కోర్ కమిటీ తేల్చలేనిది వర్కింగ్ తేల్చగలదా

 

తెలంగాణా అంశం కాంగ్రెస్ కోర్ కమిటీ నుండి వర్కింగ్ కమిటీలో పడిందిప్పుడు. ఇంత వరకు చర్చించింది వేరెవరో పార్టీ వాళ్ళన్నట్లు ‘ఇక తేల్చాల్సింది కాంగ్రెస్ పార్టీయే’నని నిన్న దిగ్విజయ్ సింగ్ గారు చేతులు దులుపుకొన్నారు. నిన్న జరిగిన కోర్ కమిటీ సమావేశంలో ఎవరూ అనామకులు, రాజకీయ పరిజ్ఞానం లేని వారు పాల్గొనలేదు. 125సం.ల చరిత్రగల కాంగ్రెస్ పార్టీని, సువిశాల భారత దేశాన్ని నడిపిస్తున్న అతిరధ మహారధులందరూ ఈ సమావేశంలో పాల్గొన్నారు. అటువంటి వారు ఒక సంక్లిష్టమయిన అంశంపై నిర్ణయం తీసుకోవడానికి వెనుకంజ వేసినప్పుడు, రేపు అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులతో కూడిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కాకుండా ఉంటాయా? సదరు ప్రతినిధులు ఇచ్చే సరికొత్త ఆలోచనలు, వెలిబుచ్చే సరికొత్త ధర్మ సందేహాలతో మళ్ళీ సమస్య మొదటికి రాకుండా ఉంటుందా?

 

దీనికి టీ-కాంగ్రెస్ నేత యంపీ పొన్నం ప్రభాకర్ చెప్పిన సమాధానం చాలా వింతగా ఉంది. “ఏదయినా ఒక ముఖ్య అంశంపై నిర్ణయం తీసుకోవలసివచ్చినపుడు దానిని వర్కింగ్ కమిటీకి నివేదించి వారితో చర్చించి అంతిమ నిర్ణయం తీసుకోవడం కాంగ్రెస్ సంప్రదాయం. కాంగ్రెస్ ప్రజాస్వామ్య బద్దంగా నడుచుకొంటుందని చెప్పడానికి ఇదే గొప్ప ఉదాహరణ. అయితే అంత మాత్రాన్న అధిష్టానం ప్రతిపాదించిన అంశాన్ని వర్కింగ్ కమిటీ సభ్యులు వ్యతిరేఖించే అవకాశం లేదు. ఎందుకంటే అందరికీ అధిష్టాన నిర్ణయమే శిరోధార్యం. వారు ఈ అంశంపై కేవలం చర్చిస్తారు తప్ప అంతిమ నిర్ణయం తీసుకోరు. అందువల్ల తెలంగాణా అంశంపై అధిష్టానం నిర్ణయమే తుది నిర్ణయం అవుతుంది.”

 

ఆయన చెప్పిన ప్రకారం చూస్తే వర్కింగ్ కమిటీకి నిర్ణయం తీసుకొనే హక్కు లేదని, కేవలం సమస్యపై చర్చించడానికి మాత్రమే అవకాశం ఉందని అర్ధం అవుతోంది.మరి అటువంటప్పుడు మళ్ళీ అటువంటి నిర్ణయం తీసుకోలేని కమిటీకి ఈ అంశాన్ని నివేదించడం ఎందుకు? గత మూడేళ్ళుగా అనేక నివేదికలను, రాజకీయ పార్టీలను సంప్రదించి అన్ని విషయాలపై అనేక మార్లు లోతుగా చర్చించిన తరువాత ఇప్పుడు మళ్ళీ ఈ వర్కింగ్ కమిటీలో నిరుపయోగమయిన చర్చ ఎందుకు? ఒక వేళ కాంగ్రెస్ పార్టీకి అంత నియమనిష్టలు ఉండి ఉంటే మరి ఈ పని ముందే చేసి ఉంటే దానివల్ల దేశవ్యాప్తంగా ఉన్న తన ప్రతినిధుల అమూల్యమయిన సలాహాలు ముందుగానే దొరికేవి కదా? ముందు చేయవలసిన ఈ పనిని ఆఖరున చేయాలనుకోవడం కేవలం మరికొంత కాలం ఈ సమస్యను సాగదీసేందుకే తప్ప వేరొక ఆలోచన కాదు.

 

ఇక ఈ విషయంలో పొన్నం ప్రభాకర్ మరో నిఖార్సయిన నిజం కూడా చెప్పారు. “చర్చల పేరిట కాలయాపన జరగడం, ఒక కమిటీ నుండి మరొక కమిటీకి అంశం బదలాయించుకొంటూ పోవడం వలన ప్రజలలో మా పార్టీపై అనుమానాలు రేకెత్తుతున్న మాట వాస్తవం. అయితే, తెలంగాణా ఇచ్చేది, తెచ్చేది మేమే అని ఘంటాపధంగా చెపుతున్నపుడు, మా పార్టీ అధిష్టానం చేత తెలంగాణా ఇప్పించినా, ఇప్పించలేకపోయినా కూడా అందుకు మేమే బాధ్యత వహించక తప్పదు. మా అధిష్టానం త్వరలోనే తెలంగాణా ఇస్తుందని మాకు నమ్మకం ఉంది,” అని ఆయన అన్నారు.

 

కాంగ్రెస్ అధిష్టానం, తెరాసను విలీనం కోసమో లేక సీమంధ్ర నేతల ఒత్తిళ్ళు తట్టుకోలేకనో చర్చలపేరిట సమయం పొందేందుకు ప్రయత్నిస్తూ కాలక్షేపం చేస్తూపోతే అది అంతిమంగా ఆ పార్టీకే నష్టం కల్గించక మానదు. అదే విషయాన్నీ పొన్నం మరో విధంగా తెలియజేస్తున్నారు.