గడియారాల చుట్టూ- కర్ణాటక రాజకీయాలు!

 

ఎక్కడైనా గడియారం తిరిగితే చూడ్డానికి బాగుంటుంది. కానీ మనుషులే గడియారాల చుట్టూ తిరిగితే విచిత్రంగా కనిపిస్తుంది. కర్ణాటకలో ఇప్పుడు అదే జరుగుతోంది. అక్కడి కాంగ్రెస్‌, జనతాదళ్ నేతలు వాచీల గురించి కొట్టుకుంటున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్యగారు 70 లక్షలు విలువ చేసే వాచీని పెట్టుకున్నారహో! అంటూ కొద్ది రోజులుగా ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. దానికి సిద్దరామయ్యగారు అలాంటిది ఏమీ లేదనీ.... కావాలంటే లక్షలు పోసి తన వాచీని మీరే తీసుకోండని పేర్కొన్నారు.

 

ఈ మాటల యుద్ధం అలా సాగుతుంటే, ఇప్పడు కాంగ్రెస్‌ నేతలు దీని గురించి ప్రత్యారోపణలు కూడా మొదలుపెట్టారు. మా ముఖ్యమంత్రి సంగతేమో కానీ జనతాదళ్‌ నేత కుమారస్వామి వద్ద కోట్లు విలువ చేసే వాచీలు కార్లూ ఉన్నాయంటూ ఓ చిట్టాని బయటపెట్టారు. ఈ చిట్టా ప్రకారం కుమారస్వామి వద్ద వజ్రాలు పొదిగిన ఓ 50 లక్షల రూపాయల వాచీతో సహా ఆరు ఖరీదైన గడియారాలు ఉన్నాయట. ఇందులో ఓ గడియారం విలువైతే ఏకంగా 1.3 కోట్లు! కుమారస్వామి మాత్రం ఈ ఆరోపణలు చాలా తేలికగా తీసుకుంటున్నారు. ‘నా దగ్గర ఉన్న వస్తువులన్నీ నా కష్టార్జితంతో సంపాదించాను. వాటి గురించి భయపడను’ అంటున్నారు. ఎలా కష్టపడితే అన్ని వస్తువులు వచ్చాయో కూడా జనాలకి చెబితే బాగుండు!

Online Jyotish
Tone Academy
KidsOne Telugu