటు అధికార పక్షం వారివీ ఉంటాయని భావిస్తున్నారు. మరోవంక, శివసేన అధినేత షాక్ నుంచి తెరుకునేలోగానే షిండే తమ వర్గం ఎమ్మెల్యేలతో అజ్ఞాతంలోకి వెళ్లి పోయారు. దీనిని బట్టే అధికార పక్షంలోని ఏక్నాథ్ షిందే తిరుగుబావుటా ఎగరవేసినట్లు తెలుస్తోంది.
మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలకు గానూ.. సంకీర్ణ ప్రభుత్వానికి 169 మంది సభ్యులు ఉన్నారు. 113 సీట్లతో ఎన్డీఏ రెండో స్థానంలో ఉంది. ఒకవేళ ప్రస్తుతం అందుబాటులో లేని ఈ 12 మంది ఎమ్మెల్యేలు.. భాజపాలో చేరినా ప్రభుత్వం అధికారం కోల్పోదు. మహా వికాస్ అఘాడీకి.. మెజార్టీ కంటే ఎక్కువ స్థానాలే ఉన్నాయి. అయితే రాష్ట్రపతి ఎన్నికలకు ముందు.. ఇది బీజేపీ లాభం చేకూర్చే అవకాశం ఉంది. అంతేకాదు, ముఖ్యమంత్రి కజిన్ మహా రాష్ట్ర నవ నిర్మాణ సేన ( ఎంఎన్ఎస్) అధినేత్ రాజ్ థాకరే ఈ మధ్య కాలంలో దూకుడు పెంచారు. బెజేపీ కూడా ఎంఎన్ఎస్’తో పొత్తు పెట్టుకునేందుకు సిద్దమవుతోంది.
ఇపుదు శివసేన నుంచి షిండే వర్గం బయటకు వెళి, బీజేపీ, ఎంఎన్ఎస్, కుతమితో చేతులు కలితే శివసేన పునాదులు కదిలి పోవడం ఖాయమని శివ సైనికులు భావిస్తున్నారు. సో .. షిండే తిరుగు బాటుతోనే ప్రభుత్వం కూలిపోక పోయినా, శివసేన ఆధిపత్యం మాత్రం దెబ్బతింటుందని విశ్లేషకులు బావిస్తున్నారు.


.webp)
.webp)


