కాంగ్రెస్-తెదేపా పాలన బేరీజుకే శ్వేతపత్రాలు

 

 

గత పదేళ్లుగా రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తున్నట్లు ప్రజలను మభ్యపెడుతూ రోజులు దొర్లించేసింది. కాంగ్రెస్ చెప్పుకొన్నట్లు ఒకవేళ అన్ని రంగాలలో రాష్ట్రం అభివృద్ధి పదంలో సాగి ఉంటే రాష్ట్ర విభజన జరిగి ఉండేదే కాదేమో. ప్రజలనెత్తిన ఇంత ఆర్దికభారం పడి ఉండేది కాదు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాభివృద్ధికి చేసిందేమీ లేదు. కానీ అభివృద్ధి పేరిట నేతలు, కాంట్రాక్టర్లు కలిసి ప్రజాధనాన్ని ఏవిధంగా భోం చేసారో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరుసపెట్టి విడుదలచేస్తున్న శ్వేతపత్రాల ద్వారా కళ్ళకు కట్టినట్లు చూపుతున్నారు.

 

నేటికీ చాలా మంది ప్రజలలో స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి హయంలో గణనీయమయిన అభివృద్ధి జరిగిందనే బలమయిన అభిప్రాయం ఉంది. ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి కూడా రాజన్న రాజ్యం ఓ స్వర్ణయుగమనట్లు ప్రచారం చేసుకొని ఎన్నికలలో గెలవాలని చూసారు. నిజంగా అది స్వర్ణయుగమే అయితే, ఆయన తరువాత అధికారం చేప్పట్టిన రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల సమయానికే దాని ప్రభావం ఎందుకు కనిపించకుండా పోయింది? అప్పటి నుండే కరెంటు కష్టాలు, ప్రజలపై అదనపు విద్యుత్ చార్జీల భారం, వ్యవసాయం కోసం రైతులు అప్పులపాలవడం ఎందుకు మొదలయింది? వేలకోట్ల ప్రజాధనం వెచ్చించి మొదలుపెట్టిన ప్రాజెక్టులు నేటికీ ఎందుకు పూర్తవలేదు? వంటి అనేక ప్రశ్నలకు ఈ శ్వేతపత్రాలు వివరణ ఇస్తున్నాయి.

 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీటిపారుదల శాఖపై నిన్న విడుదల చేసిన శ్వేతపత్రంలో జలయజ్ఞం పేరిట ప్రజాధనం ఏవిధంగా దోచుకోబడిందో వివరించారు. ప్రాజెక్టులపై వేల కోట్లు ఖర్చయినప్పటికీ వాటి వలన ఒక్క ఎకరానికీ నీళ్ళు అందలేదు. కానీ ‘రాజుల సొమ్ము రాళ్ళ పాలన్నట్లు...ఆయన మొదలు పెట్టిన జలయజ్ఞం వల్ల ప్రజల సొమ్ము రాజకీయ నేతలు, కాంట్రాక్టర్ల పాలయిందని మాత్రం స్పష్టమయింది.

 

రాజశేఖర్ రెడ్డి హయంలో నేతలు, కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూర్చేందుకు నీటి అవసరాలు, నీటి ఉపలబ్దత, ప్రాధాన్యతలు, సాధ్యాసాధ్యాలు, ఆర్ధిక వనరులు, అనుమతులు వంటివేవీ పట్టించుకోకుండా ఇష్టానుసారం ప్రాజెక్టులు మొదలుపెట్టారు. కానీ అదంతా రైతన్నల సంక్షేమం కోసమేనని, తానే అపర భగీరదుడన్నట్లు ప్రచారం చేసుకొని ప్రజల కళ్ళకు గంతలు కట్టేరు. ఇదంతా గమనించినట్లయితే ఆనాడు రాజశేఖర్ రెడ్డి వేల కోట్లు ఖర్చయ్యే జలయజ్ఞం ఎందుకు ప్రారంభించారో అర్ధమవుతుంది. ఆనాడు ప్రభుత్వాలు చేసిన తప్పిదాలకు నేడు ప్రజలు, రైతన్నలు చివరికి ప్రభుత్వం కూడా శిక్ష అనుభవిస్తోంది. నేటి ప్రభుత్వ ఆర్ధిక లోటు, రైతన్నల నెత్తిన అప్పులు, కరెంటు కష్టాలు అన్నీ కూడా గత ప్రభుత్వాల తప్పిదాలు, అవినీతి కారణంగా ఏర్పడినవే.

 

ఇదే విషయాలను చంద్రబాబు తన శ్వేత పత్రాల ద్వారా వెల్లడిస్తూ, ఈ పరిస్థితులను చక్కదిద్ది మళ్ళీ రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు తమ ప్రభుత్వం ఏమేమీ చేయబోతోందో కూడా ఈ సందర్భంగా వివరిస్తున్నారు. రానున్న ఐదేళ్ళ కాలంలో ప్రాధాన్యతను బట్టి అవసరమయిన ప్రాజెక్టులను ముందుగా పూర్తిచేసి పొలాలకు నీళ్ళు అందిస్తామని తెలిపారు. గత పదేళ్లుగా నిర్లక్ష్యం చేయబడిన భూగర్భ జలవనరుల అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషిచేస్తుందని తెలిపారు. అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్ వంటి ఆధునిక పద్దతులలో వ్యవసాయం చేయడానికి తమ ప్రభుత్వం రైతన్నలకు అన్నివిధాల సహాయ పడుతుందని తెలిపారు.

 

గత పదేళ్ళ కాంగ్రెస్ పాలన ఏవిధంగా సాగిందో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు గనుక రానున్న ఐదేళ్ళ కాలంలో ఆయన హామీ ఇస్తున్న విధంగా అభివృద్ధి జరుగుతోందా లేదా అనే విషయాన్ని ప్రజలే స్వయంగా బేరీజు వేసుకోవచ్చును.