ఏమి కోరు కమిటీలవి? ఏమి కబుర్లవి?

 

హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే మొదలుపెట్టిన నెల రోజుల సస్పెన్స్ సీరియల్ క్లైమాక్స్ ఎలావుంటుందో తెలియదుగానీ, డిల్లీ పెద్దలు నలుగురు చేరి తలుపులేసుకొని ఏదో ‘కోరు’ కమిటీలుగా ఏర్పడి రోజూ రకరకాల కాంబినేషన్స్ ఉన్ననేతలతో చర్చోపచర్చలు చేస్తూ హాడావుడి చేస్తుంటే, బ్రేక్ తరువాత ఏమవుతుందో అనే ఆత్రంతో ఇక్కడ రాజకీయ నాయకులు, ప్రజలు కూడా బీపి.లు పెంచేసుకొంటున్నారు.

 

ఒకరోజు కోరు కమిటీ సమావేశంలో హోంమంత్రి షిండేగారు అఖిలపక్షానికి సోనియమ్మ రాలేదుగనుక, ఆమెకి అక్కడ ఏమిజరిగిందో పూసగుచ్చినట్లు వివరించి బ్రేక్ ఇస్తే, మరుసటిరోజు వీరందరూ కలిసి మరో కోరుకమిటీగా ఏర్పడి ప్రధానమంత్రి మన్మోహన్ సింగువారిని మద్యలో కూర్చోబెట్టుకొని, మళ్ళీ జరిగిన కధంతా మొదటి నుంచి చెపుతారు. ఇంకా, రేపు విదేశాల నుండి తిరిగి రాబోతున్నరాహుల్ యువరాజుల వారికీ ఈ కధంతా చెప్పాలంటే మళ్ళీ మరో కోరు తప్పదు. ఈ విదంగా కాంగ్రేసు పెద్దలందరూ కలిసి రాష్ట్ర సమస్యని కొబ్బరి కోరినట్లు తలుపులేసుకొని మరీ కోరేస్తుంటే, ఇక్కడ రాజకీయనాయకుల బీపీలు గంటకో తీరున లేచి పడి పోతున్నాయి.

 

ఇక మీడియాకి కూడా వేరే హాట్ న్యూస్ ఏమి ఇంకా దొరకనందున, అక్కడ వార్ రూమో లేక ఏ.సి. రూములోనో తలుపులు బిడాయించుకొని మరీ మాట్లాడుకొంటున్న కాంగ్రెస్ పెద్దలు, ఏమేమి మాట్లాడుకొన్నారో, ఎవరితో ఎవరు ఏమన్నారో, అప్పుడు సోనియమ్మా ఎలా కోప్పడిందో, చిదంబరం చంకలోఉన్న ఫైల్లోంచి ఏఏ కాగితాలు చుపించేడో, ఎవరు టీ తాగేరో, దగ్గేరో, తుమ్మేరో వంటి అన్ని వివవరాలను స్వయంగా వారిపక్కన కూర్చొని చూసోచ్చిన్నట్లు రకరకాల కధనాలు స్క్రోలింగులు ఇచ్చేస్తూ, అచ్చొత్తి పడేస్తూ అటు నేతలకు, ఇటు ప్రజలకు కూడా మంచి కాలక్షేపం కల్పిస్తోంది.

 

బ్రేక్ తరువాత అంటే కోరుకమిటీ సమావేశం తరువాత, ఏమయినా మంచి సంచలనమయిన వార్త ఎవరయినా చెపుతారేమోనని ఆశగా చూస్తున్న మీడియాకి చిన్న పాటి క్లూ కూడా ఈయకుండా వారు కారెక్కి వెళ్ళిపోతుంటే, అక్కడ ఎంతో ఓపిగ్గా ఎదురుచూస్తున్న కెమెరామాన్ గంగతో రాంబాబులు మరీ నిరాశాపడిపోకుండా , “ఇపుడే ముగిసిన కీలకమయిన కోరుకమిటీ సమావేశం, ఆ...జాదూగారు వెళ్తూ వెళ్తూ చేయి ఆడించేరు. అంటే, ఇక తెలంగాణా ఈయరని మనకొక సందేశం ఇచ్చేరు. ఆయన కారువెనుక పొగ గొట్టం నుండి వస్తున్ననల్లని పొగ కూడా మనకు అదే సంకేతం ఇస్తోంది...పావనీ..ఓవర్ టు స్టూడియో...అని వారు చెప్పేయగానే, రాష్ట్ర సమస్యపై పేటెంట్ హక్కులు కలిగిన ఓ నలుగురు పెద్ద మనుషులు అప్పటికే స్టుడియోలో కూర్చొని, పెద్ద గొంతులతో ఒకరిమాట మరొకరికి వినబడకుండా ‘చేయి అడ్డంగా ఊపలేదు, నిలువుగానే ఊపేరు గనుక...’అంటూ టీవీలు బద్దలయిపోయెంత గట్టిగా వాదులాడుకోవడం వెన్వెంటనే జరిగిపోతుంది.

 

ఇక పత్రికలకి ఆ అవకాశం ఉండదు గాబట్టి, తాపీగా కూర్చొని ‘ఆ..జాదూ చేయి అలా ఎందుకు ఊపేడు? ముఖ్యమంత్రి హుటాహుటిన డిల్లీ ఎందుకు వెళ్ళేరు? ఎక్కడో ఉన్న బన్సాల్ మంత్రిని ఎందుకు డిల్లీ పిలిపించేరు? సీమంద్ర నాయకుడయిన ఫలానా మంత్రి డిల్లీలో మూడు రోజులుగా ఎందుకు మకాం వేసేడు? చిరంజీవి నల్గొండలో ఎందుకలాగ అన్నాడు? రాహుల్ గాంధి మళ్ళీ ఇండియాకి ఎందుకు తిరిగివచ్చేస్తున్నాడు? పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో సోనియా ఏమి మంతనాలు చేసారు? అంటూ రకరకాల పాయింట్స్ లేవనెత్తుతూ ‘సంక్రాంతికి విడుదల కానున్న తెలంగాణా’ అని ఒక పత్రిక వ్రాస్తే, ‘సమైక్యాంద్రాకి మొగ్గుచూపుతున్నఅంబికా సోనీ’ అంటూ మరో పత్రిక వ్రాసేస్తుంది.

 

కాంగ్రెస్ క్లైమేక్స్ ఎలాగ ఉంటుందో తెలియనప్పటికీ, ఈ సస్పెన్స్ సీరియల్ వల్ల, తమ డెయిలీ జీడిపాకం సీరియళ్ళు చూసే వాళ్ళు బాగా తగ్గిపోయారని కొన్ని టీవీ ఛానళ్ళ వారు తలపట్టుకొంటున్నారు. గానీ, విజ్ఞానదాయకమయిన ఈ కాంగ్రెస్ సీరియాల్ వల్ల ప్రజలకి రాజకీయ పరిజ్ఞానం పెరుతోందని మాత్రం అందరూ ఒప్పుకోక తప్పదు.