TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విమర్శనాత్మక కథనాలపై జర్నలిస్టులపై కేసులు సరికాదు.. సుప్రీం

Published on: Tue Oct 7, 2025 1:31PM

విమర్శనాత్మక వార్తలు రాసే జర్నలిస్టులకు రక్షణ కల్పించేలా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తూ వార్తలు రాసే జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టడం సరైనది కాదని దేశ సర్వోత్తమ న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఇలా కేసులు పెట్టడం భావ ప్రకటనాస్వేచ్ఛకు విఖాతం కిందకే వస్తుందని పేర్కొంది.  తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఓ జర్నలిస్టు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. అలాగే సదరు జర్నలిస్టుపై ఎటువంటి తొందరపాటు చర్యలూ తీసుకోవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి  ఆ జర్నలిస్టుకు అండగా నిలిచింది. వివరాలిలా ఉన్నాయి... 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అభిషేక్ ఉపాధ్యాయ్ అనే జర్నలిస్ట్ ప్రభుత్వ పాలనా విభాగంలో కుల సమీకరణాలకు సంబంధించి ఓ కథనం రాశారు. ఈ  వార్తా కథనం రాసినందుకు అభిషేక్ ఉపాధ్యాయపై  యూపీ సహా పలు ప్రాంతాలలో పోలీసు కేసులు నమోదయ్యాయి. వీటిని కొట్టివేయాలని కోరుతూ అభిషేక్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అభిషేక్ ఉపాధ్యాయ పిటిషన్ ను విచారించిన సుప్రీం కోర్టు ధర్మాసనం  ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కథనాలు రాసినంత మాత్రాన జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టడం సరికాదని పేర్కొంది.  ప్రజాస్వామ్య దేశాల్లో భావవ్యక్తీకరణ స్వేచ్ఛను గౌరవించాలనీ, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) జర్నలిస్టుల హక్కులకు రక్షణ ఉందని పేర్కొంది.  కేవలం జర్నలిస్టులు రాసిన కథనాలను విమర్శలుగా భావించి.. వాళ్లపై క్రిమినల్ కేసులు పెట్టకూడదని కుండబద్దలు కొట్టింది.   తదుపరి విచారణను నవంబర్ 5కు వాయిదా వేసింది.