Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అమిత్ షా పేరులో 'షా' తీసేయాలి.. బీజేపీకి జబర్దస్త్ పంచ్..
posted on: Jan 5, 2022 2:23PM
హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మార్చాలంటూ తెలంగాణ బీజేపీ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోంది. తాజాగా ఏపీలోనూ ఇలాంటి నినాదమే వినిపిస్తోంది. గుంటూరు జిన్నా టవర్ సెంటర్ పేరు మార్చేసి.. అబ్దుల్ కలాం పేరో.. గుర్రం జాషువా పేరో పెట్టాలని ఏపీ బీజేపీ నేతలు రచ్చ మొదలుపెట్టారు. ఇలా ఏ రాష్ట్రంలో చూసినా బీజేపీ రాజకీయాలు మతం, ఓ వర్గం పేర్ల చుట్టూనే తిరుగుతుంటుందని అంటారు. ఎప్పుడూ కమలనాథుల డిమాండ్లేనే.. లేటెస్ట్‌గా వారికే రివర్స్ కౌంటర్లు పడుతున్నాయి. ఢిల్లీలోని పలు ముస్లిం కట్టడాలు, ప్రాంతాల పేర్లను తొలగించమని ముందు మీ మోదీకి చెప్పండి.. ఆ తర్వాత జిన్నా టవర్ సెంటర్ పేరు మార్చండి అంటూ ఏపీ నుంచి అటాక్ మొదలైంది. మరోవైపు, తెలంగాణలోనూ బీజేపీ వాదులకు ఖతర్నాక్ కౌంటర్ పడింది. హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తామని ప్రకటిస్తున్న బీజేపీ నాయకులు, ముందుగా వాళ్ల జాతీయ నాయకుడు అమిత్ షా పేరులోని పార్శీ పదమైన ‘షా’ను తొలగించాలని చరిత్ర అధ్యయనకారుడు కెప్టెన్ పాండురంగారెడ్డి సవాల్ చేయడం సంచలనంగా మారింది.
దక్కన్ హెరిటేజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘హైదరాబాద్ ఫరెవర్.. ట్రూత్ వర్సెస్ మిత్’ సదస్సులో పాండురంగారెడ్డి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇస్లాం రాజుల ద్వారా మనుగడలోకి వచ్చిన షేర్వాణీ, కుర్తా, పైజామాలను బీజేపీ, ఆర్ఎస్‌ఎస్ నాయకులు ధరించకూడదని పాండురంగారెడ్డి ఎద్దేవా చేశారు. మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించిన నగరానికి మొదటి నుంచి హైదరాబాద్ అనే ఒక్క పేరే ఉందని చెప్పారు. భాగమతి ప్రేమ కథ.. కట్టు కథ అనడానికి ప్రఖ్యాత చరిత్రకారుడు హరూన్ ఖాన్ షెర్వాణీ రచించిన ‘హిస్టరీ ఆఫ్ మిడీవల్ దక్కన్’ పుస్తకం ఒక ప్రధాన సాక్ష్యమని చెప్పారు. కుతుబ్‌షాహీల నాణేలలోనూ ఎక్కడా భాగ్యనగర్ పేరు కనిపించదని తెలిపారు.
మహమ్మద్ కులీ రాసిన ‘కుల్లీయత్’ కవిత్వంలో తన పదిహేడు మంది భార్యల గురించి రాశాడని, అందులో ఎక్కడా భాగమతి పేరు కనిపించదని తెలిపారు. కుతుబ్‌షాహీల ఆస్థాన కవి సారంగు తమ్మయ్య రాసిన ‘వైజయంతి విలాసం’, భక్త రామదాసు రచనల్లోనూ భాగ్యనగర్ పేరు ప్రస్తావన ఉండదని చెప్పారు.
నగరాన్ని అభివృద్ధి చేస్తామనడానికి బదులు.. పేర్లు మారుస్తామంటూ బీజేపీ మాట్లాడటం సరికాదని పాండురంగారెడ్డి విమర్శించారు. మహమ్మద్ కులీ నిర్మించిన హైదరాబాద్ నగరానికి భాగ్యనగర్ పేరు పెడతామనడం అన్యాయమన్నారు. మహమ్మద్ కులీ.. భాగమతి అనే మహిళను ప్రేమించి, పెళ్లాడాడని రాసిన పౌజీ, నిజాముద్దీన్, ఫెరిస్తాలు ఎన్నడూ నగరాన్ని సందర్శించలేదనడానికి చారిత్రక ఆధారాలున్నాయని సీనియర్ జర్నలిస్టు కింగ్‌షుక్ నాగ్ సైతం ఆ వాదనకు మద్దతు పలికారు.


.webp)



