కాంగ్రెస్ నేతలు ప్రజలను ఏమార్చడానికే తిట్టుకొంటున్నారా?

 

తెలంగాణా, రాష్ట్ర విభజన అంశాల మీద రోజుకొక వార్తని మీడియాకి లీక్ చేయడం మళ్ళీ దానిని ఆ మరునాడు ఖండించడం, లేకుంటే రోజుకొక వ్యాఖ్య చేయడం దానిని పట్టుకొని అటు మీడియాలో తీవ్రంగా చర్చలు, ఇటు కాంగ్రెస్ నేతలు మాటలు రువ్వుకోవడం, గత రెండు మూడేళ్ళుగా కాంగ్రెస్ పార్టీ చాలా తెలివిగా ఈ తంతు నడిపిస్తూ రోజులు దొర్లించేస్తోంది.

 

త్వరలో రాష్ట్ర విభజన అంశంపై ఖచ్చితమయిన నిర్ణయం ప్రకటిస్తానని దిగ్విజయ్ సింగ్ చెప్పినప్పుడు, రెండు ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ నేతలను నియంత్రించి ఉండాలి. కానీ, చేయలేదు. వారు రెండు గ్రూపులుగా విడిపోయి బద్ధ శత్రువులవలే కత్తులు దూసుకొంటూ పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తుంటే, కాంగ్రెస్ అధిష్టానం చోద్యం చూస్తోంది. అసలు ఇదంతా ప్రజలను, ప్రతిపక్షాలను ఏమార్చడానికి కాంగ్రెస్ ఆడుతున్ననాటకంలో భాగమేనేమో అనే అనుమానం కూడా కలుగుతుంది. ఇక్కడ కాంగ్రెస్ నేతలు కీచులడుకొంటూ ప్రజల దృష్టిని మళ్ళిస్తుంటే, అక్కడ డిల్లీ పెద్దలు రకరకాల వ్యాక్యాలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారేమోనని అనుమానం కలుగుతుంది.

 

ఇక నేడో రేపో తెలంగాణా అంశాన్ని తేల్చేస్తామని ఒక పక్క చెపుతూనే, ‘తెలంగాణా ప్యాకేజి’, ‘రాయల తెలంగాణా’ వంటి లీకులు ఎందుకు చేస్తున్నారో కాంగ్రెస్ పెద్దలకే తెలియాలి. ఈ రోజు దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ “హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించే ఆలోచన ఏమీ లేదని, మీడియాలో వస్తున్న వార్తలు కేవలం ఊహాజనిత వార్తలేనని” చెప్పడం చూస్తే, ఆయన మళ్ళీ మరో కొత్త చర్చకు అవసరమయిన ముడిసరుకు అందజేస్తునట్లు భావించాలి. ఆయన ఆవిధంగా అన్నారు గనుక, ‘బహుశః హైదరాబాదుతో కూడిన తెలంగాణా ఏర్పాటు చేయవచ్చునేమో’, లేకపోతే ‘హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా ఉంచి రాష్ట్ర విభజన చేయవచ్చునేమో’, లేకపోతే ‘అసలు రాష్ట్ర విభజన చేసే ఆలోచన లేనందునే ఆయన ఆవిధంగా అన్నారేమో’ అంటూ ఆయన తాజా వ్యాఖ్యలపై అనేక కోణాలలో చర్చలు మొదలవుతాయి.

 

అదే అంశం పట్టుకొని రేపటి నుండి ఉభయ ప్రాంతాలకి చెందిన కాంగ్రెస్ కూడా ఎవరికి అనుకూలమయిన వాదనలు వినిపించవచ్చును. అసలు ఒక సమస్యని పరిష్కరించడానికి కాంగ్రెస్ పార్టీకి ఇంతకంటే మంచి పద్ధతి లేదా? లేక ఈ సమస్యను మరింత కాలం సాగదీసేందుకు కోరుండే ఈ విధంగా ప్రవర్తిస్తోందా? అత్యంత సున్నితమయిన అంశాన్ని పరిష్కరించడంలో కాంగ్రెస్ పార్టీ చాలా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం వలననే సమస్య ఇంతవరకు వచ్చింది. కనీసం ఇప్పటికయినా ఆ పార్టీ మేల్కొందా అంటే లేదనే అనిపిస్తోంది.