కీలకదశకు చేరుకొన్న తెలంగాణా ఎన్నికల ప్రచారం

 

తెలంగాణాలో ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరుకొంది. అన్ని పార్టీలు సరికొత్త వ్యూహాలతో విజయం సాధించాలని విశ్వప్రయత్నం చేస్తున్నాయి. కేసీఆర్ తన దళిత ముఖ్యమంత్రి వాగ్దానం పక్కనబెట్టడంతో, తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు తమ పార్టీ అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పడమే కాకుండా, బీసీ సంఘాలకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఆర్. కృష్ణయ్యను పార్టీలో చేర్చుకొని, ఆయనే తమ తెలంగాణా ముఖ్యమంత్రి అభ్యర్ధి అని ప్రకటించి తెరాసను ఇరకాటంలో పడేసారు.

 

అది చూసి కాంగ్రెస్ తరపున తెలంగాణాలో ప్రచారం చేస్తున్న కేంద్రమంత్రి జైరామ్ రమేష్ తాము దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించి, ఆనక టీ-కాంగ్రెస్ నేతల ఆగ్రహం చవిచూడటంతో ‘తూచ్! యస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ వెనుకబడిన తరగతులలో ఎవరినో ఒకరిని ముఖ్యమంత్రిని చేస్తామని’ సవరణ ప్రకటన చేసారు. నిన్న తెలంగాణాలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన రాహుల్ గాంధీ ఎవరూ ఊహించని విధంగా తమ పార్టీ అధికారంలోకి వస్తే మహిళను ముఖ్యమంత్రిగా చేయాలనుకొంటున్నట్లు ప్రకటించి, ఆ పదవికి పోటీపడుతున్న టీ-కాంగ్రెస్ నేతలందరికీ షాక్ ఇచ్చారు.

 

ఈవిధంగా కాంగ్రెస్, తెదేపాలు తమ ముఖ్యమంత్రి అభ్యర్ధులు ఎవరో ప్రకటించడంతో, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి మాట మార్చిన కేసీఆర్ పై, ఆయన పార్టీపై తీవ్ర ఒత్తిడి ఏర్పడింది. కాంగ్రెస్ వ్యూహంలో భాగంగా రాహుల్ గాంధీ మహిళా ముఖ్యమంత్రి ప్రకటించి, అదే సమయంలో కేసీఆర్ ఇచ్చిన మాటమీద నిలబడే మనిషి కాదని, కాంగ్రెస్ పార్టీని, దళితులను మోసం చేసినట్లుగానే, ఎన్నికలలో గెలిస్తే ఆయన రేపు తెలంగాణా ప్రజలందరినీ కూడా మోసం చేస్తారని రాహుల్ గాంధీ విరుచుకు పడ్డారు.

 

మరో నాలుగు రోజులలో ఎన్నికలు జరుగబోతున్న ఈ కీలక తరుణంలో సీబీఐ కోర్టు తమ ఆస్తులపై విచారణకు ఆదేశించడం, దానికి పై అధికారుల అనుమతి అవసరమంటూ మళ్ళీ సీబీఐ అధికారులే త్రొక్కి పట్టి ఉంచడం అన్నీ కూడా ఈ వ్యూహంలో భాగమేనని కేసీఆర్, హరీష్ రావు తదితరులు ఆరోపిస్తున్నారు. తెరాసలో కేసీఆర్ కుటుంబ సభ్యులు తప్ప మరెవరూ ప్రజలను ఆకట్టుకొనే శక్తి లేకపోవడంతో ఆ లోటు ఇప్పుడు ఎన్నికలలో మరింత స్పష్టంగా కనబడుతోంది. అందుకే కేసీఆర్ ఒక్కరే పార్టీని గెలిపించుకొనేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 

 

కాంగ్రెస్, తెదేపా, బీజేపీలు ప్రదర్శిస్తున్న ఇంతవరకు ప్రచారంలో వెనుకబడి ఉన్న తెదేపా-బీజేపీ కూటమి, మంచి ప్రజాకర్షణ శక్తి, యువతను ఆకట్టుకొనేలా మంచి ప్రేరాణాత్మకంగా ఉపన్యసించగల పవన్ కళ్యాణ్ న్ని ప్రచారానికి తీసుకురావడంతో వారి కూటమి మళ్ళీ బలం పుంజుకొంటోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తెరాస అధినేత కేసీఆర్ మరియు కాంగ్రెస్ అధిష్టానాన్ని లక్ష్యంగా చేసుకొని చేస్తున్న ప్రసంగాలకు తెలంగాణా యువత నుండి మంచి స్పందన వస్తుండటంతో, అది కాంగ్రెస్, తెరాసల విజయావకాశాలను దెబ్బతీసే అవకాశం ఉంది గనుక, అది సహజంగానే ఆ రెండు పార్టీలపై మరింత ఒత్తిడి పెంచుతుంది.

 

ఇక ఎన్నికల ప్రచారం ముగిసేందుకు కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమె మిగిలి ఉండటంతో కాంగ్రెస్, బీజేపీలు తమ అతిరధ, మహారధులను బరిలో దింపి, సరికొత్త వ్యూహాలతో, సరికొత్త హామీలు గుప్పిస్తూ ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేస్తుండటంతో, ఈ ప్రభావం ప్రజలమీద పడి వారి ఓట్లు ఈ మూడు ప్రధాన పార్టీల మధ్య చీలిపోయేట్లు కనిపిస్తోంది. వారు ఏ ఒక్క పార్టీ వైపు పూర్తిగా మొగ్గు చూపే అవకాశం కనబడటం లేదు. అదే జరిగితే తెలంగాణాలో మొట్ట మొదటి ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం అనివార్యమవుతుంది. ఇది కొత్త రాష్ట్రంగా అవతరిస్తున్న తెలంగాణకు ఎంతమాత్రం మంచిది కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.