Latest News
కాంగ్రెస్‌కు మరో పరీక్ష!.. చేతికి గాయాలు...
posted on: Apr 29, 2022 5:52PM
అసెంబ్లీ ఎన్నికలకు ముందు, పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో తలెత్తిన అంతర్గత సంక్షోభం ఫలితంగా, కాంగ్రెస్ పార్టీ ఒక కీలక రాష్ట్రాన్ని చేజార్చుకుంది. అప్పటి ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర సింగ్, పార్టీ సీనియర్ నాయకుకు, మాజీ మంత్రి నవజ్యోతి సింగ్ సిద్దూ మధ్యతలెత్తిన విబేధాలు, చిలికి చిలికి గాలివానగా మారి పార్టీ ప్రతిష్టను పడగొట్టింది. చివరకు సిద్దూ కోరిన విధంగా ముఖ్యమంత్రిని మార్చినా, సిద్దూకే పీసీసీ పగ్గాలు అప్పగించినా, ఎన్నికలో హస్తం పార్టీకి ఓటమి తప్పలేదు.
ఇప్పుడు రాజస్థాన్’లో మళ్ళీ అదే పరిస్థితి పునరావృతం అవుతోందా? అంటే అవుననే అంటున్నారు, విశ్లేషకులు. నిజానికి, విశ్లేషకులు అనడం కాదు, మూడున్నరేళ్ళుగా అడపా తడ్ఫపా అసమ్మతి రాగం వినిపిస్తున్న, కేంద్ర మాజీ మంత్రి, మాజీ పీసీసీ చీఫ్ సచిన్ పైలట్’ కూడా అధిష్టానానికి అదే హెచ్చరిక చేస్తున్నారు. తక్షణమే రాజస్థాన్ ముఖ్యమంత్రి పగ్గాలు తనకు అప్పగించాలని లేదంటే రాజస్థాన్’లోనూ పంజాబ్ పరాజయం, పరాభవం తప్పవని నేరుగా పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకే లేఖ రాసినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. నిజానికి, చాలా కాలంగా సచిన్ పైలట్’ అధిష్టానంపై ఆగ్రహంతో రగిలి పోతున్నారు.గత అసెంబ్లీ ఎన్నికల్లో పీసీసీ చీఫ్’గా పగలు రాత్రి కష్టపడి పార్టీని తాను గెలిపిస్తే, ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రి పదవి అశోక్ గేహ్లోట్’కు కట్ట బెట్టారని, ఆయన అనేక సందర్భాలో బహిరంగంగానే తమ ఆవేదన, ఆగ్రహం వ్యక్త పరిచారు. ఒక దశలో ఆయన తమ వర్గం ఎమ్మెల్ల్యేలతో ఢిల్లీలో మకాం చేసి తాడో పేడో తేల్చుకుంటానని ప్రకటించారు. అలాగే, ఒక దశలో ఆయన బీజేపీలో చేరుతున్నారనే పుకార్లు వినవచ్చాయి. అయితే పైలెట్’ పార్టీని వదలలేదు కానీ, ముఖ్యమంత్రి పీఠం కోసం పోరాటం మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు.
ఇదే క్రమంలో ఇప్పుడు, అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో, అధిష్టానంపై పైలెట్ వత్తిడి పెంచుతున్నారు. రాజస్థాన్‌లో ఎన్నికలకు పట్టుమని 18 నెలల సమయం మాత్రమే వుంది. ఈ పరిస్థితుల్లో పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే, పంజాబ్’లో చేసిన తప్పు రాజస్థాన్’ లో చేయద్దని, ఎటువంటి జ్యాప్యం లేకుండా తనను ముఖ్యమంత్రిని చేయాలని, సచిన్ పైలట్ అధిష్ఠానానికి వరసగా వర్తమానం పంపుతున్నట్లు తెలుస్తోంది. ప్రతి నిత్యం అటు సోనియా, ఇటు రాహుల్, ప్రియాంకలకు సచిన్ పైలెట్ ఏదో ఒక రూపంలో తమ డిమాండ్’ను గుర్తు చేస్తున్నారు. పంజాబ్’లో చివరి రోజుల్లో చరణ్‌జిత్ సింగ్ ఛన్నీని ముఖ్యమంత్రిగా నియమించడం వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని, రాజస్థాన్‌లో కూడా అదే జరిగే అవకాశం ఉందని సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలకు సచిన్ పైలట్ సూచించినట్టు సమాచారం.
కానీ, కాంగ్రెస్‌లో అత్యంత సీనియర్ నాయకుడైన అశోక్ గెహ్లాట్ తానేంటో ఇప్పటికే నిరూపించుకున్నారు.పైలెట్ పప్పులు తమ వద్ద ఉడకవని ఇప్పటికే అనేక సందర్భాలలో నిరుపించుకున్నారు. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఆయనకు ఉందని నిరుపించుకున్న ఆయన పైలెట్’కు ఎక్కడికక్కడ చెక్ పెడుతూ వచ్చారు. అధిష్ఠానం ఆదేశించినా, పైలెట్ వర్గాన్ని మంత్రి వర్గంలో చేర్చుకునే ముహూర్తాన్ని పలుమార్లు వాయిదా వేసి చివరకు ఏదో అయింది అంటే అయింది అన్నట్లుగా కానిచ్చారు.
మరోవంక పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నమ్మకాన్ని కూడా ఆయన నిలబెట్టుకున్నారు.రెండు రోజుల కిందట ఆయన మీడియాతో మాట్లాడుతూ..నా రాజీనామా ఎప్పుడూ సోనియా గాంధీ వద్దే ఉంటుందని వ్యాఖ్యానించారు. నిజానికి, గేహ్లోట్ పార్టీలో సీనియర్ నాయకుడు మాత్రమే కాదు, సోనియా గాంధి వీరవిధేయుల్లో ఒకరు. ఒక దశలో జీ 23 నాయకులు పట్టుపడితే పార్టీ పగ్గాలు తాత్కాలికంగానే అయినా గేహ్లోట్’కు అప్పగించాలని సోనియా గాంధీ అలోచన చేసినట్లు వార్తలొచ్చాయి. అంటే, గేహ్లోట్ పవర్ ఏమిటో వేరే చెప్పనక్కర లేదు. మరో వంక సచిన్ పైలట్’ తనకు ముఖ్యమంత్రి పదవి తప్ప మరేది వద్దని, అది ఇస్తారో లేదో తేల్చి చెప్పాలని, రాహుల్, ప్రియాంకల వద్ద పట్టుపడుతున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవి ఇస్తామన్నా వద్దన్నారు.రాజస్థాన్ పీసీసీ పగ్గాలు ఇస్తామన్నా అది నాకేమన్నా కొత్తనా, ఐదేళ్లు పీసీసీ అధ్యక్షుడిగా ఉండి, రాజస్థాన్‌లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది నేనని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్ఠానం ఇప్పుదు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, అనేది ఆసక్తికరంగా మారింది.






