TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతున్న కోర్టు స్టేలు

Published on: Tue Mar 13, 2012 11:44AM

కబ్జాదారుల ఆక్రమణల్లో సుమారు 2 వేల ఎకరాలు
హైదరాబాద్:
రాష్ట్రవ్యాప్తంగా కబ్జాదారులు దర్జాగా భూములను ఆక్రమించుకుని ఆ తరువాత కోర్టుల నుంచి స్టే తెచ్చుకుని రాజభోగాలు అనుభవిస్తున్నారు. కబ్జాదారులు కోర్టు స్టేల ద్వారా సుమారు 2వేల ఎకరాల భూమిని తమ కబంధ హస్తాల్లో ఉంచుకున్నారని ప్రభుత్వ నివేదికల్లో వెల్లడయింది. దీనిలో  ఎక్కువభాగం ఏజెన్సీ ప్రాంతానికే దక్కుతుంది.దీనికి తోడు అసైన్డ్ భూములు కూడా పెద్దఎత్తున ఆక్రమణలకు గురయ్యాయి. కబ్జాదారులు రెవెన్యూ అధికారుల, ఉద్యోగుల సహకారంతో ముందుగా భూములు గుర్తించి వాటిని కబ్జా చేసేస్తున్నారు. తరువాత వారిలో వారే ఒకరి పేరు నుంచి మరోకరి పేరుకు రిజిస్ట్రేషన్ బదిలీ చేసుకుంటున్నారు. తరువాత ఎవరో ఒకరు కోర్టుకు వెళ్ళి కోర్టునుంచి ఆర్డర్ తెచ్చుకుంటున్నారు. ఈ ఆర్డర్ ను చూపించి దీనిపై ఎటువంటి వివాదంలేదని, కోర్టు కూడా తమకే అనుకూలంగా తీర్పునిచ్చిందని నమ్మబలుకుతూ దానిని అమాయకులకు విక్రయిస్తున్నారు.

ఇలా కొన్న వ్యక్తులు తరువాత ఇది ప్రభుత్వ భూమి అని తెలుసుకుని లబోదిబో మంటున్నారు. ప్రభుత్వం దీనిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తే వారు మళ్ళీ కోర్టును ఆశ్రయిస్తున్నారు. స్టేల కారణంగా ప్రభుత్వ భూములు సుమారు 2వేల ఎకరాలు పరాధీనంలో ఉన్నాయి. వ్యక్తికి వ్యక్తికి మధ్య  నలుగుతున్న వివాదాల్లో కోర్టులు స్టే విధించడంలో అర్ధం ఉంది, కాని ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యక్తులు దాఖలుచేసిన పిటీషన్లపై కోర్టులు స్టే ఉత్తర్వులు ఇవ్వడంవల్ల అమూల్యమైన ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. అంతేకాక పేదలకు దక్కాల్సిన ప్రభుత్వ భూములు కబ్జాదారులు దర్జాగా అనుభవించగలుగుతున్నారు.