రేవంత్ రెడ్డి అరెస్ట్.. కాంగ్రెస్ నేతలు ఫైర్

 

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా రేవంత్ రెడ్డి అరెస్ట్ పై కాంగ్రెస్ నేతలు స్పందించారు. రేవంత్ రెడ్డి అరెస్ట్‌ అప్రజాస్వామికమని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అర్థరాత్రి రేవంత్ రెడ్డి ఇంటిపై దాడి చేసి అరెస్ట్‌ చేశారని, టీఆర్‌ఎస్‌ అరాచక పాలనకు ఇది పరాకాష్ట అని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందన్నారు. ఎన్నికల సంఘం, పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఉత్తమ్ విమర్శించారు. ఓ పార్టీ ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న ఎన్నికల సంఘం.. కాంగ్రెస్‌ ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పెద్దఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని..కాంగ్రెస్‌ విజయం ఖాయమని ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

రేవంత్‌రెడ్డి అరెస్ట్‌ అప్రజాస్వామికమని, దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి డి.కె.అరుణ చెప్పారు. టీఆర్‌ఎస్‌ నేతలకు ఓటమి భయం పట్టుకుందన్నారు. కొడంగల్‌లో ఎన్నికల కమిషన్‌ చోద్యం చూస్తోందని..  టీఆర్‌ఎస్‌ నేతలకు అనుగుణంగా అధికారులు, పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఎవరైనా ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారని దుయ్యబట్టారు.  టీఆర్‌ఎస్‌ నేతల తీరును ప్రజలు హర్షించరని చెప్పారు. ఇలాంటి పాలనను తెలంగాణ బిడ్డలు కోరుకోరని, ఈ ఎన్నికల్లో  టీఆర్‌ఎస్‌ కు బుద్ధి చెబుతారన్నారు.

రేవంత్‌రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికమని కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. ప్రజస్వామ్యంలో ఉన్నామా? లేక నియంత పాలనలో ఉన్నామా? అని ప్రశ్నించారు. తలుపులు పగులకొట్టి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని ఆయన నిలదీశారు. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని తెలిపారు. కేసీఆర్‌ వ్యవరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని, కేసీఆర్‌కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ కుమ్మక్కయ్యాయని పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు.

టీఆర్ఎస్‌కు ఈసీ ఏజెంట్‌గా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేత మధుయాష్కి ఆరోపించారు. రేవంత్‌రెడ్డిని అర్ధరాత్రి అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. ఈసీ పక్షపాతంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. టీఆర్‌ఎస్‌, బీజేపీతో ఈసీ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ ఓటమి ఖాయమని అన్ని సర్వేలు చెబుతున్నాయన్నారు. కేసీఆర్‌ ద్వారా లబ్ధిపొందిన అధికారులే ఇదంతా చేస్తున్నారని మధుయాష్కి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

రేవంత్ రెడ్డి అరెస్ట్ పై సీపీఐ నేత నారాయణ కూడా స్పందించారు. రేవంత్‌‌రెడ్డి అరెస్ట్ ముమ్మాటికి కక్ష సాధింపు చర్యే అని నారాయణ అన్నారు. కేసీఆర్‌ ఓటమి భయంతోనే అరెస్టులు చేయిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ పాలన నిజాం పాలనను తలపిస్తోందని నారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డిని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల తర్వాత మోదీ ఆరెస్సెస్ క్యాంపునకు, కేసీఆర్ ఫాంహౌస్‌కు వెళ్లడం ఖాయమన్నారు. కేసీఆర్ నియంత పాలనకు చరమగీతం పాడాలని సీపీఐ నారాయణ పిలుపునిచ్చారు.

రేవంత్‌రెడ్డి అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామని వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు.  రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు. అన్ని వ్యవస్థలను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలు ఉండొద్దని కేసీఆర్ భావిస్తున్నారని ఆయన అన్నారు. కళ్లకు పొరలు వచ్చి కండకావరంతో మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. కేసీఆర్ డబ్బు మదంతో గూండాయిజం చేస్తున్నారని వంటేరు వ్యాఖ్యానించారు.