కాంగ్రెస్‌ నేతలే వారి కొంప ముంచారా!


 

గ్రేటర్‌ ఎన్నికలలో తాము అద్భుతాలని సృష్టిస్తామని కాంగ్రెస్‌లో ఎవరికీ ఆశ లేని మాట వాస్తవమే! కానీ, ఓ పదిహేను సీట్లన్నా దక్కించుకుందామని అనుకున్నారు. అదృష్టం మరీ బాగుంటే మూడో స్థానాన్ని కూడా చేరుకుంటామని ఆశించారు. కానీ ఆది నుంచి తుది దాకా కాంగ్రెస్‌కి ఏదో ఒక రూపంలో ఎదురుదెబ్బ తగులుతూనే ఉంది. ఒక పక్క ఎన్నికల నగారా మోగుతుంటే మరో పక్క అసలు పార్టీలో ఎవరు ఉంటారో, ఎవరు తూచ్‌ అంటారో తెలియని పరిస్థితి. దానం నాగేందర్‌ వంటి కీలక నేతలు పార్టీలో ఉంటున్నట్లా తెరాసలో చేరుతున్నట్లా అన్న అయోమయంలో కార్యకర్తలు ఉండిపోయారు.

 

ఇక అభ్యర్థులుగా ఎవరిని నిర్ణియించాలన్న విషయంలో కూడా అగ్రనేతలు కావల్సినంత అలసత్వాన్ని ప్రదర్శించారు. బీ.ఫారాలు ఎవరికి ఇవ్వాలి? ఇస్తే మిగతా ఆశావహులని ఎలా బుజ్జగించాలి?... అన్న సందిగ్ధంలో పుణ్యకాలం కాస్తా పుచ్చిపోయింది. టికెట్లు దక్కని ఆశావహులని తృప్తి పరిచేందుకు నేతలు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు సరికదా, గాంధిభవన్‌కు తాళాలు వేసుకుని అంతా అదృశ్యమైపోయారు! ఇక ప్రచారం కూడా అంతంత మాత్రంగానే సాగింది. ఉద్దేశ్యం ఏమైనా కానీ… తెలంగాణ అప్పటికప్పుడు వచ్చేందుకు కారణం కాంగ్రెసే! అయినా ఆ విషయాన్ని ప్రజలకి తెలియచేయడంలో కాంగ్రెస్‌ నాయకత్వం విఫలమైంది. ఒకవైపు తెరాస నాయకులు, కార్యకర్తలు, అభ్యర్థులు అందరూ కలిసి కట్టుగా ఒక్క జట్టుగా ప్రచారంలో దూసుకుపోతుంటే… కాంగ్రెస్‌ మాత్రం ప్రచారంలో వెనుకబడిపోయింది. ఎవరో కొద్దిమంది అగ్రనాయకులు తప్ప వేరెవ్వరూ దూకుడుగా ప్రచారాన్ని సాగించలేకపోయారు. అంతగా ప్రజాకర్షణ లేని దిగ్విజయ్‌ సింగ్‌ వంటి నేతలు ప్రచారానికి వచ్చినా వారి వల్ల పెద్దగా లాభం లేకపోయింది. ఎన్నికల సమయంలో రాహుల్‌ గాంధి రెండుసార్లు హైదరాబాదుకి వచ్చినప్పటికీ… ప్రచారానికి దూరంగానే ఉండిపోయారు.

 

ఎన్నికల ప్రచారం మంచి వేడిలో ఉండగా జానారెడ్డి చేసిన పని, ఆ పార్టీని విజయాలను మరింత దెబ్బ తీసింది. ఒక పక్క సాటి నేతలంతా ప్రభుత్వాన్ని ఎండగడుతుంటే… పనిగట్టుకుని మరీ ప్రభుత్వం అందిస్తున్న 5 రూపాయల భోజనం భలే ఉందంటూ కితాబునిచ్చారు. ఇలాంటి కీలక సమయంలో జానారెడ్డి చేసిన వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏమిటో ఆయనకే తెలియాలి. ఈ మాటలు ప్రతిపక్షాల విజయానికి గొప్ప బలాన్నిచ్చాయని ఆయన సహచరులే సణుక్కున్నారు. ఫలితం! 2009లో 52 సీట్లను గెలుచుకుని మేయర్ పదవిని సైతం సాధించిన కాంగ్రెస్‌, ఇప్పుడు 2 స్థానాలకే పరిమితమైంది. ఆ పార్టీ మేయర్ బండ కార్తీకరెడ్డి సైతం ఓటమి పాలయ్యారు. మరి ఈ పరాజయం గురించి కాంగ్రెస్‌ పెద్దాయన జానారెడ్డి ఎలా స్పందిస్తారో!