దోచుకో..దాచుకో అన్నది కాంగ్రెస్‌ నీతి: బాలయ్య

 

 

 

 

'బతుకు, బతికించు.. పది మందిని బతికించుకోవడానికి అవసరమైతే త్యాగాలకు సిద్ధం కావాలన్నది టిడిపి సిద్ధాంతమైతే, 'దోచుకో, దాచుకో...అవసరమైతే పది మందిని చంపించు' అన్నది నేటి కాంగ్రెస్‌పాలకుల నీతి అని సినీహీరో, టీడీపీ నాయకుడు నందమూరి బాలకృష్ణ ధ్వజమెత్తారు. విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలోని అంకంపేట, కందిపూడి, రాజగోపాలపురం, కుమారపురం గ్రామాల్లో ఎన్టీఆర్ విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు. పేద ప్రజలను ఆదుకోవడానికి టీడీపీ పుట్టిందన్నారు. అలాంటి పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి కార్యకర్తలు, నేతలు శ్రమించాలని పిలుపునిచ్చారు. జాబ్ రావాలన్నా, బతుకు బాగుండాలన్నా బాబు గెలవాలని అన్నారు. తాను ఎన్నికల్లో ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని, ఈ విషయంలో తుది నిర్ణయం అధిష్ఠానానిదేనని బాలకృష్ణ స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా తుని రూరల్ మండలంలోని లోవ తలుపులమ్మ అమ్మవారిని ఆయన శనివారం దర్శించుకున్నారు.