తిరిగి అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ కుయుక్తులు

 

దేశంపై విరుచుకుపడుతున్న ఉగ్రవాదులను, మావోయిస్టులను అడ్డుకోలేని యుపీయే ప్రభుత్వం అందుకు ఏనాడు సిగ్గుపడలేదు. కనీసం వాటికి పాల్పడిన వారిని పట్టుకోలేకపోతోంది. అందుకు కూడా అది ఏనాడు సిగ్గుపడలేదు. అయితే, దీనికంతటి మూల కారణం గుజరాత్ రాష్ట్రంలో జరిగిన గోద్రా అల్లర్లేనని, ఆ తరువాతనే ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ పుట్టిందని, ఈవిషయాన్ని జాతీయ దర్యాప్తు సంస్థ దాఖలుచేసిన అభియోగపత్రం కూడా ధృవీకరించిందని, అందువల్ల ఇప్పటికయినా బీజేపీ, ఆర్.యస్.యస్. సంస్థలు తమ మతోన్మాద చర్యలను మానుకోవాలని సీనియర్ కాంగ్రెస్ నేత షకీల్ అహ్మద్ గారు శలవిచ్చారు. అందుకు బీజీపీ కూడా ఘాటుగానే స్పందిస్తుందని వేరే చెప్పనవసరం లేదు. కానీ, ఇటువంటి అంశాలను కూడా రాజకీయం చేయడం సబబేనా?

 

దేశరక్షణ విషయంలో కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే బాధ్యత ఉందని, మిగిలిన పార్టీలకి ఆ పార్టీ అంత దేశభక్తి లేదని, అందువల్ల మిగిలిన వారందరూ సంఘవిద్రోహక శక్తులేనన్నట్లు మాట్లాడటం అవివేకం. ఇదివరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉక్కు శాఖామంత్రి బేణీ ప్రసాద్ వర్మ తన రాజకీయ ప్రత్యర్ధి అయిన ములాయం సింగ్ ఉగ్రవాదులతో, నేరస్తులతో నేరుగా సంబంధాలు కలిగి ఉన్నడని తీవ్ర ఆరోపణలు చేసారు. అంటే కాంగ్రెస్ నేతలకి ప్రత్యర్ధిగా ఉండిఉంటే వారందరూ దుష్టుల క్రింద లెక్కగట్టబడతారన్నమాట.

 

మరి బేణీ ప్రసాద్ అంత తీవ్ర ఆరోపణలు చేసినప్పటికీ యుపీయే ప్రభుత్వం వెంటనే ములాయం సింగ్ పై ఎందుకు విచారణకు ఆదేశించలేదు? ఎందుకంటే, అయన తమ ప్రభుత్వానికి బయటి నుండి మద్దతు ఇస్తున్న సమాజ్ వాడి పార్టీ అధినేత గనుక. అంటే, బేణీ ప్రసాద్ ఆరోపణలు నిజమని నమ్మితే, కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ఉగ్రవాదుల ముఠాలతో సంబంధాలు ఉన్నవ్యక్తి నుండి మద్దతు తీసుకొంటోందని భావించవలసి ఉంటుంది. మరటువంటప్పుడు కాంగ్రెస్ ని ఏమని నిందించాలి?


గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని బీజేపీ తన ప్రధాని అభ్యర్ధిగా ఇంకా ప్రకటించకపోయినప్పటికీ, ఆయనే ప్రధాని అభ్యర్ధిగా దాదాపు ఖాయం అయిపోవడంతో బెంగ పెట్టుకొన్నకాంగ్రెస్ పార్టీ, నాటి నుండి మోడీని, బీజేపీని లక్ష్యంగా చేసుకొని యుద్ధం మొదలుపెట్టింది.

 

తద్వారా కాంగ్రెస్ తన తప్పులను కప్పిపుచ్చుకోగలగడమే కాకుండా, వాటి నుండి ప్రత్యర్ధుల దృష్టి మళ్ళిస్తూ వారు ఎప్పుడూ కూడా తను చేస్తున్న ఆరోపణలకు సంజాయిషీలు చెప్పుకొనే పరిస్థితిలోనే ఉండేలా చేస్తూ రాజకీయంగా పైచేయి సాధించాలని ఇటువంటి ఎత్తులు వేస్తుంటుంది. కాంగ్రెస్ తనకు ఏకైక ప్రత్యామ్నాయంగా ఉన్న బీజేపీని రాజకీయంగా దెబ్బ తీయాలనే దురాలోచనతో ఇటువంటి ఎత్తులు వేస్తోంది.