కాంగ్రెస్ మళ్ళీ సెల్ఫ్ గోల్

 

సీమంధ్ర, తెలంగాణా రెండు ప్రాంతాలలో పార్టీ ప్రయోజనాలు కాపాడేందుకు తొలుత రాష్ట్ర విభజనపై రెండు కళ్ళ సిద్ధాంతం దిగ్విజయంగా అమలుపరిచిన చంద్రబాబు, తెరాస నుండి అనేక విమర్శలు ఎదుర్కొనక తప్పలేదు. అయితే ఆయన చూపిన దారిలోనే అధికార కాంగ్రెస్ పార్టీ, వై కాంగ్రెస్ పార్టీలు ముందుకు సాగుతున్నపటికీ, తెలంగాణాలో తనకు బలమయిన ప్రత్యర్ధిగా నిలిచి సవాలు విసురుతున్న తెదేపాను దెబ్బ తీసేందుకు ఆ పార్టీ మీదనే ఇంతకాలం తన అస్త్రాలు సందిస్తూ వచ్చింది తెరాస.

 

కానీ, అఖిలపక్ష సమావేశంలో తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకి అనుగుణంగా తెదేపా లేఖ ఇవ్వడంతో, తెలంగాణా ప్రాంతంలో తేదేపాకు ఒక్కసారిగా మళ్ళీ ఆదరణ పెరిగింది. దానితో ఆ పార్టీని ఏవిధంగా ఎదుర్కోవాలో పాలుపోక, తెలంగాణపై స్పష్టమయిన అభిప్రాయం ప్రకటించాలని తెరాస డిమాండ్ చేయడం మొదలుపెట్టింది. అయితే, చంద్రబాబు పార్టీ ప్రయోజనాలను దృష్టిలోఉంచుకొని స్పష్టమయిన ప్రకటన చేయలేదు.

 

కానీ సీమంధ్రకు చెందిన తెదేపా నేతలెవరూ కూడా తన గీసిన గీత దాటకుండా సమర్ధంగా నియంత్రించడంతో, క్రమంగా ఆయనలోను ఆత్మవిశ్వాసం పెరిగింది. దానితో ముందుగా బయ్యారం గనులను తెలంగాణకు కేటాయించాలని ఆయన ధర్నాలో పాల్గొన్నారు. ఆ తరువాత తెలంగాణా ఏర్పాటుకి తాము అడ్డు చెప్పబోమని ఇటీవలే విస్పష్టంగా ప్రకటించారు. మొన్న ఖాజీపేటలో జరిగిన ప్రాంతీయ సమావేశాలలో తెలంగాణా అమర వీరులకు శ్రద్దాంజలి ఘటించిన చంద్రబాబు, తమ పార్టీ అధికారంలోకి వస్తే అమర వీరుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వోద్యోగాలు ఇస్తామని వాగ్దానం కూడా చేసారు. తెలంగాణా అంశంలో చంద్రబాబు వైఖరిలో స్పష్టమయిన మార్పు వచ్చిందని ఇవన్నీ రుజువు చేస్తున్నాయి.

 

సీమంద్రా నేతలకు తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అనివార్యమని తెలియజేసి అందుకు వారిని మానసికంగా సిద్ధం చేయడం వలన, వారి నుండి వ్యతిరేఖత లేకపోవడంతో ఆయన ఇప్పుడు దైర్యంగా తెలంగాణా విషయంలో స్పందించగలుగుతున్నారు. ఇంత కాలం పార్టీకి తెలంగాణాలో తీవ్రనష్టం కలిగిస్తున్నతన రెండు కళ్ళ సిద్ధాంతాన్ని క్రమంగా పక్కన బెట్టి, ఇప్పుడు స్పష్టమయిన విధానం అవలంబిస్తున్నారు.

 

తెలంగాణా అంశంపై తెదేపాను దెబ్బతీయాలని ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తున్న కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబులో ఈ ఊహించని మార్పు మింగుడు పడటం లేదు. తెరాస మరియు తన టీ-కాంగ్రెస్ నేతల ఒత్తిడి వల్లనే రాష్ట్ర విభజన చేసేందుకు సిద్దపడుతున్న కాంగ్రెస్ పార్టీ, తన నిర్ణయం వలన సీమంద్రాలో తన పార్టీకి నష్టం జరుగకూడదనే దురాలోచనతో, రాష్ట్ర విభజన కేవలం తెదేపా ఇచ్చిన లేఖ వల్లనే జరుగుతోందని ఋజువు చేసేందుకు ఒకవైపు ప్రయత్నిస్తూనే, తెలంగాణా ఏర్పాటు చేసిన ఘనకీర్తిని మాత్రం తన ఖాతాలో వ్రాసుకోనేందుకు విఫలయత్నం చేస్తోంది.

 

తెదేపాను తెలంగాణా అంశంలోఅడ్డుగా ఇరికించి, రానున్న ఎన్నికలలో మళ్ళీ అధికారంలోకి రావాలని కలలు కంటున్న కాంగ్రెస్ పార్టీకి, తను ఆలస్యం చేస్తున్న కొద్దీ క్రమంగా తెదేపా తెలంగాణా అనుకూల వైఖరి ప్రదర్శిస్తూ, అటు తెలంగాణాలోనూ, ఇటు సీమంద్రాలోనూ పట్టు సాదిస్తుండటంతో విధిలేని పరిస్థితుల్లో ‘పది రోజుల్లో తెలంగాణాపై ప్రకటన’ అని గొప్పగా చాటింపు వేసుకొని మళ్ళీ తనే ఇప్పుడు మరో మారు అడ్డుగా దొరికిపోయింది. రోడ్డు మ్యాపులు ఇంకా సిద్ధం కాలేదని, తెరాస విలీనానికి ఒప్పుకోవడం లేదని కుంటి సాకులు చెపుతూ ఇప్పుడు దానినుండి బయటపడేందుకు దారికోసం కాంగ్రెస్ వెదుకులాడుతోంది.

 

ఇప్పడు తెలంగాణపై ప్రకటన చేస్తే, కేసీఆర్ చేతిలోంచి తెలివిగా ఎత్తుకొచ్చిన తెలంగాణా అంశాన్ని మళ్ళీ కేసీఆర్ తెలివిగా హైజాక్ చేసుకొని ఎత్తుకు పోతాడేమోననే బెంగ ఒకవైపు, ప్రకటించకపోతే ‘కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మరో మారు తెలంగాణా ప్రజలను మోసం చేసిందనే అపప్రధతో బాటు, టీ-కాంగ్రెస్ నేతల తిరుగుబాటు కూడా అనివార్యమని గ్రహించిన కాంగ్రెస్ అధిష్టానం ఈ సమస్య నుండి బయటపడేందుకు తిప్పలుపడుతోందిపుడు.