తెలంగాణా సాధనలో తెరాసది కేవలం ప్రేక్షక పాత్ర మాత్రమే: కాంగ్రెస్

 

తెలంగాణా సాధనలో తెరాసది కేవలం ప్రేక్షక పాత్ర మాత్రమే: కాంగ్రెస్ తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుతో ఎన్నికలలో అవలీలగా విజయం సాధించవచ్చని ఆశపడిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తెలంగాణాతో బాటు ఆంధ్రాలో కూడా ఓడిపోవడంతో రెంటికీ చెడిన రేవడిలా తయారయింది. అందువల్ల పార్టీ కొద్దిగా బలంగా ఉన్న తెలంగాణాలో ముందుగా పార్టీని బలోపేతం చేసుకొనే ప్రయత్నంలో నిన్న కాంగ్రెస్ నేతలు అందరూ హైదరాబాదులో సమావేశమయ్యారు. గమ్మతయిన విషయం ఏమిటంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఈ దుర్గతి పట్టడానికి ప్రధాన కారకుడయిన దిగ్విజయ్ సింగ్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించడం. ఇక ఈ సమావేశంలో ఆయనతో సహా కాంగ్రెస్ నేతలందరూ చెప్పిన విషయాలు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ తెరాస అధ్యక్షుడు కేసీఆర్ తెలంగాణా కోసం పోరాటాలు మొదలుపెట్టక ముందు నుండే కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు కట్టుబడి ఉందని అన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ తన మాట నిలబెట్టుకొంటూ తెలంగాణా ఇచ్చిందని అన్నారు. ఈ విషయాన్ని ప్రజలకు అర్ధమయ్యేలా వివరించాల్సి ఉందని ఆయన అన్నారు.

 

మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణా సాధనలో తెరాసది కేవలం ప్రేక్షక పాత్ర మాత్రమేనన్నారు. వారి మాటలే నిజమనుకొంటే తెరాస ఉద్యమించక ముందే తెలంగాణా ఎందుకు ఏర్పాటు చేయలేదు? తెరాస నేతృత్వంలో ఏకధాటిగా పదేళ్ళపాటు జరిగిన తెలంగాణా ఉద్యమాల మాటేమిటి? ఒకవేళ తెరాస ఉద్యమించకుండా ఉంటే, కాంగ్రెస్ ఎన్నడయినా తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు గురించి ఆలోచన అయినా చేసేదా? తెరాస చేసిన ప్రజా ఉద్యమాల కారణంగానే కాంగ్రెస్ తెలంగాణా ఏర్పాటు చేయవలసి వచ్చిందని అందరికీ తెలుసు. కానీ, కాంగ్రెస్ అధిష్టానం ఆ ప్రయోజనం కేవలం తనకే దక్కాలనే దురాశకు పోయి, అతి తెలివితేటలు ప్రదర్శించుతూ ఆఖరినిమిషంలో తెరాసను పక్కన బెట్టి, టీ-కాంగ్రెస్ నేతలను ముందుకు తీసుకువచ్చి కేవలం వారి ఒత్తిడి కారణంగానే తెలంగాణా ఇస్తున్నట్లు నాటకం ఆడింది. కానీ వారు ఆ నాటకాన్ని సరిగ్గా రక్తి కట్టించలేక చతికిలపడటంతో తెలంగాణా ప్రజలు ఆ నాటకానికి ఊహించని ముగింపు ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి తగిన విధంగా గుణపాఠం నేర్పారు. కానీ కాంగ్రెస్ నేటికీ ఆ గుణపాఠం నేర్చుకోలేదని కాంగ్రెస్ నేతల ప్రసంగాలతో స్పష్టమవుతోంది.