కాంగ్రెస్-వైకాపా-తెరాసలు రహస్య ఒప్పందం చేసుకోన్నాయా?

 

తెలంగాణా విషయం తేల్చమంటూ కాంగ్రెస్ యంపీలు తమ అధిష్టానానికి ఈ నెలాకరు వరకు గడుపు విదించచారు. మరో వైపు తెరాస అధినేత కేసీఆర్ తో మంతనాలు మొదలుపెట్టి, ఆపార్టీలో చేరేందుకు జూన్ 3వ తేదీకి ముహూర్తం కూడా పెట్టేసుకొన్నారు. అయినా, కాంగ్రెస్ అధిష్టానం నుండి కనీస స్పందన కూడా లేదింత వరకు. కానీ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మాత్రం ‘పార్టీని వీడి వెళ్ళేవారిని పట్టుకొని వ్రేలాడలేము కదా’ అని వ్యాక్యానించడం పార్టీ అధిష్టానం అభిప్రాయానికి అద్దం పడుతున్నట్లుంది. తమ యంపీలు పార్టీ వీడి వెళ్లిపోయేందుకు సిద్దంగా ఉన్నారని కాంగ్రెస్ అధిష్టానానికి తెలిసినా అది పట్టించుకోవడం లేదంటే, అది ఉద్దేశ్యపూర్వకంగానే వదులుకొనేందుకు నిర్ణయించుకొనట్లు అర్ధం అవుతుంది.

 

ఇప్పుడు మనం కొంచెం ఫ్లాష్ బ్యాకులోకి వెళితే, కొన్నినెలల క్రితం తెలంగాణా కోసం లాబీయింగ్ చేయడానికని డిల్లీ వెళ్ళిన కేసీఆర్ కనబడతారు. అక్కడ దాదాపు నెలరోజులు మకాం వేసిన ఆయన తమ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాడానికి కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు సాగించిన సంగతి కూడా మనకి కనబడుతుంది. కానీ, అవి బెడిసి కొట్టాయని ఆయనే ఆ తరువాత స్వయంగా ప్రకటించారు.

 

ఇదంతా కూడా కాంగ్రెస్-తెరాసల వ్యూహంలో భాగమే అయిఉండవచ్చునేమో! రాబోయే ఎన్నికలలో రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలోకి రావాలంటే కాంగ్రెస్ పార్టీకి తెరాస మద్దతు అత్యవసరమని తెలుసు. ఆ పార్టీ మద్దతు లేనిదే తెలంగాణాలో ఆశించినమేర సీట్లు రావని కూడా తెలుసు. అదేవిధంగా తెలంగాణాలో జగన్ మరియు చంద్రబాబులను నిలువరించాలంటే తప్పని సరిగా తెరాసతో చేతులు కలపాలి. అప్పుడే తెలంగాణాలో ఎన్నికలు ఏకపక్షం అవుతాయి. లేకుంటే ఆ నాలుగు పార్టీలమధ్య ఓట్లు చీలక తప్పదు.

 

కనుక, ఆ పార్టీలు తెర వెనుక చేతులు కలిపినప్పటికీ పైకి ఒకరినొకరు తిట్టుకొంటూ బద్ధ శత్రువులు లాగ ప్రవర్తిస్తుండవచ్చును. ఆ వ్యూహంలో భాగంగానే కేంద్ర కాంగ్రెస్ మంత్రులు అప్పుడప్పుడు అగ్నికి ఆజ్యం పోస్తూ తెలంగాణపై అసందర్భ వ్యాక్యలు చేస్తుండి ఉండవచ్చును.

 

మొన్న కేశవ్ రావు డిల్లీలో సోనియా గాంధీని కలిసి వచ్చిన తరువాత తెలంగాణాతో సహా అన్ని విషయాలపై కూలకుషంగా చర్చించామని, ఆ చర్చలతో తానూ చాలా సంతృప్తి చెందానని చెప్పిన రెండు రోజులకే, ఏఐసీసి ప్రతినిధి పీసీ చాకో ‘తెలంగాణా అంశం అసలు యుపీయే ఎజెండాలోనే లేదని’ ఒక అసందర్భ ప్రకటన చేయడం, వెంటనే తెరాస అధినేత కేసీఆర్ కాంగ్రెస్ యంపీలతో భేటీ అవడం, వారు పార్టీ మారుతారని ప్రకటించడం, అయినా కాంగ్రెస్ అధిష్టానం ఇంతవరకు స్పందించకపోవడం గమనిస్తే ఇదంతా చాలా నాటకీయంగా జరుగుతున్నట్లు అర్ధం అవుతుంది.

