ఏపీలోనూ తెలంగాణ ఫలితాలే..!

posted on: Jan 4, 2019 3:30PM

 

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ ప్రత్యేక హోదా సాధన సమితి ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద రెండోరోజూ ధర్నా చేపట్టింది. సీపీఐ, సీపీఎం, హోదా సాధన సమితి నేతలు, విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ  ధర్నాకు సంఘీభావం పలికారు. ఈ సందర్భంగా ఏచూరి మాట్లాడుతూ.. ఏపీకి భాజపా ఇస్తామన్న ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదని దుయ్యబట్టారు. పోలవరానికి నిధులు కూడా సరిగా ఇవ్వలేదని, విభజన హామీలు నెరవేర్చలేదని తెలిపారు. చట్టంలో ఉన్నవాటిని కూడా పట్టించుకోని భాజపా ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర హక్కుల కోసం ప్రజా ఉద్యమాలు కొనసాగుతాయన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచిన పార్టీపై కూడా హామీల అమలు కోసం పోరాడతామని వెల్లడించారు. 

నారాయణ మాట్లాడుతూ..ప్రత్యేక హోదా విషయంలో ఏపీని కేంద్రం దగా చేసిందని దుయ్యబట్టారు. ఎన్నికల వేళ ఐదేళ్లు కాదు.. పదేళ్లు హోదా అన్న వాళ్లే ఇప్పుడు మాట మార్చారని విమర్శించారు. కనీసం విభజన చట్టంలోని అంశాలను కూడా అమలు చేయడం లేదన్నారు. మోడీ నిరంకుశ పాలనకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. తెలుగు రాష్ట్రాల్లో భాజాపాకు పుట్టగతులు ఉండవని జోస్యం చెప్పారు. ఇప్పటికే తెలంగాణలో డిపాజిట్లు కూడా రాలేదని, ఏపీలోనూ అవే ఫలితాలు పునరావృతమవుతాయని వ్యాఖ్యానించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...