మా పార్టీకి అంత సీన్ లేదు: రామచంద్రయ్య

 

ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ గంగలోకలిపేసి, రాష్ట్ర దేవాదాయ మంత్రి పదవితో పునీతం అయిన తరువాత కూడా, కాంగ్రెస్ పార్టీ తమతో ఇంకా ‘మైల’పాటిస్తూ దూరంగా ఉంచుతోందని మంత్రి సి.రామచంద్రయ్యగారు అప్పుడప్పుడు ఆరోపిస్తుంటారు. చిరంజీవి చొరవతో కిరణ్ కుమార్ రెడ్డి తనకో మంత్రి పదవి పడేసినంత మాత్రాన్న తనకు కొత్తగా పెరిగిన గౌరవం ఏమి లేదని ఆయన సన్నాయి నొక్కులు నొక్కుతూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయిన తరువాత కూడా తనకు, తన అనుచరులకు పార్టీలో తగినంత ప్రాధాన్యం ఈయట్లేదనే బాధ కూడా ఆయనలో ఉంది. అది అప్పుడప్పుడు అయన మాటలలో బయటపడుతుంటుంది.

 

మొన్న జరిగిన సహకార ఎన్నికలలో, తనను తన అనుచరులను పులుసులో కరివేపాకులా పక్కన పడేసి, అంతా తానయి చక్కబెట్టిన కిరణ్ కుమార్ రెడ్డి పట్ల రామచంద్రుల వారికి కొంచెం ఆగ్రహం కలగడం సహజమే. అందుకే, ఈ సహకార ఎన్నికలలో కిరణ్ కుమార్ రెడ్డి ‘టముకు’ వేసుకొంటున్న ఘన విజయమేమి తమ పార్టీ సాధించలేదని, అందువల్ల మరీ అంత సంతోషపడి ఉప్పొంగిపోవలసిన అవసరం కూడా లేదని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలో అందరినీ కలుపుకొని ముందుకు సాగిఉంటే ఇంతకంటే ఘన విజయం ‘నిజంగానే’ సాదించగలిగేవాళ్ళమని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డిని ఈ విషయంలో ప్రతిపక్షాలవారు దెప్పడం మరిచిపోయినా, ఆయన క్యాబినెట్ సహచరుడయిన సి.రామచంద్రయ్య శ్రమనుకోకుండా కిరణ్ నెత్తిన నాలుగు అక్షింతలు వేసి ఉన్న మాటను నలుగురికీ తెలియజెప్పారు.