రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ మూడు ముక్కలాట

 

గత పదేళ్లుగా రాష్ట్రం తెలంగాణా అగ్నిగుండంపై కూర్చొని ఉన్నపటికీ ఇంతవరకు తెలంగాణా సమస్యను కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించలేకపోయింది. అయితే, సాధారణ ఎన్నికలు తరుముకోస్తుండటంతో, స్వపక్షంలోనే ఒక విపక్షం తయారవడంతో విధిలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు ఈ సమస్యకి ఏదోరకంగా ముగింపు పలకాలని ప్రయత్నిస్తోంది. అయితే, ఈ సమస్య పరిష్కారంపై చిత్తశుద్దికంటే, దానిని ఏవిధంగా పరిష్కరిస్తే తనకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుందో అనే కోణంలోంచి మాత్రమే కాంగ్రెస్ ఆలోచనలు సాగుతున్నట్లు, డిల్లీ నుండి మీడియాకి లీకవుతున్న వార్తలు తెలియజేస్తున్నాయి.

 

తెలంగాణా రాష్ట్ర ప్రకటన చేస్తే, దానివల్ల కాంగ్రెస్ కంటే తెరాసయే ఎక్కువ లాభపడుతుందని గ్రహించిన కాంగ్రెస్ అధిష్టానం, తెరాసను కాంగ్రెస్ పార్టీలో కలిపేయడం గురించి కేశవ్ రావుద్వారా తెరాస అధినేతతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అందుకు ఆయన అంగీకరించకపోవడంతో, మరి ఆయనను లొంగదీసేందుకో లేక మరికొంత కాలక్షేపం చేసేందుకో తెలియదు గానీ, కర్నూలు, అనంతపురం జిల్లాలను కలిపి రాయల తెలంగాణా ఏర్పాటు చేస్తే ఎలాగుంటుంది? అనే ఒక కొత్త ఆలోచనను తాజాగా మీడియాకు లీక్ చేసింది.

 

ఊహించినట్లే, అటు తెలంగాణా నేతల నుండి, ఇటు రాయలసీమ నేతల నుండి కూడా వ్యతిరేఖత ఎదురయింది. ఒక సమస్యను పరిష్కరించడానికి బదులుగా మరొక కొత్త సమస్యను కాంగ్రెస్ సృష్టించాలను కొంటున్నదా? అని ప్రత్యేక రాయలసీమ కోసం పోరాడుతున్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. అదేవిధంగా రాష్ట్రం నుండి విడిపోవాలని కోరుకొంటూ ఉద్యమాలు చేస్తుంటే, మళ్ళీ జిల్లాలు కలిపేఆలోచనలు ఎందుకు చేస్తున్నారు అనే తెరాస నేతల ప్రశ్నలకు కాంగ్రెస్ వద్ద సరయిన సమాధానం లేదు.

 

రాష్ట్రంలో ప్రజలను కానీ, ప్రతిపక్షాలను గానీ కాంగ్రెస్ అధిష్టానం లెక్కలోకి తీసుకోకపోయినా, కనీసం స్వంత పార్టీ నేతలనయినా విస్వశించవచ్చు కదా? అనేది సామాన్య ప్రజలకు కలిగే ధర్మ సందేహం. తన మూడు ప్రాంతల నేతలతో కలిసి చర్చించి, తను కోరుకొంటున్నట్లే తన పార్టీకి మేలు చేకూర్చే నిర్ణయమే ఎందుకు తీసుకోలేకపోతోంది? అనేది సామాన్యులను వేధిస్తున్నప్రశ్న.

 

ముందుగా పార్టీలో నేతల మధ్య సామరస్య ధోరణి, పార్టీని రక్షించుకోవాలనే తపన సాధించకుండా, కాంగ్రెస్ ఎన్ని ఎత్తులు, జిత్తులు వేసినా అది దానికే నష్టం కలిగించక మానదు. అయితే అనుభవం అయితే తప్ప తత్వం భోధపడదని ఊరికే అనలేదు పెద్దలు. కాంగ్రెస్ పార్టీకి కూడా రానున్న ఎన్నికలలో తప్పకుండా ప్రజలే ఈ తత్వం భోదపరుస్తారు.