తెలంగాణకు కొత్త రూపు..!

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన అన్న మాటను నిజం చేయబోతున్నారు. అదే కొత్త జిల్లాల ఏర్పాటు..తీవ్ర మల్లగుల్లాలు, వరుస సమీక్షలు, ఉద్యమాల మధ్య అధికార యంత్రాంగం 14 కొత్త జిల్లాలతో తుది జాబితాను ఖరారు చేసింది. దీంతో ఇప్పుడున్న పది జిల్లాలతో కలిపి మొత్తంగా 24 జిల్లాలతో తెలంగాణకు కొత్త రూపు రాబోతోంది. ఈ కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి మ్యాపులు, సరిహద్దుల వివరాలన్నీ భూపరిపాలన శాఖ సిద్ధం చేసింది. దీంతో  ప్రతి జిల్లా రెండు లేదా మూడు ముక్కలైంది. రాష్ట్ర ఆవతరణ దినోత్సవం నాటికి కొత్త జిల్లాలను ప్రకటిస్తానని సీఎం కేసీఆర్ ముందుగానే ప్రకటించడంతో ఆ రోజు నాటికి అన్ని పనులు చక్కబెట్టేందుకు అధికార యంత్రాంగం ఉరుకులు, పరుగులు పెడుతోంది.

 

 విశ్వసనీయ సమాచారం మేరకు ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం కేంద్రంగా కొత్తగా "భద్రాద్రి "జిల్లాను..నల్గొండ జిల్లాలోని భువనగిరి కేంద్రంగా "యాదాద్రి" జిల్లాను ఏర్పాటు చేయనున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాలను "కొమురం భీం" జిల్లాగా, వరంగల్ జిల్లాలోని భూపాల్‌పల్లి కేంద్రంగా "ఆచార్య జయశంకర్" జిల్లాగా ఏర్పాటు చేయనున్నారు. ఇదే వరంగల్ జిల్లాలోని జనగామను జిల్లాగా చేయాలని ప్రభుత్వం భావించినప్పటికి ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో మహబూబాబాద్‌ను జిల్లాగా చేయాలని నిర్ణయించారు.  జిల్లాల రేసులో ముందున్న నల్గొండ జిల్లా సూర్యాపేటకు అనుకున్నట్లుగానే జిల్లా హోదా దక్కింది. సీఎం కేసీఆర్ సొంత జిల్లా మెదక్‌లోని సిద్దిపేటతో పాటు సంగారెడ్డిని కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయనున్నారు. నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి, కరీంనగర్ జిల్లాలోని  జగిత్యాలను కొత్త జిల్లాలుగా ఎంపిక చేశారు.

 

జిల్లాల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగిన జిల్లా మహబూబ్‌నగర్.. ఇక్కడి నుంచి వనపర్తి, నాగర్ కర్నూల్‌లను జిల్లాలుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే గద్వాలను కూడా జిల్లాగా చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నడిచాయి. అయినప్పటికి ప్రభుత్వం ముందుగా అనుకున్నదానికే కట్టుబడింది. జిల్లాల ఏర్పాటులో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల విభజనపై అధికార యంత్రాంగం భారీ కసరత్తును చేస్తోంది. హైదరాబాద్‌ను రెండు జిల్లాలుగా , రంగారెడ్డిని రెండు జిల్లాలుగా విభజించాలని నిర్ణయానికి వచ్చారు. రంగారెడ్డిలో వికారాబాద్ కేంద్రంగా కొత్త జిల్లాను, హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ ప్రాంతాన్ని కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

 

ఇదిలా ఉండగా కొత్త జిల్లాల కోసం వివిధ జిల్లాల్లో ఇంకా ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. వీటిపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి అవి ప్రజల డిమాండ్లేనా..ఇంకేమైనా అంశాలు ఉన్నాయా అనే సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇవాళ జిల్లా కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగానే  జిల్లాల రూపకల్పనపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటులో కలెక్టర్ల పాత్ర  కీలకం కావడంతో వారితో ప్రత్యేకంగా చర్చించాలని సీఎం భావించారు. అందుకే అంతా సవ్యంగా సాగేందుకు వీలుగా సీఎం కలెక్టర్లను అప్రమత్తం చేయనున్నారు. మొత్తం మీద పది జిల్లాల తెలంగాణ కాస్తా..24 జిల్లాల తెలంగాణ కానుంది. రాష్ట్రం ఏర్పడిన రెండేళ్లలోనే తెలంగాణలో జిల్లాల సంఖ్య రెట్టింపు కన్నా ఎక్కువ కానుంది. అదే సమయంలో, సుమారు వెయ్యి కోట్లకు పైనే కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రభుత్వంపై భారం పడనుందని అంచనా. అయితే, కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధుల్ని రాబట్టేందుకు కొత్త జిల్లాల ఏర్పాటు తప్పదని కేసీఆర్ భావిస్తున్నారు. ఒక్కటి మాత్రం నిజం..పది జిల్లాల తెలంగాణ కన్నా ఇరవై నాలుగు జిల్లాల తెలంగాణ అన్న మాట వినడానికి కాస్త "గొప్ప"గా కనిపిస్తుంది.