దేశంలో 2 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు.. మూడో వేవ్ కమ్మేసిందన్న డాక్టర్లు

posted on: Jan 5, 2022 9:26AM

ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ మూడో వేవ్ కమ్మేస్తోంది. అగ్రరాజ్యం అమెరికా అల్లాడిపోతోంది. యూరప్ దేశాలు కొవిడ్ తో విలవిలలాడుతున్నాయి. మన దేశంలోనూ కరోనావైరస్ మరోసారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. శరవేగంగా విస్తరిస్తూ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. రెండు రోజులుగా 30వేలకు పైగా నమోదయిన కొత్త కేసులు.. మంగళవారం ఒక్కసారిగా 58 వేలకు చేరాయి. ముందురోజు కంటే 55 శాతం అధికంగా నమోదయ్యాయి.  మంగళవారం 13,88,647 మంది కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. వారిలో 58,097 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. డైలీ పాజిటివిటీ రేటు 4.18 శాతానికి చేరింది.

వేగంగా ప్రబలే లక్షణమున్న కొత్త వేరియంట్  ఒమిక్రాన్ వ్యాప్తి కలవరం పుట్టిస్తోంది. ఇప్పటివరకూ 2,135 మందిలో ఈ వేరియంట్‌ను గుర్తించారు. అందులో 828 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి ఇంటికి చేరుకున్నారు.  అత్యధికంగా మహారాష్ట్రలో 653 మంది దీని బారినపడగా.. దిల్లీలో ఆ సంఖ్య 464కి చేరింది. 24 రాష్ట్రాలకు ఈ వేరియంట్ విస్తరించిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.  దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 2.14 లక్షలకు చేరి.. ఆ రేటు 0.61 శాతానికి పెరిగింది  

దేశంలో పెరుగుతున్న కొవిడ్‌ కేసుల తీరు మూడో  వేవ్‌కి సంకేతంలా కనిపిస్తోందని ఇమ్యునైజేషన్‌పై ఏర్పాటైన జాతీయ సాంకేతిక సలహా బృందం (ఎన్‌టాగీ) ఛైర్‌పర్సన్‌ డాక్టర్‌ ఎన్‌.కె.అరోడా అభిప్రాయపడ్డారు. భారత ప్రధాన నగరాల్లోను, చాలా రాష్ట్రాల్లోనూ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ఉటంకించారు. అయితే భయపడాల్సిన అవసరం లేదని, జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అని చెప్పారు. పీటీఐ వార్తాసంస్థతో మాట్లాడిన అరోడా పలు అంశాలను వెల్లడించారు. 

దక్షిణాఫ్రికాలో కొవిడ్‌ పరిస్థితితో మన దేశంలో సరళిని పోల్చిచూస్తూ  అరోడా విశ్లేషించారు. ‘‘దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్‌ వేవ్‌ తీరును పరిశీలిస్తే ఒక్కసారిగా కేసులు అమాంతం పెరిగాయి. రెండు వారాల్లో తగ్గుముఖం పట్టడం ప్రారంభించాయి. ఈ కేసుల్లోనూ చాలామేర లక్షణాలు లేనివి, స్వల్ప లక్షణాలున్నవే కనిపించాయి. ఈ పరిస్థితులన్నీ దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్‌ వేవ్‌ కొద్దికాలంలోనే తగ్గిపోతున్నట్లు సూచిస్తున్నాయి. కొవిడ్‌ వ్యాప్తి తీరుకు సంబంధించి దక్షిణాఫ్రికా, భారత్‌ల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. రెండు దేశాల్లోనూ స్వాభావికంగా ఇన్‌ఫెక్షన్‌ రేటు చాలా ఎక్కువగానే ఉంది. అయితే మన దేశంలో ఇమ్యునైజేషన్‌ రేటు అనేక రెట్లు ఎక్కువ ఉంది’’ అని తెలిపారు.  గత వారం, పది రోజులుగా భారత్‌లో కొవిడ్‌ వ్యాప్తి తీరును చూస్తే.. అతి త్వరలోనే మూడో ఉద్ధృతి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై ఆందోళనకు లోను కావాల్సిన అవసరం లేనప్పటికీ వ్యాక్సినేషన్‌ మరింత వేగంగా సాగాలని, అలాగే కొవిడ్‌ నిబంధనలను ప్రజలంతా కచ్చితంగా పాటించాలని పునరుద్ఘాటించారు. తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌ బారిన పడకుండా, ఆసుపత్రి పాలయ్యే పరిస్థితి ఎదురుకాకుండా ఉండాలంటే ఇప్పటి వరకు టీకా తీసుకోనివారు, మొదటి డోసు తీసుకున్నవారు వెంటనే వ్యాక్సినేషన్‌ పూర్తి చేసుకోవాలని తెలిపారు ఎన్‌టాగీ  ఛైర్‌పర్సన్‌ డాక్టర్‌ ఎన్‌కె అరోడా. 

google-ad-img
    Related Sigment News
    • Loading...