 

కాంగ్రెస్, తెరాసలు ప్రస్తుతం బద్ధ శత్రువులుగా నటిస్తూ కత్తులు దూసుకొంటున్నపటికీ, తెలంగాణా ప్రాంతం నుండి తెదేపా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలను దూరం పెట్టేందుకు తెర వెనుక చేతులు కలుపుతున్నట్లు కనిపిస్తోంది. సరిగ్గా ఎన్నికల ముందుగానో, తరువాతనో కాంగ్రెస్ పార్టీ తెలంగాణా అనుకూలంగా ఒక ప్రకటన చేసి, అప్పటి రాజకీయ పరిస్థితులను బట్టి ఆ రెండు పార్టీలు ఎన్నికల పొత్తులు పెట్టుకోవడమో లేకపోతే తెరాస వెళ్లి కాంగ్రెస్ పార్టీలో కలిసి పోవడమో జరిగినా ఆశ్చర్యం లేదు.

 

తద్వారా తెరాసకు తెలంగాణా సాదించిన ఘనతను కాంగ్రెస్ అప్పగిస్తే, రాష్ట్రంలో, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పరచేందుకు తెరాస కాంగ్రెస్ పార్టీకి సహకరించేలా ఆ రెండు పార్టీల మద్య రహస్య ఒప్పదం జరిగి ఉండవచ్చును. ఈ రహస్య ఒప్పందం గురించి మొన్న కేశవ్ రావుకి, అంతకు ముందు తెలంగాణా కాంగ్రెస్ యంపీలకు కాంగ్రెస్ అధిష్టానం వివరించబట్టే వారిలో కొందరు అకస్మాతుగా నిశబ్ధం అయిపోగా మరికొందరు ఆ వ్యూహంలో భాగంగా త్వరలో కాంగ్రెస్ పార్టీని వీడి తెరాసలో చేరుతున్నట్లు చాటింపు వేసుకొంటున్నారేమో.

 

అంతిమంగా కాంగ్రెస్, తెరాసలు రెండూ కలిసిపోయినప్పుడు తెలంగాణా కాంగ్రెస్ యంపీలందరు మళ్ళీ ఎటూ కాంగ్రెస్ సముద్రంలోనే తేలుతారు గనుక, రెండు పార్టీల వ్యూహ ప్రకారం వారు కాంగ్రెస్ లోంచి తెరసలోకి దూకుతున్నట్లు నటిస్తున్నారేమో. ఈ లోగా కేసీఆర్ ‘మనకి ఆంధ్రా పార్టీలు వద్దంటూ’ ప్రచారం మొదలుపెట్టి తెదేపా, వైకాపాలపై ‘సీమాంధ్ర ముద్ర’ వేసి వాటిని తెలంగాణా నుండి బయటకి పంపే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.

 

ఒకవేళ కేసీఆర్ రహస్య ఒప్పందం ప్రకారం నడుచుకోకపోతే కాంగ్రెస్ పార్టీ తన చేతిలో ఉన్న చిలుకలను ఆయనపైకి విడిచే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే, తెరాసను వీడిన రఘునందన్ రావు తెరాస నేతల అవినీతి భాగోతాల చిట్టాలను సీబీఐ చేతిలో పెట్టి వచ్చారు గనుక, ఏ కారణం చేతయినా తెరాస నేతలు తోక జాడిస్తే, వారు కూడా చంచల్ గూడా జైలులో తేలే అవకాశం ఉంది.

 

కాంగ్రెస్-తెరాసలు నిజంగా ఈ వ్యూహం అమలుచేస్తున్నట్లయితే తెలంగాణాలో తెదేపా, వైకాపాలు ఇక గెలుపు సంగతి మరిచిపోవలసిందే.

 

ఇక, కొన్ని నెలల క్రితం విజయమ్మ, కొద్ది రోజుల క్రితం షర్మిల, నిన్న భారతి అందరూ కూడా ముక్త కంఠంతో కాంగ్రెస్ పార్టీకే తమ మద్దతు అని ప్రకటిస్తునందున, సీమంద్రా జిల్లాలలో కూడా కాంగ్రెస్-వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఇదేరకమయిన వ్యూహం అమలు చేస్తునట్లు కనిపిస్తోంది. జగన్ జైలు నుండి విడుధలవ్వాలంటే కాంగ్రెస్ పార్టీలో చేరక తప్పదు అని రైల్వే మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రావు ఇదివరకే స్పష్టం చేసారు.

 

అందువల్ల అక్కడ తెలంగాణా, ఇక్కడ జగన్ విడుదల అనే రెండు అంశాలతో కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికలలో తేదేపాకు చెక్ పెట్టే అవకాశం ఉంది.