కాంగ్రెస్ ను బతికించుకునేదెలా? RSS తరహా ప్లాన్ కు సోనియా చర్చలు

 

వరుసగా రెండు ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిని డీలాపడిన కాంగ్రెస్ కు పునరుజ్జీవం తెచ్చేందుకు సోనియాగాంధీ ప్రయత్నిస్తున్నారు. జవజీవాలు కోల్పోయిన కాంగ్రెస్ పార్టీలో కొత్త జవసత్వాలు నింపేందుకు ఆపరేషన్ మొదలుపెట్టారు. ముఖ్యంగా మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవడంతో దెబ్బతిన్న కాంగ్రెస్ పరపతిని పెంచేందుకు సోనియా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులను సమాయత్తం చేసేందుకు పూనుకున్న సోనియా... ఏఐసీసీ జనరల్ సెక్రటరీలు, సీఎల్పీ లీడర్లు, పీసీసీ చీఫ్ లతో వార్ రూమ్ చర్చలు జరుపుతున్నారు. పార్టీ బలోపేతం కోసం ఏం చేస్తే బాగుంటుందంటూ అభిప్రాయాలు సేకరిస్తున్నారు. 

అయితే, కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం తీసుకొచ్చేందుకు సోనియా సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆర్ఎస్ఎస్ తరహా మోడల్ అనుసరించాలని భావిస్తున్నారట. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మాదిరిగా ప్రేరక్ లను నియమించాలని సోనియా థింక్ చేస్తున్నారని అంటున్నారు. ప్రజలకు చేరువయ్యేందుకు సోషల్ మీడియా ఒక్కటే సరిపోదని... ప్రజాసమస్యలపై స్పందిస్తూ నేరుగా ప్రజలతో అనుసంధానం కావాలని, అప్పుడే పార్టీ మళ్లీ పుంజుకుంటుందనే అంచనాకొచ్చిన సోనియా.... ఆర్ఎస్ఎస్ మాదిరిగా ప్రేరక్ లను నియమించాలని డిసైడయ్యారట. 

అతిత్వరలోనే మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో, ప్రస్తుత పరిస్థితులు కాంగ్రెస్ కు పెనుసవాలుగా మారాయి. అయితే, వాటన్నింటినీ అధిగమించి, కాంగ్రెస్ ను మళ్లీ రేసులో నిలిపేందుకు సోనియా సవాలుగా తీసుకున్నారట. మరి సోనియా ప్రయత్నాలు ఎంతమేర ఫలిస్తాయో.... కాంగ్రెస్ కు మళ్లీ పూర్వ వైభవం వస్తుందో రాదో... మూడు రాష్ట్రాల ఎన్నికల తర్వాత తేలిపోనుంది.