తెలంగాణపై కరోనా పంజా.. లాక్ డౌన్ తప్పదా?  

posted on: Jan 5, 2022 10:35AM

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మూడో వేవ్ మొదలైందా? రానున్న రోజుల్లో కల్లోలం తప్పదా? రోజుకు లక్ష కేసులు కూడా వచ్చే అవకాశం ఉందా? అంటే వైద్య వర్గాల నుంచి అవుననే తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఏకంగా ఒక్క రోజులోనే 1000కి పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో  థర్డ్ వేవ్ మొదలైందా అనే భయాందోళనలు కలుగుతున్నాయి. 

జీహెచ్ఎంసీ పరిధిలోనే 63 శాతం కేసులు (659 ) నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఆ తర్వాత మేడ్చల్ (119) రంగారెడ్డి (109) జిల్లాల్లోనూ భారీగా కేసులు పెరిగాయి. తెలంగాణలో న్యూఇయర్ కు ముందు గత నెల 29న 3490 యాక్టివ్ కేసులు ఉండగా.. ప్రస్తుతం వాటి సంఖ్య 4858కి పెరిగింది.రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 42991 నమూనాలను పరీక్షించగా..  వెయ్యికి పైగా కేసులు రావడం ఆందోళన కల్గిస్తోంది. పాజిటివ్ రేటు భారీగా పెరిగిందని, ఇది అత్యంత ప్రమాదరకమని వైద్య వర్గాలు చెబుతున్నాయి. 

దేశంలో ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే 12 రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమలవుతోంది. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, పంజాబ్ లో విద్యా సంస్థలు మూతపడ్డాయి.న్యూ ఇయర్ వేడుకలతో వైరస్ విజృంభిస్తోందని అంచనా వేశారు. తెలంగాణలో రాష్ట్రంలో న్యూ ఇయర్ ఎఫెక్ట్ భారీగానే పడింది. రానున్న రెండు వారాలు  చాలా జాగ్రత్తలు పాటించాలని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ హెచ్చరించారు. గురుకుల పాఠశాలలు కళాశాలల్లోనూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. మహబూబాబాద్ నల్గొండ ఆదిలాబాద్ జిల్లాల్లోని గురుకులాల్లో తాజాగా కరోనా విద్యార్థులు ఉపాధ్యాయులకు సోకింది. కరోనా భయంతో స్కూళ్లకు విద్యార్థుల హాజరు కూడా భారీగా తగ్గిందని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ముందుగానే ప్రకటించింది. అయితే సంక్రాంతి తర్వాత కూడా స్కూళ్లు తెరవకపోవచ్చని భావిస్తున్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...