రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ నిర్ణయం ప్రకటించగలదా

 

ఒక్క కాంగ్రెస్ అధిష్టానం తప్ప మిగిలిన వారందరూ కూడా రాష్ట్ర విభజనపై ప్రకటనకి ఈరోజు సుమూహుర్తమని భావిస్తున్నారు. అయితే, సమైక్యమా లేక విభజనా? అనే రెండే ప్రత్యమ్నాయాలు తమ ముందు ఉన్నాయని దిగ్విజయ్ సింగ్ చెప్పడం చూస్తే, కాంగ్రెస్ పార్టీకి ఇన్నేళ్ళ తరువాత జ్ఞానోదయం అయినట్లే కనిపిస్తోంది. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే ఒక నిర్దిష్ట అభిప్రాయానికి వచ్చినప్పటికీ, తను ప్రకటించే నిర్ణయంతో రాష్ట్రంలో తనకే పూర్తి ప్రయోజనం పొందాలనే దురాశాతోనే ఇంత కాలం జాప్యం చేస్తోంది.

 

కాంగ్రెస్ తెరాసను లొంగదీయడానికి ప్రయత్నిస్తుంటే, ఎట్టి పరిస్థితుల్లో దాని గాలానికి చిక్కుకోకూడదనే ఆలోచనతో కేసీఆర్ మళ్ళీ తన మౌనదీక్షను మొదలుపెట్టాడు. ఒకప్పుడు తెరాసను పార్టీలో విలీనం చేసుకొందామని భావించిన కాంగ్రెస్, ఆ తరువాత కేసీఆర్, అతని కుటుంబాన్నిభరించడం కష్టమనుకొంది. మళ్ళీ మనసు మార్చుకొని ఇప్పుడు విలీనం కోసం ఒత్తిడి తెస్తోంది. కాంగ్రెస్ తెలంగాణా ఇచ్చినప్పటికీ, తెరాసను పార్టీలో కలుపుకోకుండా వదిలిపెడితే, మళ్ళీ కేసీఆర్ ఆ క్రెడిట్ మొత్తం ఎక్కడ క్లెయిం చేసుకొంటాడో అనే భయం ఉండటం వలన తెలంగాణ ప్రకటనకి ముందుగానే అతనిని లొంగ దీసుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్ర విభజనలో అతిముఖ్యమయిన ‘హైదరాబాద్’ అంశాన్ని అడ్డుపెట్టుకొని అతనిని లొంగదీయాలని ప్రయత్నిస్తునట్లు సమాచారం. ఒకవేళ అప్పటికీ లొంగకపోతే, రాష్ట్ర విభజన చేస్తూ హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా చేసి, కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని కాంగ్రెస్ ఆలోచిస్తోంది.

 

‘యావత్ రాష్ట్ర ప్రజల, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకొంటామని’ నిన్న దిగ్విజయ్ సింగ్ చెప్పడం బహుశః అదే సూచిస్తోంది. హైదరాబాద్ కోసం పట్టుబడుతున్నసీమంధ్ర నేతలు దానిని ఉమ్మడి రాజధాని చేస్తే, విభజనకు అభ్యంతరం చెప్పకపోవచ్చు. అదే విధంగా సీమంధ్రకు కొత్త రాజధాని ఏర్పాటు చేసుకొనేవరకు హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా ఉంచేందుకు తెలంగాణావాదులు కూడా అభ్యంతరం వ్యక్తం చేయకపోవచ్చును. కేసీఆర్ గనుక లొంగకపోతే అందరికీ ‘ఆమోద యోగ్యమయిన ఈ నిర్ణయం’ ప్రకటించి, ఒకవైపు తెలంగాణా ఇచ్చిన క్రెడిట్ తన ఖాతాలో వ్రాసుకొంటూనే, రాజధాని విషయంలో కేసీఆర్ ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేయవచ్చును.

 

అయితే, దానివల్ల కేసీఆర్ కి పెద్దగా వచ్చే నష్టం ఏమి ఉండదు, పైగా హైదరాబాద్ కోసం మరో ఉద్యమం చేసుకొనే గొప్ప అవకాశం అందిస్తుంది. తద్వారా ఇంత వరకు తెలంగాణా సెంటిమెంటుతో దూసుకుపోతున్న కేసీఆర్ రేపు రానున్నఎన్నికలకి హైదరాబాద్ సెంటిమెంటుతో బరిలోకి దిగవచ్చును.

 

ఇక కాంగ్రెస్ తెలంగాణా ప్రక్రియను మొదలుపెడితే, ఇంత కాలం దానికోసమే ఉద్యమాలు చేస్తున్న తెరాస అది తమ పోరాటాల ఫలితంగానే ఏర్పడుతోందని అందులో కాంగ్రెస్ గొప్పతనం ఏమీ లేదని చాటింపు వేసుకొని ఎన్నికలలో ఓట్లు రాబట్టుకోగలదు.

 

కేసీఆర్ ప్రధాన లక్ష్యం తెలంగాణా రాష్ట్రం ఏర్పాటే గనుక, ఒకసారి అది ఏర్పడిన తరువాత ఇక కొత్త రాష్ట్రంలో నిశ్చింతగా రాజకీయాలు చేసుకొంటూ కాంగ్రెస్ తో సహా అన్నిపార్టీలకు అధికారం దక్కకుండా అడ్డుపడగలడు. అందుకే కాంగ్రెస్ అతనిని ముందుగానే లొంగ దీసుకోవాలని ప్రయత్నిస్తుంటే, కాంగ్రెస్ ను తప్పించుకోవడానికే కేసీఆర్ మౌనవ్రతం కంటిన్యూ చేస్తున్నాడు. తన ప్రమేయం లేకుండా తెలంగాణాపై నిర్ణయం జరుగుతున్నపటికీ ఆయన దూరంగా ఉండటం వలన, ఆ ప్రక్రియలో కాంగ్రెస్ చేసే పొరపాట్లకు అతను బాధ్యుడు కాకుండా తప్పించుకోవడమే కాకుండా, వాటినే తన అస్త్రాలుగా మార్చుకొని రేపు జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని డ్డీ కొనవచ్చును.

 

ఈవిధంగా కాంగ్రెస్ తెరాసలు రెండూ కూడా తెలంగాణా అంశంపై పూర్తి ప్రయోజనం పొందాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ దైర్యం తెచ్చుకొని తెలంగాణాపై సానుకూల ప్రకటన చేస్తుందో లేక కేసీఆర్ తో తన రాజకీయ చదరంగం కొనసాగిస్తుందో చూడాలి.